హరిత నిర్మల్ దిశగా..


Thu,July 11, 2019 01:24 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో ఐదో విడత హరితహారంలో భాగం గా 2.10 కోట్ల మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 312 నర్సరీల్లో ఇప్పటికే మొక్కలు పెంచగా.. నాటేందుకు సిద్ధంగా ఉంచారు. జిల్లాలో 1216.60 హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణం 3734.43 హెక్టార్లుకాగా.. ఈ లెక్కన అడవుల విస్తీర్ణం 32.58శాతం ఉంది. జిల్లాలో కవ్వాల్ టైగర్ రిజార్వ్ ఫారెస్టులోని కోర్, బఫర్ ఏరియాలు ఉన్నాయి. జిల్లాలో 751.01 చదరపు కిలోమీటర్లలో కవ్వాల్ పులుల రక్షిత ప్రాంతం విస్తరించి ఉండగా ఇందులో 517.48 చ.కి.మీ. కోర్ ఏరియా, 233.53 చ.కి.మీ. బఫర్ ఏరియా ఉంది. జిల్లాలో తెలంగాణకు హరితహారంలో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. 2015జూన్‌లో ప్రారంభించగా.. ఇప్పటికే నాలుగు విడతల్లో మొక్కలు నాటారు. తాజాగా ఐదో విడతలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2015లో 3కోట్లకుపైగా మొక్కలు నాటగా.. 2016లో నిర్మల్ జిల్లాలో 23లక్షల మొక్కలు నాటారు. 2017లో 96లక్షల మొక్కలకుగాను.. 59.60లక్షల మొక్కలు నాటారు. 2018లో 1.02కోట్ల మొక్కలను నాటారు. ఐదో విడతలో భాగంగా 2.10కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

2.10కోట్ల మొక్కలు సిద్ధం
జిల్లాలో మొత్తం 312 నర్సరీల్లో 2.10కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 248నర్సరీల్లో 1.40కోట్ల మొక్కలను పెంచారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 62నర్సరీల్లో 64లక్షల మొక్కలు పెంచారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రెండు నర్సరీలుండగా.. మూడు లక్షల మొక్కలను పెంచారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 1.40కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మిగతావి ఆయా శాఖల ఆధ్వర్యంలో నాటనున్నారు. జిల్లాలో 40శాతం టేకు మొక్కలను, 20శాతం హోంస్టెడ్ మొక్కలను, 40శాతం అడవులను పెంచే మొక్కలను నాటాలని నిర్ణయించారు. డీఆర్డీఏ, అటవీ శాఖ నర్సరీల్లో పెద్ద సంఖ్యలో టేకు మొక్కలను పెంచారు. సుమారు 85లక్షలకు పైగా టేకు మొక్కలు నాటాలని భావిస్తున్నారు. ఈ టేకు మొక్కలను రైతుల బీడు, ఖాళీ భూములు, పొలం గట్లపై నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే డీఆర్డీఏ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించగా.. కలెక్టర్ ఎం.ప్రశాంతి పలు మండలాల్లో పర్యటించి మొక్కలు నాటారు. రెండు, మూడు భారీ వర్షాలు కురిశాకే.. మొక్కలు నాటడంలో వేగం పెంచాలని నిర్ణయించారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉండగా.. స్థానిక నర్సరీల నుంచి పరిసర గ్రామాలకు సరఫరా చేసేందుకు నిర్ణయించారు.

పది లక్షల గుంతల తవ్వకం
ఐదో విడత హరితహారం కోసం అధికారులు యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేశారు. ఏ ఏ ప్రాంతంలో మొక్కలు నాటాలనేది ముందే గుర్తించారు. ఇప్పటికే అంచనాలు తయారు చేయగా.. శాఖల వారీగా లక్ష్యాలను నిర్ధేశించారు. ఏ ఏ శాఖ ఆధ్వర్యంలో ఎన్ని మొక్కలు, ఎక్కడెక్కడ నాటాలనేది ముందే ఒక అంచనాకు వచ్చారు. రెండు, మూడు భారీ వర్షాలు పడిన వెంటనే మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉపాధి హామీ కూలీలతో గుంతలు తవ్వుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 10లక్షల గుంతలు తవ్వారు. భారీ వర్షాలు కురిశాకే నాటాలని.. లేనట్లయితే మొక్కలు ఎండిపోతాయని భావిస్తున్నారు. రెండు, మూడు భారీ వర్షాలు కురిశాకే.. పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని భావిస్తున్నారు. నాటిన ప్రతి మొక్కకూ జియోట్యాగింగ్ చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఐదో విడత హరితహారం కోసం సిద్ధంగా ఉన్నామని.. ఇప్పటికే జిల్లాలో అక్కడక్కడ మొక్కలు నాటుతున్నామని డీఆర్డీవో వెంకటేశ్వర్లు నమస్తే తెలంగాణతో పేర్కొన్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయని.. రెండు, మూడు భారీ వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటుతామని తెలిపారు. ప్రతి గ్రామంలో మూడు గ్రీన్ జోన్లను గుర్తించామని.. అక్కడ పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చని వనాలుగా మారుస్తామన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...