- ఉమ్మడి జిల్లాలో 1,014 ఎస్జీటీ పోస్టుల భర్తీ
- కేటగిరీల వారీగా ఉపాధ్యాయుల నియామకం
- రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం
ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు త్వరలో కొత్త సార్లు రానున్నారు. 2017లో టీఆర్టీ ద్వారా తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఎస్జీటీల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల నియామకం కోసం ఎంపిక ప్రక్రియ చేపట్టారు. తెలుగు మీడియానికి సంబంధించిన ఫలితాలు విడుదల కాగా.. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలలో 1,014 ఖాళీలను అధికారులు త్వరలో భర్తీ చేయనున్నారు. వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి అధికారులు ప్రాధాన్యత క్రమంలో కేటగిరి 3, కేటగిరి 2, కేటగిరి1 వారీగా నియామకాలు చేపట్టనున్నారు. కొత్త సార్ల రాకతో సర్కారు స్కూళ్లలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగు పడనున్నాయి.
విద్యాశాఖలో ఉపాధ్యాయుల భర్తీ కోసం నిర్వహించిన టీఆర్టీలో ఎస్జీటీల ఎంపిక పూర్తికాగా టీఎస్పీఎస్ వెబ్సైట్లో ఎంపికైన వారి వివరాలను అందుబాటులో ఉంచారు. 2017లో టీఆర్టీ ద్వారా తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఎస్జీటీల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉపాధ్యాయుల నియామకం కోసం ఎంపిక ప్రక్రియను చేపట్టారు. తెలుగు మీడియానికి సంబంధించిన ఫలితాలు విడుదల కాగా.. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలలో 1,014 ఖాళీలను అధికారులు త్వరలో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వం పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు పటిష్టమైన ప్రణాళికను రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుతో పాటు సర్కారు స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నది. తెలుగు, ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఎస్జీటీ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టగా.. టీఎస్పీఎస్ వెబ్సైట్లో ఎంపికైన వారి వివరాలను అందుబాటులో ఉంచారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్జీటీ తెలుగు మీడియంలో 1,014 ఖాళీలు ఉండగా.. ఏజెన్సీలో 425, మైదాన ప్రాంతాల్లో 589 పోస్టులు ఉన్నాయి. వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి అధికారులు ప్రాధాన్యత క్రమంలో కేటగిరి 3, కేటగిరి 2, కేటగిరి 1 వారీగా నియామకాలను చేపట్టనున్నారు. కేటగిరి 3లో గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు పాఠశాలల్లో విద్యార్థులు ఉండి ఉపాధ్యాయులు లేని చోట నియామకాలు జరుపుతారు. కేటగిరి2లో సెమీ అర్బన్ ప్రాంతాల్లోని ఖాళీలు, కేటగిరి 1లో పట్టణ ప్రాంతాల్లోని ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన షెడ్యూల్ త్వరలో విడుదల కానున్నట్లు విద్యశాఖ అధికారులు తెలిపారు.
రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల..
ఉమ్మడి జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయుల నియామకం కోసం నేడో రేపో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. షెడ్యూల్ విడుదల కాగానే సూచించిన తేదీల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. మూడు కేటగిరిల వారీగా ప్రాధాన్యత క్రమంలో ఉపాధ్యాయులను వివిధ పాఠశాలల్లో నియమిస్తాం. విద్యార్థులు ఉండి ఉపాధ్యాయులు అసలే లేని పాఠశాలలకు మొదట ప్రాధాన్యత ఇస్తాం. అనంతరం కేటగిరి 2, 1ల్లో నియామకాలు చేపట్టాం. నాలుగు జిల్లాల్లో ఖాళీలను ఆయా డీవో కార్యాలయంలో అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటాం.
- రవీందర్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి