అడవులను రక్షించుకోవడం మన అందరి బాధ్యత


Fri,August 16, 2019 01:47 AM

దస్తురాబాద్ : అడవులను రక్షించుకోవడం మన అందరి బాధ్యత అని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మండలంలోని రేవోజిపేటలో గురువారం నిర్వహించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, ఎస్పీ శశిధర్‌రాజు, ఉద్యానవన రాష్ట్ర కమిషనర్ వెంకటరాంరెడ్డి, గ్రామ సర్పంచ్ దీటి సుజాత, గ్రామస్తులతో కలిసి ప్రాథమిక పాఠశాలలో ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. రాష్ట్రంలో 33 శాతం అడవుల విస్తీర్ణం ఉండాల్సిందని కానీ ప్రస్తుతం 24 శాతం విస్తీర్ణంలో అడవులున్నాయన్నారు. అడవులు ఉంటేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అన్నారు. మన కన్నబిడ్డాల్లా అడవులను రక్షించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. నాటిన మొక్కల్లో 85శాతం మొక్కలు సంరక్షించని పక్షంలో నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. రైతులు ఫామాయిల్ మొక్కల ద్వారా లాభాలు ఆర్జించే అవకాశం ఉందన్నారు. అలాగే పొలాల గట్లపై చింతచెట్లు పెంచితే సంవత్సరానికి రూ.40వేల వరకు ఆదాయం సమకూర్చుకోవదని, ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ సైతం చెప్పారన్నారు. మొక్కలు నాటిన విద్యార్థులకు నోట్ పుస్తకాలు, దుస్తు పంపిణీ చేశారు. మొక్కలను బతికిస్తే విద్యార్థికి రూ.5 వేల చొప్పున ప్రోత్సాహకం అందజేస్తామని ఉద్యావన కమిషనర్ వెంకట్‌రాంరెడ్డి హమీ ఇచ్చారు.

నెలాఖరులోగా కాళేశ్వరం నీళ్లు..
ఈ నెలాఖరులోగా కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు వస్తాయని మంత్రి అన్నారు. కడెం ప్రాజెక్ట్‌పై ఆధార పడే రైతులు సంతోషంగా పంటలు వేసుకోవచ్చని అన్నారు. మామడ మండలం పొన్కల్ సమీపంలో సదర్‌మాట్ బ్యారేజీపై గేట్ల నిర్మాణ పనులు త్వరలో పూర్తవుతాయన్నారు.

రామాలయం నిర్మాణానికి రూ.50 లక్షలు
గ్రామంలో రామాలయం నిర్మాణానికి రూ.50 లక్షలు మంజురు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆరు నెలల్లో నిర్మాణ పనులు పూర్తవుతాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు కిషన్, అల్జెండర్, జడ్పిటీసీ శారద, వైస్ ఎంపీపీ భూక్య రాజన్న, తాసిల్దార్ విశ్వంభర్, ఏఎస్సీ దక్షిణామూర్తి, డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఐలయ్యయాదవ్, సహకార సంఘం చైర్మన్ చుంచు భూమన్న, జిల్లా అటవీ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా,మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...