బీమాతోనే రైతుకు ధీమా..!


Sun,July 14, 2019 12:52 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: పంటల బీమాకు గడువు సమీపిస్తోంది. జిల్లాలో రెండు రకాల బీమా అమలు చేస్తుండగా.. పత్తి పంటకు సంబంధించి వాతావరణ ఆధారిత బీమా పథకం గడువు రేపటితో ముగియనుంది. జిల్లాలో రెండు రకాల పంటల బీమా పథకాలు అమలు చేస్తుండగా.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా యోజన పథకాలున్నాయి. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో వరి, మొక్కజొన్న, జొన్న, కందులు, పెసర, మినుములు, సోయాబీన్, పసుపు పంటలు ఉండగా.. వాతావరణ ఆధారిత బీమా పథకంలో పత్తి, మిరప, టమాట పంటలున్నాయి. జిల్లాలో ఎక్కువ మొత్తంలో సాగు చేసే పత్తి పంట వాతావరణ ఆధారిత బీమా పథకంలో ఉండగా.. మిగతా పంటలు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఉన్నాయి. జిల్లాలో 1.50లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా.. ఇప్పటి వరకు చాలా మంది రైతులు బీమా ప్రీమియం చెల్లించి రెన్యూవల్ చేసుకోలేదు. కొందరు అసలు ఇప్పటి వరకు బీమా ప్రీమియం చెల్లించడం లేదు. వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తి పంట నష్టపోతే బీమా పరిహారం అందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది.

పత్తి పంటకు ఎకరానికి రూ.1750చొప్పున బీమా ప్రీమియం చెల్లిస్తే.. ఎకరానికి రూ.35వేల చొప్పు న బీమా పరిహారం చెల్లిస్తారు. 5శాతం చొప్పున చెల్లిస్తే.. 95శాతం బీమా పరిహారం అందుతుంది. ఈ ప్రీమియం చెల్లించేందుకు మరో రోజు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 15తో పత్తి పంటకు బీమా ప్రీమియం చెల్లించేందుకు గడువు ముగియనుంది. వరికి ఆగసు 31వరకు గడువు ఉండగా.. మిగతా పంటలైన కందులు, మినుములు, పెసర్లు, జొన్నలు, మొక్కజొన్న, సోయాబీన్, పసుపు పంటలకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ఈ నెల 31వరకు గడువు ఉంది. పత్తికి సంబంధించి రేపటితో గడువు ముగుస్తుండగా.. ఇప్పటికే కొందరు బ్యాంకుల్లో పంట రుణాలు రెన్యూవల్ సమయంలో బీమా ప్రీమియం రెన్యూవల్ అవుతోంది. పంట రుణం తీసుకోని రైతులకు వ్యవసాయ శాఖ ఏఈవోలు బీమా ప్రీమియం తీసుకుని ఆన్‌లైన్ చేస్తున్నారు.

అందుబాటులో ఉండనున్న ఏఈవోలు
సోమవారం అన్ని మండలాలు, గ్రామాల్లో ఏఈవోలు అందుబాటులో ఉంటారు. ఏఈవోలకు డబ్బులు చెల్లిస్తే.. వారే నెఫ్ట్ ద్వారా చెల్లిస్తారు. పత్తి, పసుపు పంటలకు 5శాతం, మిగతా పంటలకు 2శాతం ప్రీమియం రైతు చెల్లిస్తే సరిపోతుంది.ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలోని పంటలకు సంబంధించి.. మరో 15రోజుల గడువు ఉంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంటల నష్టపోతే పరిహారం వస్తుంది. విత్తినప్పటి నుంచి పంట కోత వరకు దిగుబడి నష్టంపై ఆధారపడి, విత్తలేకపోవుట/నాట్లు వేయలేకపోవుట, పంట మధ్య కాలంలో/పంట మధ్యలో స్థానిక విపత్తులు వస్తే పరిహారం ఇస్తారు. వాతావరణ ఆధారిత బీమాకు సంబంధించి అల్ప, అధిక వర్షపాతం, అల్ప నీటి ఆవిరి పీడనం, అధిక, అల్ప ఉష్ణోగ్రత, అధిక ఉష్ణోగ్రతతో పాటు అధిక శాతం గాలిలో తేమ ఉండి.. దిగుబడిపై ప్రభావం చూపితే పరిహారం అందిస్తారు. వాతావరణ ఆధారిత బీమా పథకంలోని పత్తి పంట బీమా ప్రీమియం చెల్లించేందుకు రేపటితో గడువు ముగియనుందని,రైతులంతా వెంటనే బీమా ప్రీమియం చెల్లించాలని జిల్లా వ్యవసాయాధికారి కోటేశ్వరరావు నమస్తే తెలంగాణ ద్వారా రైతులను కోరారు. సోమవారం అన్ని మండలాలు, గ్రామాల్లో ఏఈవోలను అందుబాటులో ఉంచుతున్నామని.. రైతులు డబ్బులు చెల్లించి బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. ప్రీమియం చెల్లించడంతో పంట నష్టపోతే పరిహారం అందుతుందని అన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...