రోటా వ్యాక్సిన్‌నుసద్వినియోగం చేసుకోవాలి


Sat,September 14, 2019 04:13 AM

-ఆరోగ్యవంతమైన సమాజమే ప్రభుత్వ లక్ష్యం
-జిల్లా దవాఖానలో కేసీఆర్‌కిట్‌తో ప్రసవాలు పెరిగాయి..
-రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

పిల్లల మరణాలను తగ్గించి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం రోటా వైరస్ వ్యాక్సిన్‌ను అందిస్తున్నదని, వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పిల్లలకు రోటావైరస్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ప్రసూతి దవాఖానలో శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోని 96 దేశాల్లో ఇమ్యూనైజేషన్ కార్యక్రమం ద్వారా రోటా వైరస్ వ్యాక్సిన్‌ను పిల్లలకు అందిస్తున్నారన్నారు. నీళ్ల విరేచనాలతో బాధపడే పిల్లల్లో 40శాతం మంది రోటావైరస్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారన్నారు. ప్రతి ఏడాది 80 నుంచి 90 వేల మంది పిల్లలు మరణిస్తున్నారని తెలిపారు. శిశువు జన్మించిన తరువాత ఆరు, పది, పధ్నాలుగు వారాలలో 2.5 ఎంఎల్ మోతాదులో 6 ఎంఎల్ సిరంజీతో నోటి ద్వారా వ్యాక్సిన్ ఇస్తారన్నారు.

ప్రభుత్వ దవాఖానలో పెరిగిన ప్రసవాలు
కేసీఆర్ కిట్ల పంపిణీతో జిల్లా ప్రసూతి దవాఖానలో ప్రసవాల సంఖ్య 63 శాతానికి చేరిందని, వీటిని 90 శాతానికి పెంచాలని వైద్యులకు మంత్రి అల్లోల సూచించారు. విష జ్వరాలు ప్రబలకుండా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాత వస్తువులు, టైర్లు, ప్లాస్టిక్ వస్తువులను తొలగించాలని నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

జిల్లా వైద్యాధికారి వసంత్‌రావు మాట్లాడుతూ జిల్లాలో 1,1519మంది పిల్లలకు రోటా వైరస్ వ్యాక్సిన్ ఇవ్వడం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్, కార్తిక్, శ్రీనివాస్, ప్రసూతి దవాఖన ఇన్‌చార్జి రజని, సుభాష్‌రావు, మాజీ ఎమెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...