కీచక ప్రొఫెసర్‌తో పాటు మరో ఇద్దరి అరెస్టు


Fri,July 12, 2019 02:09 AM

బాసర : రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన బాసర ట్రిపుల్ ఐటీ కీచక అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి వరాల ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరిపి ఎట్టకేలకు అతడితో పాటు మరో ఇద్దరు ప్రొఫెసర్లను అరెస్టు చేశారు. గురువారం బాసర పోలీస్ స్టేషన్‌లో వివరాలను ఎస్పీ శశిధర్‌రాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ట్రిపుల్ ఐటీ కళాశాలలో 2011లో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా, కెమిస్ట్రీ విభాగంలో హెచ్‌వోడీగా రవి వరాల కాంట్రాక్టు పద్ధతిలో ఎంపికయ్యాడు. ఆయన కంటే తక్కువ చదివిన (పీజీ) వారికి సమాన వేతనం ఉండడంతో డబ్బులకు ఆశపడ్డాడు. డబ్బులు ఎలాగైనా సంపాదించాలనే యోచనతో పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను టార్గెట్ చేశాడు. రెండేళ్లుగా ఇందుకు అలవాటు పడ్డాడు. పరీక్ష రాసిన విద్యార్థులు ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయితే, మళ్లీ ఒక నెల రోజుల్లో పరీక్ష రాసే అవకాశం కల్పించాడు. అందులో కూడా ఫెయిల్ అయితే ఒక ఏడాది దాకా డిటేన్ కావాల్సి ఉంటుంది. దీంతో ఒకసారి ఫెయిలైన విద్యార్థులు ఎలాగైన పాస్ కావాలని చూస్తుంటారు. దీనిని ఆసరాగా చేసుకున్న రవి వరాల డబ్బుల కోసం విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలు పరీక్ష కాగానే రివాల్యుషన్ ఇన్‌చార్జి విశ్వనాథ్ వద్దకు వెళ్తుంటాయి. విశ్వనాథ్‌కు సైతం సరైన వేతనం లేకపోవడంతో రవి వరాల డబ్బుల ఆశ చూపి విద్యార్థుల సమాధాన పత్రాలను ఎవరికీ తెలియకుండా తీసుకొని ఇంటికి తీసుకెళ్లేవాడు. సంబంధిత విద్యార్థులను నిజామాబాద్‌లోని తన ఇంట్లోకి పిలిపించుకొని ఒక్కో సబ్జెక్టుకు రూ.15 వేలు తీసుకునేవాడు. ఇలా దాదాపు రూ.5 లక్షల వరకు డబ్బు సంపాదించాడు.

సెల్‌ఫోన్ నంబర్లతో...
సబ్జెక్టులో ఫెయిల్ అయిన విద్యార్థులను తన ఇంటికి పిలిపించుకునేవాడు. విద్యార్థులకు రవి వరాల తన ఫోన్ నంబర్ ఇచ్చి తరుచూ ఫోన్ చేస్తుండేవాడు. ఇలా విద్యార్థులతో నిత్యం స్నేహపూర్వకంగా మెలిగేవాడు. తరుచూ ఫోన్ చేస్తూ సతాయిస్తుండడంతో విద్యార్థినులు అతడి ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టగా.. ఒత్తిడి చేస్తూ మళ్లీ బ్లాక్ లిస్టులో నుంచి నంబర్ తొలగించుకునేవాడు.

కఠిన కేసుల నమోదు...
సంఘటనపై విచారణ జరిపిన పోలీసులు రవి వరాలపై కఠిన కేసులను నమోదు చేశారు. నిర్భయతో పాటు పొక్సో కింద కేసు నమోదు చేసి ఏ-1గా గుర్తించారు. రవి వరాలకు సహకరించిన విశ్వనాథ్‌కు ఏ-2గా, నిందితులిద్దరికీ సహకరించిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ సుధాకర్‌పై ఏ-3గా కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ శశిధర్‌రాజు తెలిపారు. నిందితులు సంపాదించిన రూ.5 లక్షల రికవరీకి పోలీసులు చర్యలు చేపట్టారు. రవి వరాల రూ.4 లక్షలు సంపాదించగా.. రూ. 2.50 లక్షలు రికవరీతో పాటు ఐటెన్ కారు సీజ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. విశ్వనాథ్ రూ.80 వేలు సంపాదించగా, రూ.50 వేలు రికవరీ చేశారు. సుధాకర్ నుంచి రూ.50 వేలు రికవరీ చేశారు. వీరిని రిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ దక్షిణమూర్తి, డీఎస్పీ రాజేశ్ భల్లా, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు కోదాడి రాజు, రాజన్న, పోలీసులు ఉన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...