పల్లె ప్రగతికి పక్కా ప్రణాళిక


Wed,August 14, 2019 12:57 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : గ్రామాలు ప్రగతి బాట పట్టనున్నాయి. గ్రామాల్లో మార్పు తేవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. ఇందు గాను రెండు మాసాల ప్రత్యేక కార్యాచరణ అమలుకు ఇటీవల సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు ఖాళీలను భర్తీ చేయడం, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పంచాయతీరాజ్ ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు, జిల్లా, మండల పరిషత్‌లకు నిధులు, విధులు అప్పగించనున్నారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతున్నది.

60 రోజుల ప్రణాళికతో ముందుకు..
జిల్లాలో 18 మండలాలు, 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే గ్రామస్థాయిలో ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించడం పూర్తయింది. డివిజన్ స్థాయిలో అధికారులకు బాధ్యతల అప్పగింత కార్యక్రమం ఖరారైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈవోపీఆర్డీల నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. 60 రోజుల ప్రణాళికతో గ్రామాలు అభివృద్ధి దిశగా పయనించనున్నాయి. పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేయాలనే సంకల్పంతో సీఎం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో పంచాయతీ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం అధికారులను గుర్తించే పని కొనసాగుతున్నది. నూతన పంచాయతీరాజ్ చట్టంలో పొందుపర్చిన విధంగా గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలను అప్పగించారు. దీనికి తోడుగా బాధ్యతలను సైతం అప్పగించే పనిలో పడ్డారు. ప్రతి గ్రామంలో మార్పు తేవాలనే సీఎం ఆలోచనకు అనుగుణంగా రెండు నెలల ప్రత్యేక కార్యాచరణ అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు కొనసాగున్నాయి. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు ఖాళీలను భర్తీ చేయడం, సంబంధిత అధికారులకు బాధ్యతలు అప్పగించడం వంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనున్నది. ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న పంచాయతీరాజ్ ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు ఇవ్వడంతో పాటు ఖాళీలను భర్తీ చేయడం, గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యే ఈవోపీఆర్డీ పేరు మార్చడం (మండల పంచాయతీ ఆఫీసర్), ఖాళీలను భర్తీ చేయడం లాంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం అందించిన సంకేతాలకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. మార్గదర్శకాలు, ఆదేశాలు అందిన తర్వాత మరింత వేగం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది.

నిధులు.. విధులు..
నూతన ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాలు, 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించడం ఇప్పటికే పూర్తయింది. జిల్లాలో ఖాళీగా ఉన్న ఈవోపీఆర్డీల నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అధికార యంత్రాంగం పంపించింది. ఉద్యోగోన్నతుల ద్వారా పూర్తిచేయడంతో పాటు కార్యదర్శుల నియామకాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ రెండు మాసాల ప్రత్యేక కార్యాచరణతో పారిశుద్ధ్యం, పచ్చదనంతో పాటు పల్లెల వికాసానికి పారదర్శకంగా పథకాల అమలు, పంచాయతీల బాధ్యతలు, హక్కులు తదితర విషయాలపై 60 రోజుల కార్యాచరణ రూపొందించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమిచ్చే మార్గదర్శకాలు, త్వరలో తీసుకోనున్న నిర్ణయాల అనంతరం సమగ్ర స్వరూపానికి బాటలు వేయనున్నది. 60 రోజుల కార్యాచరణ పూర్తయితే పల్లెల సమగ్ర అభివృద్ధి, పారిశుద్ధ్యం, పచ్చదనం మరింత వేగంగా ముందుకు సాగనున్నది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాక వాటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను కేటాయిస్తుంది. తద్వారా కార్యాచరణ ప్రణాళికలను గ్రామాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...