నెలాఖరులోపు డిజిటల్ పాస్ పుస్తకాలు


Thu,June 13, 2019 03:38 AM

నిర్మల్ టౌన్: జిల్లాలో అర్హులైన రైతులందరికీ ఈ నెలాఖరులోపు డిజిటల్ పాస్ పుస్తకాలను అందించనున్నారు. ఇందుకోసం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కసరత్తు కొనసాగుతున్నది. ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ప్రతి రైతుకూ నగదు సాయం రైతు ఖాతాల్లో జమ చేయగా సాంకేతిక కారణాలతో కొందరి పుస్తకాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. అవి పెండింగ్‌లో పడడంతో వారికి రైతుబంధు పథకం వర్తించలేదు. అలాంటి వారందరికీ ఈ నెలాఖరులోపు డిజిటల్ పాస్ పుస్తకాలను అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సమగ్ర భూసర్వేను నిర్వహించి రైతు ఖాతాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి అర్హులైన రైతులందరికీ డిజిటల్ పాస్ పుస్తకాలను అందించేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా మొదటి, రెండు విడతల్లో సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన డిజిటల్ పాస్ పుస్తకాలపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన రైతులందరికీ అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే జోషి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో డిజిటల్ పాస్ పుస్తకాల పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించారు. జేసీ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నెలాఖరు వరకు సాంకేతిక కారణాలు పరిష్కరించి అర్హులైన వారందరికీ డిజిటల్ పాస్ పుస్తకాలను అందించాలన్నారు.

పాసు పుస్తకాల జారీ ఇలా..
సమగ్ర వ్యవసాయ భూముల సర్వే ఆధారంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి జిల్లాలో 2,03,024 ఖాతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వీటిలో 7,980 ఖాతాలు వివిధ సాంకేతిక కారణాలతో రైతులు పాస్ పుస్తకాలు పొందలేకపోయారని అధికారులు గుర్తించారు. దీనిపై మూడు నెలలుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు జిల్లావ్యాప్తంగా 19 మండలాల్లో 2020 ఖాతాలను విచారణ జరిపి అర్హులను గుర్తించారు. వీటిలో 5780సాంకేతిక కారణాలు, పాస్ పుస్తకాల జారీకి అవకాశం లేనివిగా గుర్తించారు.

ఈ ఖాతాలను ఆన్‌లైన్ ధరణిలో నమోదు చేయడమేకాకుండా డిజిటల్ పాస్ పుస్తకాల జారీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ పాస్ పుస్తకాలు ముద్రణ పూర్తయి ఆయా మండలాలకు చేరుకోవడంతో రెవెన్యూ అధికారులు వాటిని రైతులకు అందిస్తున్నారు. ఈ పాస్ పుస్తకాల్లో ప్రధానంగా రైతుల ఖాతాల్లో తప్పులు, ఖాతాలు ఒకరిపేరు మీద మరొకరు పడడం, విస్తీర్ణంలో తేడాలు ఉండడంతో వీటన్నింటిని సరి చేసి అధికారులు రైతులకు పాస్ పుస్తకాలను అందిస్తున్నారు. ఆరునెలల నుంచి ప్రభుత్వ కార్యాలయం చుట్టూ రైతులు తిరగడంతో జేసీ భాస్కర్‌రావు పర్యవేక్షణలో ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తూ చిన్న చిన్న సాంకేతిక లోపాలున్న రైతు ఖాతాలను సరి చేసి రైతులకు అందిస్తున్నారు.

పెండింగ్ ఖాతాలపైనే ప్రత్యేక దృష్టి
జిల్లావ్యాప్తంగా పెండింగ్ ఖాతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో మొత్తం 5,780 ఖాతాలను అధికారులు గుర్తించి పార్ట్-బి కింద క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇందులో బాసరలో 8, భైంసాలో 165, కుభీర్‌లో 126, కుంటాలలో 628, లోకేశ్వరంలో 15, ముథోల్ 115, తానూరు 511, దస్తురాబాద్ 949, దిలావర్‌పూర్ 570, కడెం పెద్దూర్ 195, ఖానాపూర్ 61, లక్ష్మణచాంద 44, మామడ 111, నర్సాపూర్ (జీ) 896, నిర్మల్ రూరల్ 286, నిర్మల్ అర్బన్ 19, పెంబి 4, సారంగాపూర్ 1016, సోన్ 61 పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఖాతాల్లో కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు కోర్టు పరిధిలో ఉన్న అంశాలు ఉన్నాయి. దీంతో ఇందులో అర్హులు ఎంతమనేది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అధికారులు పాసుపుస్తకాల జారీకి చర్యలు తీసుకంటున్నారు. అయితే 5780 ఖాతాల్లో దాదాపు 90శాతం ఖాతాలు పాసుపుస్తకాల జారీకి అర్హులు కారని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. వీరందరికీ నోటీసులు జారీ చేసి భూవివరాలను పరిష్కరించుకుంటేనే డిజిటల్ పాసుపుస్తకాలను అందిస్తామని, ఆ దిశగా అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...