ఇక పుర పోరు


Sat,June 15, 2019 12:25 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఇప్పటికే అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, లోక్‌సభ, ప్రాదేశిక ఎన్నికలు ముగియగా.. ఇక పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు కొనసాగుతోంది. మరో 18 రోజుల్లో పాలకవర్గాల గడువు ముగియనుండడంతో అటు ఎన్నికల సంఘం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై దృష్టిసారించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఏడు మున్సిపాలిటీలుండగా.. కొత్తగా మరో 5 మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. గతంలో ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, కాగజ్‌నగర్, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీలుగా ఉండేవి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అక్టోబరు 11, 2016న నాలుగు జిల్లాలుగా విభజించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలుగా విభజించగా.. వీటితో పాటు కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. తర్వాత కొన్ని రోజులకు కొత్త గ్రామ పంచాయతీలతో పాటు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు.

ఉమ్మడి జిల్లాలో 5 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయగా.. నిర్మల్ జిల్లాలో 1, మంచిర్యాల జిల్లాలో 4 కొత్త పురపాలక సంఘాలు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్, మంచిర్యాల జిల్లాలో నస్పూర్, చెన్నూర్, లక్షెట్టిపేట్, క్యాతన్‌పల్లిలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లను కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటికి సంబంధించి ఇంకా గెజిట్ నోటిఫికేషన్ రాలేదు. ఇక్కడ ఇటీవల గ్రామపంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించలేదు. పురపాలక ఎన్నికలకు ముందే వీటిని మున్సిపాలిటీలుగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం మున్సిపాలిటీల సంఖ్య 14కు చేరే అవకాశం ఉంది.

జూలై 2తో ముగియనున్న గడువు
ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీల పాలకవర్గాల జులై 2తో ముగియనుంది. మరో 18 రోజుల్లో గడువు ముగియనుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏడు మున్సిపాలిటీలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మంచిర్యాల మున్సిపాలిటీకి కార్పొరేషన్‌గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మందమర్రి మున్సిపాలిటీ నోటిఫైడ్ ఏరియాలో ఉండడంతో ఇక్కడ ఎన్నికలు జరగడం లేదు. ప్రత్యేకాధికారి పాలన కొనసాగుతుండగా.. ఈసారి కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే.. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని భావించారు. అధికారులకు శిక్షణ, ఓటర్ల జాబితా పూర్తి చేశారు. పురపాలక చట్టంలో మార్పులు, చేర్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ముందుకు సాగలేదు.

తాజాగా ప్రాదేశిక ఎన్నికలు ముగియడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై చర్చ సాగుతోంది. 1965లో రూపొందించిన పురపాలక చట్టసవరణపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. అధికారులు కసరత్తు పూర్తి చేశారు. శాసనసభ సమావేశాలు నిర్వహించి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత చట్టాన్ని సవరించనున్నారు. చట్టసవరణ తర్వాతే పురపాలక ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఆదిలాబాద్‌లో ప్రస్తుతం 36వార్డులుండగా.. కొత్తగా అనుకుంట, బెల్లూరి, రాంపూర్ గ్రామపంచాయతీలతో పాటు మావల సగం గ్రామపంచాయతీ విలీనం చేశారు. నిర్మల్ మున్సిపాలిటీలో వెంకటాపూర్, మంజులాపూర్ గ్రామాలను విలీనం చేశారు. కొత్తగా ఏర్పడిన ఐదు మున్సిపాలిటీల్లో పరిసర గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. ప్రస్తుతం ఉన్న వార్డులతో పాటు కొత్తగా విలీనమైన గ్రామాల ప్రకారం వార్డుల విభజన చేస్తారా.. లేదా.. అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. విలీన గ్రామాలను కొత్త వార్డులుగా ఏర్పాటు చేస్తారా.. పరిసర వార్డుల్లో విలీనం చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు పురపాలక అధికారులు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. వార్డుల విభజన పూర్తయితే ఎన్ని కొత్త వార్డులు ఏర్పడుతాయి.. ఏ ప్రాంతం ఏ వార్డులోకి వెళ్తుందనే విషయంపై స్పష్టత రానుంది. కొన్నిచోట్ల వార్డుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే వార్డుల పునర్వీభజన చేసేందుకు పురపాలకశాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ప్రభుత్వం పురపాలక చట్టానికి మార్పులు చేస్తే రిజర్వేషన్లు మారనున్నాయి. పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ గణనను మరోసారి చేపట్టనున్నారు.


ఆదిలాబాద్,కరీంనగర్,హకీంపేట్ స్పోర్ట్స్ స్కూళ్లలో నాల్గో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ముత్తన్న తెలిపారు. విద్యార్థులు 31 ఆగస్టు 2019 వరకు మూడో తరగతి పాసై ఉండాలని పేర్కొన్నారు. వయస్సు ఎనిమిదేండ్లు ఉండాలని తెలిపారు. మండల స్థాయి ఎంపికలు పూర్తి చేసి జిల్లా స్థాయి ఎంపికలు ఈ నెల 26వ తేదీ నుంచి జూలై 3 వరకు నిర్వహిస్తారమన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులు జూలై 11 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర స్ధాయి పోటీలు హకీంపేట్‌లో నిర్వహిస్తారని తెలిపారు. మండల స్థాయి ఎంపికలు ఎంఈవో, జిల్లా స్థాయి ఎంపికలు డీవైఎస్‌వో ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలిపారు. విద్యార్థులకు మొత్తం తొమ్మిది టెస్టులు నిర్వహించి జిల్లా నుంచి 20మంది బాలికలు, 20 మంది బాలురకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...