హాజరు మాసోత్సవానికి స్పందన


Wed,August 14, 2019 12:57 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి విద్యాశాఖ చేపట్టిన హాజరు మాసోత్సవం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నది. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం 31 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తున్నది. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడికి పంపితే కలిగే ప్రయోజనాలను తెలియజేసేందుకు ఉపాధ్యాయులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమంగా బడికి పంపుతున్నారు. ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తున్న ఓ విద్యార్థిని కలెక్టర్ సైకిల్‌ను బహూకరించారు.
ప్రభుత్వం పేద విద్యార్థుల చదువులకు పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి వారికి కార్పొరేట్ చదువులు అందేలా చర్యలు తీసుకుంటున్నది. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం చదువులను అందిస్తున్నది. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి మధ్యలో చదువులు మానేసిన పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది.

విద్యార్థులు పలు కారణాలతో బడులకు సక్రమంగా వెళ్లడం లేదు. పలు కారణాలతో పాఠశాలకు గైర్హాజరువుతున్నారు. విద్యార్థులు రెగ్యులర్‌గా పాఠశాలకు రాకపోవడంతో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వారికి అర్థం కావడం లేదు. దీంతో వారి చదువులపై ప్రభావం పడుతున్నది. ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునే విద్యార్థులు క్రమం తప్పకుండా బడికి వచ్చేలా అధికారులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యాశాఖ అధికారులు ఆగస్టు నెలను హాజరు మాసోత్సవంగా ప్రకటించారు. ఆగస్టు 1న ప్రారంభమై ఈ కార్యక్రమం 31 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ విద్యా సంవత్సరంలో జూన్, జూలైలో పాఠశాలలకు గైర్హాజరవుతున్న విద్యార్థుల జాబితాను తయారు చేశారు. ఆయా పాఠశాలల్లో చదువుకుంటూ బడికి సరిగా రాని విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, స్కూల్‌కు సరిగా రాకపోతే కలిగే నష్టాలను వారికి వివరిస్తున్నారు. జిల్లాలో చేపట్టిన హాజరు మాసోత్సవానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే తమ పిల్లలను రెగ్యులర్‌గా పంపుతామని తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు భరోసా ఇస్తున్నారు.

రెగ్యులర్‌గా బడికి వస్తే బహుమతులు
బడికి రోజూ వచ్చే విద్యార్థుల పేర్లను ఆయా పాఠశాలల్లో బోర్డులపై రాయడంతో పాటు వారికి బహుమతులు ఇవ్వనున్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థినికి కలెక్టర్ సైకిల్ బహుమతిగా ఇచ్చారు. ఈ నెల 15 వరకు బడికి రెగ్యులర్‌గా వచ్చిన విద్యార్థులకు సైకిళ్లతో పాటు ఇతర బహుమతులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. హాజరు మాసోత్సవం కార్యక్రమంలో యువత, స్వచ్ఛంద సంస్థలు, మహిళా స్వయం సహాయక సంఘాలను భాగస్వాములు చేస్తున్నారు. వీరు విద్యార్థులు బడికి రాకపోవడానికి గల కారణాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. అనారోగ్య కారణాలతో పాఠశాలలకు రాని విద్యార్థులకు వైద్యం అందిస్తారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...