పురచట్టం.. కట్టుదిట్టం !


Thu,July 18, 2019 03:57 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఏడు మున్సిపాలిటీలుండగా.. కొత్తగా మరో ఐదు మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. గతంలో ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, కాగజ్‌నగర్, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీలుగా ఉండేవి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అక్టోబరు 11, 2016న నాలుగు జిల్లాలుగా విభజించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలుగా విభజించగా.. వీటితో పాటు కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. తర్వాత కొన్ని రోజులకు కొత్త గ్రామపంచాయతీలతో పాటు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఐదు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయగా.. నిర్మల్ జిల్లాలో ఒకటి, మంచిర్యాల జిల్లాలో నాలుగు కొత్త పురపాలక సంఘాలు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్, మంచిర్యాల జిల్లాలో నస్పూర్, చెన్నూర్, లక్షెట్టిపేట్, క్యాతన్‌పల్లిలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లను కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటికి సంబంధించి ఇంకా గెజిట్ నోటిఫికేషన్ రాలేదు. ఇక్కడ ఇటీవల గ్రామపంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించలేదు. పురపాలక ఎన్నికలకు ముందే వీటిని మున్సిపాలిటీలుగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం మున్సిపాలిటీల సంఖ్య 14కు చేరే అవకాశం ఉంది.

అక్రమాలకు అడ్డుకట్ట.. అవినీతికి చరమగీతం
పురపాలక సంఘాల్లో అక్రమాలపై ఉక్కుపాదం, అవినీతికి చరమగీతం అన్న నినాదాన్ని సుసాధ్యం చేసే దిశగా నూతన తెలంగాణ పురపాలక చట్టం - 2019 రూపుదిద్దుకోబోతోంది. పట్టణాల్లో, నగరాల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్ట వేస్తూ పట్టణాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పురపాలిక చట్టంలో మార్పులకు సిద్ధమైంది. ఇన్నాళ్లు జరిగినట్లు పురపాలిక చట్టంలో ఉన్న చిన్నపాటి లొసుగులను ఆధారంగా చేసుకుని నిధులు పక్కదారి పట్టించకుండా మార్పులు చేయబోతున్నారు. ఇప్పటికే పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, పురపాలికల్లో అనుభవజ్ఞుల అభిప్రాయాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంపై పూర్తి స్పష్టతతో యావత్ దేశం మనవైపు చూసే విధంగా నూతన పురపాలక చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతుండడం విశేషం. మున్సిపాలిటీ చట్టంలో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కమిషనర్లుగా ఉన్నత స్థాయి అధికారులను నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. జేసీ స్థాయి అధికారులను పురపాలికలకు, నగరపాలక సంస్థలకు ఐఏఎస్ స్థాయి అధికారులను కమిషనర్లుగా నియమిస్తారన్న చర్చ సాగుతోంది. తద్వారా పట్టణ పాలన గాడిలో పడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం..!
పట్టణాల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేలా చట్టంలో సవరణలు చేయాలన్న డిమాండ్ ఉంది. ప్రభుత్వం అక్రమాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకునేలా మార్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు మున్సిపాలిటీల్లో ఏదైనా అవినీతి జరిగితే ఛైర్‌పర్సన్లు సులువుగా తప్పించుకుని అధికారులను బాధ్యులను చేసేవారు. కొందరు రూ.కోట్లు దిగమింగి తామేమీ బాధ్యులం కాదన్నట్లుగా వ్యవహరించేవారు. ఇక మీదట మున్సిపాలిటీల్లో ఏదైనా అక్రమాలు చోటు చేసుకుంటే.. చైర్మన్లనే అన్నింటికీ బాధ్యులను చేసేలా చట్టంలో మార్పులు చేపట్టాలని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. నిధులు పక్కదారి పట్టినా, అవినీతి జరిగినా అధికారులతో పాటు చైర్మన్ సైతం పూర్తి స్థాయి బాధ్యత వహించాల్సి ఉండేలా చట్ట రూపకల్పన చేయబోతున్నట్లు సమాచారం.

అవిశ్వాస గడువు తగ్గింపు
పురపాలక చట్టంలో మార్పులు తీసుకొస్తున్న నేపథ్యంలో చైర్మన్ ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇప్పటి వరకు కౌన్సిలందరూ కలిసి వారిలో ఒకరినికి చైర్మన్‌గా ఎన్నుకుంటున్నారు. ఇకపై చైర్మన్‌ను ఓటర్లే ఎన్నుకుని, వైస్ చైర్మన్‌ను మాత్రమే కౌన్సిలర్లు ఎన్నుకునే విధానం అమలులోకి తెస్తే ఎలాగుంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. అవిశ్వాస తీర్మానం గడువును తగ్గింపు దిశగా ఆలోచిస్తున్నట్లుగా ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నాలుగేళ్ల వరకు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడానికి వీల్లేదు. మిగిలిన ఏడాదిలో కొత్త వారు వచ్చినా చేసేదేమీ లేదు. అవిశ్వాస తీర్మానం గడువు రెండున్నర ఏళ్లకు తగ్గిస్తే.. చైర్మన్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కొత్త చట్టంపై అన్ని వర్గాల్లో ఆసక్తి
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం - 2018 అమలు చేసిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పురపాలికలపై దృష్టి సారించింది. మున్సిపాలిటీ యాక్ట్‌లో మార్పులు తీసుకు రావడానికి కంకణం కట్టుకోవడంతో రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణ సర్కారు తీసుకు వచ్చిన కొత్త పంచాయతీ చట్టంతో గ్రామాల్లో పాలకవర్గాలకు బాధ్యతలు పెరిగాయి. అవినీతి చేయాలంటే వణికిపోయే పరిస్థితులొచ్చాయి. తాజాగా పట్టణాల్లోనూ ప్రజలకు మేలు చేకూర్చేలా.. ఉత్తమమైన సేవలు అందేలా.. చట్ట రూపకల్పన ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఎన్నిక విధానం, వార్డుల రిజర్వేషన్, ఛైర్మన్ రిజర్వేషన్, కాలపరిమితి, అవిశ్వాస తీర్మానం, చైర్మన్, వైస్ చైర్మన్‌ల అధికారాలు, చెక్ పవర్, వార్డుల విభజన తదితర అంశాల్లో చాలా వరకు మార్పులు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. పురపాలికల్లో 2014 జులై 3న పాలక వర్గాలు కొలువుదీరాయి. ఈ ఏడాది జులై 2నాటికి వాటి గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్తగా రంగ ప్రవేశం చేస్తున్న వారు, పాలకవర్గాల దృష్టి పురపాలికలపై పడింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులంతా కొత్త చట్టం ఎలా ఉండబోతుందన్న దానిపై ఆరా తీస్తున్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...