సర్పంచులకు చెక్‌పవర్‌..!


Sun,June 16, 2019 02:56 AM

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: గ్రామ పంచాయతీల్లో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, ఉప సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లకు సంయుక్తంగా చెక్‌పవర్‌ ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతంలో సర్పంచ్‌, గ్రామ కార్యదర్శికి సంయుక్తంగా చెక్‌ పవర్‌ ఉండగా.. తాజాగా కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచులు, ఉపసర్పంచులకు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఇస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17 నుంచి ఆ ఆదేశాలు అమలులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెక్‌ పవర్‌ ఇవ్వడంపై జిల్లాలోని సర్పంచులు, ఉపసర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. గతంలో నిర్మల్‌ జిల్లాలో 240గ్రామ పంచాయతీలు ఉండగా.. కొత్తగా 159గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. దీంతో వీటి సంఖ్య 399కి చేరగా.. ఇందులో నుంచి నిర్మల్‌ మండలం వెంకటాపూర్‌, మంజులాపూర్‌ గ్రామ పంచాయతీలను నిర్మల్‌ మున్సిపాలిటీలో విలీనం చేశారు.

అలాగే ఖానాపూర్‌ను మున్సిపాలిటీగా మార్పు చేశారు. దీంతో మూడు గ్రామ పంచాయతీలు తీసేయగా.. ఇటీవల 396గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారు. జనవరి నెలలో మూడు విడతల్లో ఈ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి.. ఫలితాలను ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన పాలకవర్గాలు ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారం చేసి.. బాధ్యతలు స్వీకరించారు. వరుసగా ఎన్నికలు రావడంతో.. ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. ఈ నెల 8న ఎన్నికల కోడ్‌ ఎత్తేయగా.. తాజాగా గ్రామ పంచాయతీ సర్పంచ్‌, ఉప సర్పంచులకు సంయుక్తంగా చెక్‌ పవర్‌ ఇస్తూ శనివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నెల 17నుంచి చెక్‌ పవర్‌ అమలులోకి రానుంది. చెక్‌పవర్‌ ఇస్తూ.. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం పై జిల్లాలోని సర్పంచులు, ఉపసర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్‌పవర్‌ ఇవ్వడంతో.. ఆయా గ్రామాల్లోని సమస్యలు పరిష్కారానికి నోచుకోనున్నాయి. జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీలుగా ఆవిర్భవించిన.. గిరిజన తండాలు, అనుబంధ గ్రామాలు, ఆవాసాల్లో తొలిసారిగా గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ఏర్పడ్డాయి. ఇక్కడ నిధులు వస్తుండడంతో.. అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. గ్రామాలు అభివృద్ధి పథంలో పయనించనున్నాయి.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...