స్పీడ్‌గన్‌తో వేగానికి కళ్లెం


Thu,June 13, 2019 03:36 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ప్రమాదాల నివారణకు సర్కారు చర్యలు చేపట్టింది. అతివేగంగా వెళ్లే వాహనాలను నియంత్రించడానికి హైవే, రాష్ట్ర రహదారుల గుండా స్పీడ్ గన్‌లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌లోని రింగ్ రోడ్డులో స్పీడ్ గన్ ఏర్పాటు చేయగా అక్కడ సత్ఫలితాలు వచ్చాయి. కాగా ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. పోలీసు శాఖ, రవాణ శాఖ అధికారులకు వేర్వేరుగా రెండు పరికరాలు రానున్నాయి. ఈ నెల 15న రాష్ట్ర రాజధానిలో రోడ్ సేఫ్టీపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి స్పస్టమైన ఆదేశాలు రాగానే స్పీడ్‌గన్ ఆపరేటింగ్‌కు సిబ్బందిని ఎంపిక చేసి త్వరలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రమాదాల నియంత్రణ
రాష్ట్ర, జాతీయ రహదారులపై వాహనాలు అతివేగంగా నడపడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజూ ఏదో ఒకచోట ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో మృత్యువాత పడగా.. వందల సంఖ్యలో గాయాల పాలవుతున్నారు. రాష్ట్రంలో సగటున ఏడాదికి ఏడు వేల మంది మృతి చెందుతున్నారు. కనీసం 20 శాతం ప్రమాదాలను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. నిబంధనల ప్రకారం గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి. అంత కన్నా ఎక్కువ వేగంగా వెళ్లే వాహనాలను అరికట్టడానికి స్పీడ్‌గన్‌లను ఏర్పాటు చేయనున్నారు. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులపై ఈ స్పీడ్‌గన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. రవాణా, పోలీసు శాఖ వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. ఇప్పటికే కరీంనగర్‌లో రవాణాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పీడ్‌గన్ పరికరాన్ని కేటాయించింది. కాగా.. ఉమ్మడి జిల్లా కేంద్రం రవాణాశాఖకు, పోలీసుశాఖకు త్వరలో స్పీడ్‌గన్‌లను అందజేయనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ నెల 15న రాష్ట్ర రాజధానిలో అధికారులతో సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు రానున్నాయి.

ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు
స్పీడ్‌గన్ ఆపరేటింగ్‌కు ప్రత్యేక సిబ్బందిని నియమించి శిక్షణను ఇవ్వనున్నారు. జిల్లా సరిహద్దులోని జాతీయ రహదారి, రాష్ట్ర రహదారులపై ఈ స్పీడ్‌గన్‌లను ఏర్పా టు చేస్తారు. కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తారు. రహదారులపై గంటకు వంద కిలో మీటర్ల వేగం కన్నా ఎక్కువ వేగంగా వెళ్లే ద్విచక్రవాహనాలు, ఏ ఇతర వాహనాలనైనా ఈ స్పీడ్‌గన్ గుర్తిస్తుంది. ఆ వెంటనే వాటి ఫొటోలను తీస్తుంది. కంప్యూటర్‌లో ఈ వాహనాలను గుర్తించి నెంబర్ ప్లేట్ ఆధారంగా యజమానిని గుర్తిస్తారు. ఈ-చలానా ద్వారా నేరుగా పోస్టులో యజమానుల ఇంటికి జరిమానాలను పంపిస్తారు.
మహారాష్ట్ర, ఇతర రాష్ర్టాలకు చెందిన వాహనాలకు సైతం జరిమానాలను విధిస్తారు. ఒకసారి స్పీడ్‌గన్‌కు చిక్కిన వాహనం మరో సారి అదే స్పీడ్‌లో వస్తే ఆ వాహనాన్ని గుర్తించి సమీప చెక్‌పోస్టులకు సమాచారం అందించి అక్కడ ఆ వాహనాన్ని అడ్డుకుంటారు. గతంలో వేసిన చలానాతో పాటు తాజాగా వేసిన జరిమానాలను కట్టించుకుంటారు. లేదంటే వాహనం నడిపే డ్రైవర్‌పై కేసులు నమోదు చేయనున్నారు. ఇలా ప్రమాదాల నివారణకు రాష్ట్ర సర్కారు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...