యథేచ్ఛగా కల్తీ దందా !


Fri,July 12, 2019 02:10 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:జిల్లాలో కల్తీ విక్రయాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. మంచినూనె మొదలుకొని పాలు, పప్పులు, మసాలాలు, పండ్లు, కారం, పసులు, వెల్లుల్లి ఇతర తినుబండారాల్లోనూ కల్తీ జరుగుతున్నది. బుధవారం గుడిహత్నూర్‌లో పల్లినూనె, సన్‌ఫ్లవర్ లేబుళ్లతో ఉన్న రూ.1,38,400 విలువైన కల్తీనూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు దళారులు కల్తీ విక్రయ దందాను ఎంచుకొని లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు. కల్తీ వస్తువులను వినియోగించిన ప్రజలు అవస్థలు పాడాల్సి వస్తున్నది. ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టం ప్రకారం అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి ప్రతి నెలా కనీసం ఆరు ఆహార వస్తువుల శాంపిల్స్‌ను పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపాలి. కానీ జిల్లాలో ఇలాంటి తనిఖీలు నిర్వహించిన దాఖలాలు ఇప్పటి వరకు కనిపించడంలేదు. ఫలితంగా వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగుతున్నది. తాగునీరు మొదలుకొని పాలు, బియ్యం, వంటనూనె, పప్పులు, మసాలాలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాల్లోనూ యథేచ్ఛగా కల్తీ జరుగుతున్నది. కొన్ని వస్తువుల్లో స్థానికంగా కల్తీ జరుగుతుండగా, మరికొన్ని పక్కనే ఉన్న మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాల నుంచి జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. జిల్లాలో పత్తి పంటను రైతులు ఎక్కువగా సాగుచేస్తారు. కొందరు వ్యాపారులు పత్తి గింజలతో నూనెను తయారు చేసి ఇతర నూనెలో కలిపి మేలురకమైన నూనె పేరిట విక్రయిస్తున్నారు. డ్రమ్ములు, ఇనుప డబ్బాల్లో కల్తీ నూనె తయారవుతున్నది. జిల్లాలో భారీగా అన్ బ్రాండెడ్ లూజ్ అయిల్‌ను విక్రయిస్తున్నారు. కల్తీ ఏది, అసలు ఏది తెలియకుండా వ్యాపారులు జాగ్రత్త పడుతున్నారు.

ప్రమాదకరంగా కల్తీ వస్తువులు
ఏజెన్సీ గ్రామాలతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ కల్తీనూనె విక్రయాలు బాగా జరుతున్నాయి. పల్లినూనె, సన్‌ఫ్లవర్ లేబుళ్లను అతికించి అర లీటరు, లీటరు ప్యాకెట్లతో పాటు, 4.5 లీటర్లు, 15 లీటర్ల క్యాన్‌లను సైతం విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లోని కొన్ని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లలో కల్తీ నూనె ఎక్కువగా వాడుతున్నారు. ప్రమాదకరమైన నూనె వాడకంతో జాండిస్, ఇతర సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. కారంలో రంగు కలిపిన పౌడర్ లేదా రంపపు పొట్టు, తెనెలో పంచదార పాకం, మిరియాల్లో బొప్పాయి గింజలు కలిపి విక్రయిస్తున్నారు. పండ్ల పక్వానికి వ్యాపారులు ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తున్నారు. అరటికాయలను పండ్లుగా మార్చడానికి పెద్ద డ్రమ్ముల్లో నీళ్లు పోసి అందులో రసాయన పదార్థాలను కలిపి వాటిని ముంచి తీస్తున్నారు. దీంతో ఆకుపచ్చ రంగులో ఉన్న అరటిపండ్లు పసుపుపచ్చ రంగులోకి మారిపోతున్నాయి. కల్తీ వస్తువులను తినడంతో ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతారని వైద్యులు అంటున్నారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో జరిగే వారంతపు సంతల్లో సైతం వ్యాపారులు యథేచ్ఛగా కల్తీ వస్తువులను విక్రయిస్తున్నారు.

హోటళ్లలో సైతం...
జిల్లా కేంద్రంతో పాటు పలు హోటళ్లలో తయారుచేసే ఆహార పదార్థాలు ప్రమాదకరంగా ఉంటున్నట్లు గతంలో అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కొందరు నిర్వాహకులు మాంసాన్ని రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతుండగా... ఇలా దాచిన మాంసంలో ఫంగస్ ఏర్పడుతున్నట్లు గతంలో నిర్వహించిన తనిఖీల్లో అధికారులు గుర్తించారు. వీటితో పాటు కూరలు రంగు రావడంతో పాటు రుచికరంగా ఉండడానికి రసాయనాలతో కూడిన పదార్థాలను వినియోగిస్తున్నారు. మంచినీరు నిల్వ ఉంచే డ్రమ్ములను రోజుల తరబడి శుభ్రం చేయకపోవడంతో బ్యాక్టీరియా పేరుకుపోయి ప్రజలు అనారోగ్యానికి గురువుతున్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...