పకడ్బందీగా జలసంరక్షణ


Sat,July 20, 2019 03:25 AM

నేరడిగొండ : కేంద్ర ప్రభుత్వం జలసంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఆ పనులను పకడ్బందీగా చేపట్టాలని ఎన్‌ఐఆర్డీ రిసోర్స్ పర్సన్ రమేశ్ కులకర్ణి సూచించారు. మండలంలోని మోడల్‌గా ఎంపిక చేసిన వాగ్దారి గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం పర్యటించి వాగ్దారి, మాదాపూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో చేపట్టిన నీటి నిల్వ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలసంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. వర్షపు నీటిని పొదుపు చేసి వాటిని ఇంకించేలా చేస్తే భావితరాలకు మేలు జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో నీటి నిల్వ పనులను తప్పకుండ చేపట్టాలని సూచించారు. వర్షపు నీరు వృథా కాకుండా ఎక్కడిక్కడ ఇంకేలా చేస్తే భూగర్భజలాలు పెరుగుతాయని, జలశక్తి అభియాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ పథకంలో భాగంగా నీటినిల్వ కుంటలు, ఫాంపాండ్స్, చిన్ననీటి చెరువులు, కందకాలు, ఇంకుడు గుంతలు తదితర వాటిని తప్పకుండ చేపట్టాలన్నారు.
జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఎనిమిది మోడల్ గ్రామాలను ఎంపిక చేయగా అందులో జిల్లాలోని నేరడిగొండ మండలంలో వాగ్దారి గ్రామాన్ని ఎంపిక చేశారు. గ్రామంలో జరిగిన జలశక్తి అభియాన్ పనులను డ్రోన్ కెమెరా ద్వారా రికార్డ్ చేశారు. అనంతరం గ్రామంలో ఈ పనుల ద్వారా జరిగిన ప్రయోజనాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి మురళీధర్, టెక్నికల్ అధికారి అబేధ్‌ఖాన్, డీఆర్డీవో రాథోడ్ రాజేశ్వర్, ఏపీడీ కృష్ణారావు, ఏపీవో మంజులారెడ్డి, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...