ఇక రైతుకూ పెన్షన్!


Mon,June 17, 2019 01:11 AM

-ప్రధాన మంత్రి కిసాన్ పెన్షన్ పథకం
-18 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్సువారు అర్హులు
-వివరాల సేకరణకు కేంద్రం ఆదేశాలు
-జిల్లాలో 60 వేల మంది రైతులకు లబ్ధి
ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : రైతుకు రిటైర్మెంట్ పెన్షన్ రానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ పింఛన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఈ పింఛన్ పథకానికి ఆమోద ముద్రవేసింది. ఈ పథకం అమలు చేసేందుకు ఇటీవలే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అన్ని రాష్ర్టాల వ్యవసాయశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. జిల్లాల వారీగా 18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న రైతుల వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు.
18 నుంచి 40 ఏండ్ల వయస్సువారు అర్హులు
మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత రైతులకు పెన్షన్ స్కీం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి కిసాన్ పెన్షన్ యోజన పథకం కింద రైతులకు పింఛన్ అందించనున్నారు. పెన్షన్ పొందాలంటే రైతులు నెలకు రూ.100 చెల్లిస్తే కేంద్రం అంతే మొత్తంలో జమ చేస్తుంది. ఎల్‌ఐసీ ద్వారా ఈ స్కీంను అమలు చేయనున్నారు. నెలకు రూ.100 చెల్లిస్తే 60 ఏండ్ల తర్వాత రూ.3 వేలు పెన్షన్ ఇస్తారు. ఈ పథకానికి 18 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్కులైన రైతులు మాత్రమే అర్హులు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇటీవలే అన్ని రాష్ర్టాల వ్యవసాయ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పథకం కోసం 18 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న రైతుల వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ పథకంపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ పథకం నమోదును వేగవంతం చేయాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేయగా.. అర్హులైన రైతులను గుర్తించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ఈ మేరకు అధికారులు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు.

60 వేల మందికి లబ్ధి...
రెక్కాడితే గాని డొక్కాడని దయనీయ స్థితిలో రైతులు ఉన్నారు. శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు 60 ఏండ్లు పైబడినా చేతనైన పని చేయాల్సి వస్తోంది. 60 ఏండ్లు పైబడిన తర్వాత పెన్షన్ ఇవ్వాలని ఎప్పటి నుంచో రైతుల డిమాండ్ ఉంది. రైతుల కష్టాలను గుర్తించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అండగా నిలిచింది. రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టి రైతుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపింది. అలాగే ఎప్పటి నుంచో పింఛన్ కోసం ఎదురు చూస్తున్న రైతుల కల సహకారం కానుంది. రెండో సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగా.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో తొలి కేబినేట్ భేటీలో రైతు కోసం ప్రత్యేక పింఛన్ పథకాన్ని ఆమోదించింది. ఈ పథకంలో 18 నుంచి 40 ఏండ్ల వయస్కులు అర్హులని పేర్కొంది. రైతు నెలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో 18 నుంచి 60 ఏండ్ల లోపు రైతులు 81 వేల మంది ఉండగా.. పీఎం కిసాన్ పింఛన్ పథకం 60 వేల మంది రైతులకు మాత్రమే వర్తించనుంది.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...