113 మందిపై అనర్హత వేటు


Fri,July 19, 2019 03:06 AM

ఆదిలాబాద్ టౌన్ : గత బల్దియా ఎన్నికల్లో పోటీచేసి ఖర్చుల లెక్కలు చూపని అభ్యర్థులపై వేటు పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం బల్దియాలోని 113 మందిపై అనర్హత వేటు వేసింది. మూడు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం 2017 జూలై 28 నుంచి వర్తిస్తుంది. 2020 సంవత్సరం ఆగస్టు 16వ తేదీ వరకు వారిపై అనర్హత వేటు కొనసాగుతుంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అనర్హత వేటు పడిన వారు వార్డు మెంబర్‌గా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు.

ప్రచార ఖర్చులు సమర్పించని ఫలితం...
ఆదిలాబాద్ మున్సిపాలిటీకి 2014 మార్చిలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 36 వార్డుల్లో ప్రతి వార్డుకు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో పోటీ చేశారు. ఫలితాలు విడుదలైన తర్వాత నిర్ణీత కాల పరిమితిలోగా గెలిచిన అభ్యర్థులతో పాటు ఓడిపోయిన అభ్యర్థులు కూడా ఎన్నికల సంఘానికి ప్రచార ఖర్చుల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రచార సభలకు అయ్యే ఖర్చు, నమూనా బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్, ప్రచార సామగ్రి, ఇంటింటి ప్రచారానికి ఎంత ఖర్చు అయిందో మొత్తం వివరాలను అందజేయాలి. కౌన్సిలర్‌గా గెలుపొందిన అభ్యర్థులు ఎన్నికల ప్రచార వ్యయాన్ని ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. ఓడిపోయిన అభ్యర్థుల్లో చాలా మంది ఖర్చుల వివరాలను అందజేయలేదు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. రాజకీయ పార్టీల తరపున పోటీచేసిన అభ్యర్థులకు ఆయా పార్టీల సీనియర్ నాయకులు ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. బీఫామ్ ఇవ్వడం దగ్గరి నుంచి ప్రచార వ్యవహారాలను పర్యవేక్షించారు. ఎన్నికలయ్యాక ప్రచార ఖర్చులను ఎన్నికల సంఘానికి అందజేయాల్సిన విషయంలో అవగాహన కల్పించారు. దీంతో ఆయా రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసినవారు ఎన్నికల కమిషన్ నోటీసులకు స్పందించి తమ ప్రచార ఖర్చుల లెక్కలను అందజేశారు. స్వతంత్ర అభ్యర్థుల విషయానికొస్తే చాలా మందికి ఎన్నికల నిబంధనలపై అంతగా అవగాహన ఉండదు.. మార్గదర్శనం చేసే సీనియర్ నాయకులు ఉండరు. దీంతో కొందరు తెలియక ప్రచార ఖర్చులను అందజేయలేదు. మరికొందరికి ఎన్నికల నిబంధనలపై అవగాహన ఉన్నా.. ఎలాగూ ఓడిపోయాం కదా.. అన్న నిర్లక్ష్యంతో ఎన్నికల సంఘానికి లెక్కలు చూపలేదు. అనర్హత వేటు పడిన అభ్యర్థుల్లో స్వతంత్రులే ఎక్కువగా ఉన్నారు. 2017లో ఎన్నికల సంఘం బల్దియాలో పోటీ చేసి లెక్కలు చూపని 113 మంది అభ్యర్థులపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి మూడు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది.

అనర్హత వేటు పడిన అభ్యర్థులు...
గత బల్దియా ఎన్నికల్లో ఒకటో వార్డు నుంచి పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులపై అనర్హత వేటు పడింది. రెండో వార్డులో నలుగురు, 3వ వార్డులో నలుగురు, 4వ వార్డులో నలుగురు, 6వ వార్డులో ఇద్దరు, 7వ వార్డులో ఇద్దరు, 9వ వార్డులో ఐదుగురు, 10వ వార్డులో ఇద్దరు, 11వ వార్డులో ఒకరు, 12వ వార్డులో ఆరుగురు, 13వ వార్డులో ముగ్గురు, 14వ వార్డులో ముగ్గురు, 15వ వార్డులో ఒకరు, 16వ వార్డులో ముగ్గురు, 17వ వార్డులో ఒకరు, 18వ వార్డులో ముగ్గురు, 19వ వార్డులో ఇద్దరు, 20వ వార్డులో ఒకరు, 21వ వార్డులో ఆరుగురు, 22వ వార్డులో తొమ్మిది మంది, 23వ వార్డులో ముగ్గురు, 24వ వార్డులో నలుగురు, 25వ వార్డులో ముగ్గురు, 26వ వార్డులో ఆరుగురు, 27వ వార్డులో ఐదుగురు, 28వ వార్డులో నలుగురు, 29వ వార్డులో ఇద్దరు, 30వ వార్డులో ఇద్దరు, 31వ వార్డులో ముగ్గురు, 32వ వార్డులో ముగ్గురు, 33వ వార్డులో నలుగురు, 35వ వార్డులో ముగ్గురు, 36వ వార్డులో ముగ్గురు అభ్యర్థులను అనర్హులుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిపై వేటు పడి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. నిషేధం తొలగిపోవడానికి ఇంకా 13 నెలల సమయం ఉంది. దీంతో సదరు అభ్యర్థులు త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...