గ్రామాలకు తాగునీరు అందించాలి


Sat,June 15, 2019 12:24 AM

ఆదిలాబాద్ టౌన్ : ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వల్లకొండ శోభారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశాలను నిర్వహించారు. గత రెండు పర్యాయాలు కోరం లేక వాయిదా పడిన స్థాయి సంఘ సమావేశాలు ఎట్టకేలకు జరిగాయి. ఉమ్మడి జిల్లా పరంగా ఇవే చివరి సమావేశాలు కావడంతో స్థాయి సంఘాల సభ్యులు హాజరయ్యారు. మొత్తం ఏడు స్థాయి సంఘ సమావేశాల్లో విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమ స్థాయి సంఘాలు మినహాయించి మిగితా ఐదు సమావేశాలు పూర్తిగా సాగాయి. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఐసీడీఎస్, మిషన్ భగీరథలపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో తమ సమస్యల గురించి సభ్యులు లేవనెత్తారు.

రైతు బంధు పథకంపై జైనూర్ జడ్పీటీసీ ఆస్రా ఖానం మాట్లాడుతూ.. తమ మండలంలో మొదటి సారి రైతు బంధు సాయం అందుకున్న రైతులకు రెండోసారి రాలేదని తెలపగా తాజాగా రైతు బంధు నగదు ఇప్పటికే 50శాతం మంది రైతుల ఖాతాల్లో జమ అయిందని.. మరో వారం రోజుల్లో రైతులందరి ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ స్థాయి సంఘ సమావేశంలో సభ్యులు అంగన్‌వాడీలకు కోడిగుడ్ల సరఫరాపై అధికారులను వివరణ కోరారు. అంగన్‌వాడీలకు పూర్తి స్థాయిలో సరుకులు పంపిణీ చేయాలని సూచించారు. ఆదిలాబాద్ జడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్ మాట్లాడుతూ.. షాద్ నగర్, కేఆర్కే కాలనీ, ఎస్సీ కాలనీ, డ్రైవర్స్ కాలనీలలో తాగునీటి సమస్యలున్నాయని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పైప్‌లైన్ వేసి నల్లా కనెక్షన్లు ఇవ్వలేదన్నారు.

ఇచ్చోడ, గుడిహత్నూర్, ఉట్నూర్ మండలాల్లోని కొన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా కావడం లేదని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలని మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టిందన్నారు. పనుల విషయంలో అధికారులు కారణాలు చెప్పి తప్పించుకోరాదన్నారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ప్రారంభమైందన్నారు. శుభ్రమైన తాగునీరు లేకపోతే ప్రజలకు విష జ్వరాలు సోకే ప్రమాదముందన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో తాగునీరు కలుషితమై అంటు వ్యాధులు ప్రబలుతాయన్నారు. అధికారులు తక్షణ ప్రాధాన్యతగా భావించి భగీరథ పనులను వేగవంతం చేసి అన్ని ఆవాసాలకు తాగునీరు అందించాలని కోరారు.

ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు..
జిల్లా పరిషత్ స్థాయి సంఘాలు చివరివి కావడంతో చైర్‌పర్సన్ శోభారాణి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల కాలంలో ఉమ్మడి జిల్లా ప్రగతిలో తోడ్పాటును అందించారన్నారు. నాలుగు జిల్లాలుగా విభజించబడడంతో ఆయా జిల్లా కేంద్రంల్లోనే ఇకపై జడ్పీ సమావేశాలు జరుగుతాయన్నారు. జడ్పీ సీఈవో నరేందర్, ఆదిలాబాద్ జడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్, గుడిహత్నూర్ జడ్పీటీసీ కేశవ్ గిత్తే, ఉట్నూర్ జడ్పీటీసీ జీవన్, ఇచ్చోడ జడ్పీటీసీ రేణుక, జైనూర్ జడ్పీటీసీ ఆస్రా ఖానం, తాంసి జడ్పీటీసీ పులి శ్రీలత, జైనథ్ జడ్పీటీసీ ఆశారాణి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...