చినుకు రాలదు... చింత తీరదు


Tue,July 16, 2019 04:29 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:జిల్లాలో వానాకాలం సీజన్ రైతులతో దోబూచులాడుతున్నది. సీజన్ ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా మోస్తరు వానలు తప్ప భారీ వర్షాలు కురవలేదు. ఏటా జిల్లా వ్యాప్తంగా జూన్ ప్రారంభంలో రైతులు పత్తి పంటను వేస్తారు. ఈ ఏడాది సైతం సీజన్ ప్రారంభంలోనే రైతులు పత్తి విత్తనాలు నాటారు. వానలు పడకపోవడంతో విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో రైతులు రెండోసారి పత్తి విత్తనాలు వేశారు. పత్తితోపాటు సోయా, కంది, పెసర, మినుము విత్తనాలు నాటారు. వివిధ ప్రాంతాల్లోని కురిసిన వర్షాలతో విత్తనాలు మొలకెత్తాయి. వారం రోజులుగా చినుకు జాడ లేదు. దీనికితోడు ఎండలు మండిపోతుండడంతో మొలకెత్తిన విత్తనాలు వాడిపోతున్నాయి. రెండ్రోజుల్లో వర్షం పడకపోతే పంటలు నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో వానాకాలంలో సాధారణ సాగు విస్తీర్ణం 1.99 లక్షల హెక్టార్లు కాగా 2.10 హెక్టార్లలో రైతు లు వివిధ పంటలు వేసినట్లు అధికారులు అంచ నా వేశారు. జిల్లా వ్యాప్తంగా రైతులు ఎక్కువగా పత్తి, సోయా, కంది, పెసర, మినుము పంటలను సాగు చేస్తారు. మిగతా పంటల కన్నా పత్తిని ఎక్కువగా పండిస్తారు. ఈ ఏడాది 1.30 లక్షల హెక్టార్ల లో పత్తి పంటను వేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో 46 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అధికారులు టీఎస్ సీడ్స్, హాకా, జాతీ య విత్తన సంస్థలకు ప్రతిపాదనలు పంపారు. జి ల్లాకు వచ్చిన విత్తనాలను సహకార సంఘాల ద్వా రా రైతులకు సబ్సిడీ పంపిణీ చేశారు. ఏటా జూన్ మొదటి వారంలో మృగశిరకార్తె ప్రవేశంతో పత్తి విత్తనాలు నాటితే పంట దిగుబడులు బాగా వస్తాయనే నమ్మకంతో రైతులు విత్తనాలను వేస్తారు. ఈ సారి సైతం జూన్ ప్రారంభంలో విత్తనాలు వేయగా వర్షాలు కురవక పోగా 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో విత్తనాలు మాడిపోయాయి. ఆదిలాబాద్ రూరల్, జైనథ్, బేల, తాంసి, మావల, గుడిహత్నూర్ మండలాల్లోని రైతులు రెండోసారి విత్తనాలు వేసుకున్నారు. జూన్ చివరి వారంలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడంతో పత్తితో పాటు సోయా, కంది, పెసర, మినుము తదితర విత్తనాలు మొలకెత్తాయి. రెండు, మూడు రోజుల కొకసారి వర్షం పడుతుండడంతో పంటలకు నీటి అవసరాలు తీరాయి.

42 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా వాన జాడ లేదు. వారం రోజుల నుంచి 32 నుంచి 35 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా సోమవారం 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 25 నుంచి 27 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడిగా మారిపోయింది. మొలకెత్తిన పత్తి, సోయా, కంది పంటలు ఎదుగుదల దశలో ఉండగా, వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు పంటలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుండగా మిగితా రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. రెండ్రోజుల్లో వానలు పడుకుంటే పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు. జిల్లాలోని జైనథ్, తాంసి, నేరడిగొండ, బజార్‌హత్నూర్, ఉట్నూర్‌లో సాధారణ వర్షపాతం నమోదుకాగా మిగితా మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో సోమవారం వరకు 345.2 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 274.2 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే కురిసింది. భారీ వర్షాలు పండకపోవడంతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువుల్లో సైతం నీరు చేరలేదు. దీంతో చెరువులు, కాలువల ద్వారా పంటలకు నీరందించే పరిస్థితిలేదు. సీజన్ ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా భారీ వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలమట్టం సైతం పెరుగలేదు. మున్ముందు భారీ వర్షాలు కురిస్తే తప్ప సాగు సజీవంగా ఉండే పరిస్థితి లేదు. వర్షాల కోసం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పూజలు చేస్తున్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...