వేగంగా రైతుబంధు నగదు జమ


Fri,June 14, 2019 01:10 AM

ఆదిలాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లాలోని రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సాయం వరంగా మారింది. జిల్లావ్యాప్తంగా పేద రైతులు ఎక్కువగా ఉండటంతో వారు రెండేండ్ల క్రితం వరకు పంట పెట్టుబడుల కోసం బ్యాంకులు, దళారులు, వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సి వచ్చేది. బ్యాంకు అధికారులు రుణాలను సక్రమంగా పంపిణీ చేయకపోవడం, దళారులు రైతులకు నగదుకు బదులు నాసిరకం విత్తనాలు, ఎరువులను ఎక్కువ ధరలకు ఇచ్చేవారు. పైగా రైతులు పండించిన పంటలను తమ వద్ద విక్రయించాలని షరతులు విధించేవారు. వడ్డీ, వ్యాపారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగితే తప్ప అప్పు పుట్టని పరిస్థితి ఉండేది. వారి అధిక వడ్డీలు తీసుకునేవారు. బ్యాంకు రుణాల పంపిణీలో జాప్యం, వ్యాపారులు సమయానికి అప్పు ఇవ్వకపోవడంతో రైతులకు వర్షాలు కురిసినప్పుడు విత్తనాలు వేసే అవకాశం ఉండేది కాదు. ఇలాంటి కారణాలతో రైతులు పంటల సాగులో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. జిల్లావ్యాప్తంగా రెండేండ్ల్లుగా రైతుబంధు పథకంలో భాగంగా రైతులకు ఉచిత పెట్టుబడి డబ్బులు అందతుండటంతో అన్నదాతల ఇబ్బందులు దూరమయ్యాయి. సీజన్‌కు ముందుగానే తమ చేతిలో ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఉండటంతో రైతులు తమకు నచ్చిన కంపెనీలకు చెందిన విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు వర్షాలు కురిసిన వెంటనే సరైన సమయానికి విత్తనాలు నాటుతున్నారు. ఫలితంగా పంట దిగుబడులు సైతం సమయానికి తీసుకునే అవకాశం లభిస్తుంది. రెండేళ్ల క్రితం వరకు రైతులు పంట పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతూ తమ వద్ద ఉన్న డబ్బులతో తక్కువ విస్తీర్ణంలో పంటలను సాగుచేసుకునే వారు. ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందిస్తుండటంతో జిల్లాలో సాగు విస్తీర్ణం సైతం పెరిగింది.

రూ.265.89 కోట్లు పెట్టుబడి సాయం
జిల్లావ్యాప్తంగా 18 మండలాల్లోని 136,491 మంది రైతులను అర్హులుగా గుర్తించిన అధికారులు ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.265.89 కోట్లు రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. రైతుబంధు పథకంలో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలంలో 47 గ్రామాల్లో 9310 మంది లబ్ధిదారులకు రూ.17.76 కోట్లు. ఆదిలాబాద్ అర్బన్ మండలంలోని మూడు గ్రామాల్లో 281 మంది లబ్ధిదారులకు రూ.39.84 లక్షలు, బేల మండలంలోని 58 గ్రామాల్లో 10572 మంది రైతులకు గానూ రూ.20.10 కోట్లు, జైనథ్ మండలంలోని 58 గ్రామాల్లోని 15010 మంది లబ్ధిదారులకు రూ.28.54 కోట్లు, మావల మండలంలోని ఆరు గ్రామాల్లో 824 మంది రైతులకు గానూ రూ.1.55 కోట్లు, బజార్‌హత్నూర్ మండలంలోని 41 గ్రామాల్లో 7903 మంది లబ్ధిదారులకు రూ.15.27 కోట్లు, బోథ్ మండలంలో 52 గ్రామాల్లోని 12050 మంది రైతులకు గానూ రూ.21.34 కోట్లు, నేరడిగొండ మండలంలోని 57 గ్రామాల్లో 9078 మంది రైతులకు గానూ రూ.14.76 కోట్లు, గుడిహత్నూర్ మండలంలోని 29 గ్రామాల్లో 6504 మంది లబ్ధిదారులకు గానూ రూ.12.41కోట్లు, ఇచ్చోడ మండలంలోని 46 గ్రామాల్లో 9634 మంది లబ్ధిదారులకు రూ.17.57 కోట్లు, సిరికొండ మండలంలోని 26 గ్రామాల్లో 4528 మంది రైతులకు రూ. 9.34 కోట్లు, భీంపూర్ మండలంలోని 23 గ్రామాల్లోని 7189 మంది రైతులకు రూ.15.75 కోట్లు, తలమడుగు మండలంలోని 33 గ్రామాల్లోని 9135 మంది రైతులకు రూ.17.07 కోట్లు, తాంసి మండంలంలోని 12 గ్రామాల్లో 4899 మంది రైతులకు రూ.8.90 కోట్లు, గాదిగూడ మండలంలోని 61 గ్రామాల్లో 6710 మంది లబ్ధిదారులకు రూ. 15.58 కోట్లు, ఇంద్రవెల్లి మండలంలోని 44 గ్రామాల్లో 7802 మంది లబ్ధిదారులకు రూ.17.36 కోట్లు, నార్నూర్ మండలంలో 39 గ్రామాల్లోని 6150 మంది లబ్ధిదారులకు రూ.12.77 కోట్లు, ఉట్నూర్ మండలంలోని 58 గ్రామాల్లో 8912 మంది రైతులకు రూ. 18.83 కోట్లును రైతులకు ఇవ్వాలని నివేదికలు తయారు చేశారు.

ఈ కుబేర్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ
గత ఏడాది వానాకాలం రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రభుత్వం పంటపెట్టుబడి సాయాన్ని పంపిణీ చేసింది. రెండు పంటలకు గానూ రూ.8 వేల చొప్పున రైతులకు అందజేశారు. వానాకాలంలో చెక్కుల రూపంలో పంపిణీ చేయగా యాసంగిలో రైతులు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం ఈ ఏడాది వానాకాలం సీజన్ నుంచి రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున రెండు పంటలకు గానూ రూ.10 వేలను అందజేస్తుంది. జిల్లావ్యాప్తంగా 123782 మంది రైతులకు సంబంధించిన బ్యాంకుల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇప్పటి వరకు 80,331 మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.117.19 కోట్లకు సంబంధించిన వివరాలను ట్రెజరీ అధికారులకు అందజేశారు. ఇప్పటికే 65 శాతం మంది రైతుల ఖాతాల్లో ఆర్‌బీఐ ఈ కుబేర్ ద్వారా రైతుల ఖాతాల్లోకి ఉచిత పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ అవుతున్నాయి. పంటపెట్టుబడి సాయాన్ని పెంచడంతో పాటు సీజన్‌కు ముందుగానే ప్రభుత్వం తమకు పంటపెట్టుబడి సాయాన్ని పంపిణీ చేస్తుండటంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...