పింఛన్లలో చిల్లర కొట్టుడు!


Tue,October 15, 2019 01:33 AM

-ఆసరా పింఛన్లలో లబ్ధిదారులకు అందని రూ.16
-ఇస్తున్నది రూ.2000, రూ.3000లే.. పై చిల్లర హాంఫట్
-ఒక్కో గ్రామంలో రూ.5 వేల వరకు వెనకేసుకుంటున్న మాస్టర్లు!
-నిలదీసి అడిగిన వారికి పెద్దనోటు ఇచ్చి తిప్పిస్తున్న వైనం
-చిల్లర రూ.16 ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటాం : డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ప్రభుత్వం ప్రతి నెలా అందించే పింఛన్లలో పోస్టుమాస్టర్లు చిల్లరను వెనుకేసుకుంటున్నారు. ఆసరా పింఛన్ల డబ్బులకు చిల్లరను సాకుగా చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమగ్ర కుటుంబసర్వే నిర్వహించింది. దీని ఆధారంగా 2014 అక్టోబర్ ఒకటి నుంచి ఈ పింఛన్ డబ్బులను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. దివ్యాంగులకు ప్రతినెలా రూ.1500, మిగతా వారికి రూ. వెయ్యి చొప్పున పింఛన్ డబ్బులు అందిస్తోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పింఛన్ల డబ్బులను రెట్టింపు చేసి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. గతంలో దివ్యాంగులకు నెలకు రూ.1500 ఉండగా.. రూ. 3016, మిగతా వారికి గతంలో నెలకు రూ.వెయ్యి పింఛన్ ఉండగా.. రూ. 2016 చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడంతో.. జూలై నెల నుంచి పింఛను డబ్బులు పెంచి ఇస్తోంది. దివ్యాంగులకు రూ.3016, మిగతా వారికి రూ.2016చొప్పున అందిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపాలిటీల్లో పింఛనుదారుల ఖాతాల్లో నేరుగు డబ్బులు జమ చేస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో బయోమెట్రిక్ ద్వారా పోస్టుమాస్టర్లు ప్రతి నెలా పింఛన్ డబ్బులు అందజేస్తున్నారు. వేలిముద్రలు సరిగా పడని వారికి స్థానిక గ్రామ పంచాయతీ ధ్రువీకరణతో అందిస్తున్నారు. పోస్టాఫీసులు, గ్రామ పంచాయతీల్లో ప్రతి నెలా పింఛన్‌దారులకు డబ్బులు అందజేస్తున్నారు.

