ఆయకట్టుకు సాగునీరు


Sat,July 20, 2019 04:02 AM

నిర్మల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి జిల్లాలోని మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల కింద పూర్తి స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు.. కొత్తగా ఆయకట్టు స్థిరీకరించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంది. ఇందుకోసం 2016-17లో డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ప్లాన్ (డీఐపీ) రూపొందించి అమలు చేసేందుకు నిర్ణయించారు. ఈ జిల్లా సాగునీటి ప్రణాళికలో భాగంగా జిల్లాలో ఆరు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, 13మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు చాలా వరకు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెరువులను తీసుకున్నారు. మైనర్ ఇరిగేషన్‌లో జైకా నిధులతో 45స్కీంలు చేపట్టగా.. 2701 మిగతా పనులకు నిధులు కేటాయించారు. పాజెక్టుల గేట్లు చెడిపోయి లీకేజీ కావడం, ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, సబ్ మైనర్లు చెడిపోవడం, ఆయకట్టులో భూముల అచ్చుకట్టు లేకపోవడంతో పూర్తి స్తాయిలో ఆయకట్టుకు నీరందడం లేదు. ఆరు ప్రాజెక్టులను ప్రధాన మంత్రి క్రిషి సంచాయ్ యోజన పథకంలో భాగంగా పూర్తి స్థాయి మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. 2016-17కు ముందు ఉన్న ఆయకట్టులో గ్యాప్ ఆయకట్టును జిల్లా సాగునీటి ప్రణాళిక అమలు తర్వాత తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.

ఆరు ప్రాజెక్టుల కింద తగ్గిన ఆయకట్టు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మేజర్ ఇరిగేషన్ ద్వారా ఆరు ప్రాజెక్టుల కింద గ్యాప్ ఆయకట్టు డీఐపీ అమలు తర్వాత బాగా తగ్గించారు. ఆరు మేజర్ ప్రాజెక్టుల కింద మొత్తం 105130ఎకరాల ఆయకట్టు స్థిరీకరించగా.. డీఐపీ అమలుకు ముందు 74,070ఎకరాల ఆయకట్టుకు నీరందేది. 31,060 ఎకరాల గ్యాప్ ఆయకట్టు ఉంది. డీఐపీ అమలు తర్వాత 73,690ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా.. 583ఎకరాల గ్యాప్ ఆయకట్టు తగ్గింది. మరో 30,477ఎకరాల గ్యాప్ ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 1,14,020 ఎకరాల ఆయకట్టు ఉండగా.. 61,515ఎకరాలకే సాగునీరు అందేది. మరో 52,100ఎకరాల మేర గ్యాప్ ఆయకట్టు మిగిలిపోయింది. డీఐపీ అమలు తర్వాత 1,44,425ఎకరాలకు 1,18,255ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. మరో 17,453ఎకరాల గ్యాప్ ఆయకట్టు మాత్రమే మిగిలి ఉంది. మైనర్ ఇరిగేషన్‌లో 2701 చెరువులను మిషన్ కాకతీయలో భాగంగా మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టారు. డీఐపీకి ముందు 274590 ఎకరాల ఆయకట్టు ఉండగా.. 119810ఎకరాలకే సాగునీరు అందుతోంది. మరో 1,54,780ఎకరాల గ్యాప్ ఆయకట్టు ఉంది. డీఐపీ అమలు తర్వాత 1,76,740 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుండగా.. మిగతా 86,108ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయి.

కొత్తగా 37,138ఎ కరాలకు సాగునీరు
2009-10లో జపాన్ బ్యాంకు నిధులతో కొత్త చెరువుల నిర్మాణం చేపట్టగా.. కొన్నింటిని పూర్తి చేశారు. మిగతా వాటికి భూసేకరణ సమస్యతో పాటు నిధులు సరిగా విడుదల చేయక పనులు ఆశించిన మేర సాగలేదు. కాల్వలు సరిగా తవ్వకపోవడంతో.. ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 45పనులు ఇలా మిగిలిపోగా.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రూ.348.64కోట్ల నిధులతో చేపట్టగా.. కొత్తగా 37,138ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. దశాబ్దం క్రితం నాబార్డు, ఏఐబీపీ లాంటి పథకాల్లో మిగిలిపోయిన 34 పనులకు రూ.206.14కోట్లు ప్రభుత్వం మంజూరు చేశారు. ఈ పనులను పూర్తి చేసి 43,626ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు కింద ఐఎస్‌బీఐజీ పథకంలో కేంద్రం రూ.172కోట్లు మంజూరు చేయగా.. తెలంగాణ ప్రభుత్వం రూ.58కోట్లు మంజూరు చేసింది దీంతో డి-13, 14 డిస్ట్రిబ్యూటరీ పనులను చేపడుతుండగా.. 2020 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్సారెస్పీ కింద సరస్వతి కాల్వ ఆధునీకరణకు రూ.50కోట్లు మంజూరు చేయగా.. జూన్ 2020నాటికి పూర్తి చేయనున్నారు. పనులు పూర్తయ్యాక గ్యాప్ ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు చేపట్టారు.

నిధుల వినియోగంపై నీతి ఆయోగ్ సంతృప్తి
ఆరు మీడియం ప్రాజెక్టుల కింద గ్యాప్ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రూ.435 కోట్లు అవసరంకాగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు వచ్చినా.. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. కేంద్ర మంత్రి వర్గ ఆమోదం ఇంకా లభించలేదు. ఐఎస్‌బీఐజీ, క్యాడ్‌వామ్ పథకాల కింద రూ.123కోట్లు రావాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు. ఈ నిధులు మంజూరైతే.. జూన్ 2020నాటికి పనులు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తేనే.. డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, సబ్ మైనర్లు, ఫీడర్ ఛానళ్లు, కాల్వల లైనింగ్ నిర్మించి.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులతో జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనుల పరిశీలనకు ఇటీవల నీతి ఆయోగ్ బృంద సభ్యులు ఎన్.కుమార్ వేల్, యోగేశ్ రాండేల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలో సాగునీటి నిల్వలు, సామర్థ్యం, నిధుల వినియోగంపై వారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో డీఐపీ అమలుతో గ్యాప్ ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు.. కొత్త ఆయకట్టు పెద్ద ఎత్తున స్థిరీకరించటంతో ఉమ్మడి జిల్లా రైతాంగానికి ఎంతో మేలు చేకూరుతోంది.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...