బస్సులు ఫుల్‌!


Sun,October 13, 2019 01:10 AM

నిర్మల్‌ అర్బన్‌, నమస్తేతెలంగాణ: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాటికి ఎనిమిదో రోజుకు చేరింది. కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ, రవాణ శాఖాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతున్నారు. జిల్లాలో డిపోల నుంచి సంస్థకు చెందిన బస్సులతో పాటు అద్దె, ప్రైవేట్‌ వాహనాలు ప్రతి రూట్‌లో యథావిధిగా రాకపోకలు సాగిస్తున్నాయి. పండుగకు సొంత ఊళ్లకు వచ్చిన వాళ్లు ఏ ఆటంకం లేకుండా తిరుగుప్రయాణమవుతున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ, పోలీసు, రవాణాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శనివారం నిర్మల్‌ నుంచి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌తో పాటు ఇతర జిల్లాలకు బస్సు సర్వీసులు నడిపామని డీఎం ఆంజనేయులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నగరాలకు అదనపు సర్వీసులు నడుపుతున్నామన్నారు.

టికెట్లు జారీ చేసిన డీఎం
టికెట్‌పై ప్రయాణికుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు నిర్మల్‌ డిపో పరిధిలోని కొన్ని సర్వీసుల కండక్టర్లకు శిక్షణ ఇచ్చి బస్‌ టికెట్లు అందజేశారు. ఉదయం డిపో నుంచి బస్సులు బయలుదేరగా ప్రత్యేక కౌంటర్‌ ద్వారా టికెట్లు జారీ చేశారు. టార్గెట్‌లో సైతం తేడా వచ్చే అవకాశాలు ఉండవని, మరి కొన్ని బస్సుల్లో టికెట్లు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఎం తెలిపారు.

జిల్లాలో 245 వాహనాలు
జిల్లాలోని భైంసా, నిర్మల్‌ ఆర్టీసీ డీపోల పరిధిలో శనివారం 245 వాహనాలు రాకపోకలు సాగించాయి. 72 ఆర్టీసీ, 78 అద్దె బస్సులు, 95 ప్రైవేట్‌ వాహనాలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. కండక్టర్లు ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని డీఎం ఆంజనేయులు స్పష్టం చేశారు.

జిల్లాకేంద్రంలో ధర్నా
సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు శనివారం జిల్లా కేంద్రంలోని త్యాగాల చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, సీపీఐ నాయకులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. అనంతరం మహిళా సిబ్బంది గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

భైంసా పట్టణం నుంచి..
భైంసా, నమస్తేతెలంగాణ : పట్టణంలోని బస్టాండ్‌ నుం చి వివిధ ప్రాంతాలకు ప్రయాణికుల రాకపోకలు సాఫీగా కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్‌, నిర్మల్‌, ధర్మాబాద్‌, హైదరాబాద్‌ వైపు ప్రయాణించే వారికి ఇబ్బందులు కలగకుండా బస్సు సర్వీసులు నడిపిస్తున్నారు. అదనపు ఎస్పీ రాజేశ్‌ భల్లా, పట్టణ సీఐ వేణుగోపాల్‌రావు పర్య వేక్షణలో పోలీసు సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపడుతున్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...