జిల్లాల వారీగా వివరాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3,59,023మంది పింఛన్లు తీసుకోగా.. నిర్మల్ జిల్లాలో 1,47,320మంది, ఆదిలాబాద్ జిల్లాలో 68,531మంది, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 51,206మంది, మంచిర్యాల జిల్లాలో 91,966మంది చొప్పున ప్రతి నెలా పింఛన్లు తీసుకుంటున్నారు. నిర్మల్ జిల్లాలో 1,26,500మంది గ్రామీణ ప్రాంతాల్లో, 20,820మంది పట్టణ ప్రాంతాల్లో ప్రతి నెలా పింఛన్లు పొందుతున్నారు. జిల్లాలో నిర్మల్, భైంసా మున్సిపాలిటీలు ఉండగా.. ఇక్కడ మాత్రం పింఛనుదారుల ఖాతాల్లో ప్రతి నెలా డబ్బులు జమ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 58,452మంది, పట్టణ ప్రాంతాల్లో 10,079మంది పింఛనుదారులు ఉన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మాత్రమే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 44,034మంది గ్రామీణ ప్రాంతాల్లో, 7,172మంది పట్టణ ప్రాంతాల్లో పింఛన్లు పొందుతున్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో మాత్రమే పింఛనుదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 63,868 మంది గ్రామీణ ప్రాంతాల్లో 28,098మంది పట్టణ ప్రాంతాల్లో పింఛన్లు తీసుకుంటున్నారు. జిల్లాలో చెన్నూర్, మందమర్రి, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 3,59,023 మందికి పింఛన్లు
ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,59,023మందికి ప్రభుత్వం పింఛన్లు ఇస్తుండగా.. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 2,92,854మంది, పట్టణ ప్రాంతాల్లో 66,169మంది పింఛన్లు పొందుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం బయో మెట్రిక్ ద్వారా పోస్టుమాస్టర్లు ప్రతి నెలా పింఛను డబ్బులు ఇస్తున్నారు. గతంలో దివ్యాంగులకు రూ.1500, ఇతరులకు రూ.వెయ్యి చొప్పున ఇస్తుండగా.. పూర్తిగా డబ్బులు పింఛన్‌దారులకు అందేవి. ఇటీవల ప్రభుత్వం పెంచిన ప్రకారం పింఛన్లు ఇస్తుండగా.. చాలా చోట్ల పోస్టు మాస్టర్లు చిల్లర లేవనే సాకుతో చిలక్కొట్టుడు కొడుతున్నారు. దివ్యాంగులకు రూ.3016, ఇతరులకు రూ.2106చొప్పున ప్రభుత్వం ఇస్తుండగా.. పోస్టు మాస్టర్లు మాత్రం దివ్యాంగులకు రూ.3వేలు, ఇతరులకు రూ.2వేల చొప్పున ఇస్తున్నారు. రూ.500, 2వేల నోట్లు ఉన్నాయని.. చిల్లర రూ.16లేవని చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు చేసేదేం లేక.. రూ.16తీసుకోకుండానే వెళ్లిపోతున్నారు. కొందరు నిలదీసి.. గట్టిగా అడిగితే మాత్రం రూ.2వేలు, రూ.500నోట్లు ఉన్నాయని.. చిల్లర తెచ్చి ఇవ్వాలని చెబుతున్నారు. దీంతో చిల్లర కోసం తిరగలేక.. సరేలే అని సర్దుకుపోతున్నారు. రూ.16 చిల్లర పైసలే గదా.. అని లబ్ధిదారులు వదిలేస్తుంటే.. పోస్టుమాస్టర్లకు మాత్రం ప్రతి నెలా కాసుల వర్షం కురుస్తోంది. ఒక్కో గ్రామంలో రూ.5వేల నుంచి రూ.10వేల వరకు మిగులుతుందంటే ఆశ్యర్యం లేదు.

పింఛన్ల వివరాలు
నిర్మల్ జిల్లాలో 1,47,320మందికి ప్రభుత్వం పింఛన్లు ఇస్తోంది. ఇందులో 32,594మంది వృద్ధులు, 37,251మంది వితంతువులు, 10,505 మంది దివ్యాంగులు, 283మంది గీత కార్మికులు, 47మంది చేనేత కార్మికులు, 2,150మంది ఒంటరి మహిళలు, 63,157మంది బీడీ కార్మికులు, 1,333మంది బోధకాల వారు పింఛన్లు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 68,531మంది పింఛన్లు తీసుకోగా.. ఇందులో 24,890మంది వృద్ధులు, 29,209మంది వితంతువులు, 7,237మంది దివ్యాంగులు, 44మంది గీత కార్మికులు, 22మంది చేనేత కార్మికులు, 2,094మంది ఒంటరి మహిళలు, 5,035మంది బీడీ కార్మికులు పింఛన్లు తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో 92,641మంది పింఛన్లు తీసుకుంటున్నారు. ఇందులో 34,679మంది వృద్ధులు, 38,998మంది వితంతువులు, 12,933మంది దివ్యాంగులు, 931మంది గీత కార్మికులు, 294మంది చేనేత కార్మికులు, 2,457మంది ఒంటరి మహిళలు, 2,349మంది బీడీ కార్మికులు పింఛన్లు తీసుకుంటున్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 51,206 మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఇందులో 20,366 మంది వృద్ధులు, 20,506మంది వితంతువులు, 6,694 మంది దివ్యాంగులు, 121మంది గీత కార్మికులు, 481మంది చేనేత కార్మికులు, 2,590మంది ఒంటరి మహిళలు, 70మంది బీడీ కార్మికులు, 378మంది బోదకాల వారు పింఛన్లు తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో 91,966 మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఇందులో 33,779 మంది వృద్ధులు, 39,137 మంది వితంతువులు, 12,958 మంది దివ్యాంగులు, 945మంది గీత కార్మికులు, 311మంది చేనేత కార్మికులు, 2,339మంది ఒంటరి మహిళలు, 2,497మంది బీడీ కార్మికులు పింఛన్లు తీసుకుంటున్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...