కారుదే జోరు


Wed,June 12, 2019 12:52 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారు జోరు కొనసాగుతున్నది. టీఆర్‌ఎస్ విజయ పరంపర సాగుతోంది. ఆది నుంచి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉద్యమ పార్టీకి అండగా నిలువగా.. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చేశాయి. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్‌ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లా ప్రజలు అండగా ఉంటున్నారు. 2014లో ఏడు స్థానాలు అసెంబ్లీ స్థానాలు, 2ఎంపీ స్థానాలు గెలువగా.. బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరు, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఒకరు కూడా టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. దీంతో జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు టీఆర్‌ఎస్ ఖాతాలో చేరాయి. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 10అసెంబ్లీ స్థానాలకుగాను.. 9 చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక్క ఆసిఫాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోగా.. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆత్రం సక్కు కూడా ఆ పార్టీని వీడారు. ఇటీవల 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయగా.. ఆయన కూడా టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనమయ్యారు. దీంతో ఆ పార్టీకి జిల్లా నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం టీఆర్‌ఎస్ కోల్పోగా.. పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని మళ్లీ తన ఖాతాలో వేసుకుంది.

జనవరిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున విజయం సాధించారు. 65-70శాతం మంది టీఆర్‌ఎస్ మద్దతుదారులే సర్పంచులుగా విజయం సాధించారు. జిల్లాలో 1508గ్రామ పంచాయతీలు ఉండగా.. 1503గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. మరో అయిదు గ్రామ పంచాయతీలకు గడువు ముగియకపోవటంతో ఎన్నికలు జరుగలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో 1010 గ్రామ పంచాయతీలను టీఆర్‌ఎస్ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన ప్రాదేశిక పోరులో కారు జోరు కొనసాగింది.

ఉమ్మడి జిల్లాలో 567 ఎంపీటీసీ స్థానాలకుగాను.. 326ఎంపీటీసీ స్థానాలకు టీఆర్‌ఎస్ దక్కించుకుంది. 66మండలాలకుగాను.. 54చోట్ల టీఆర్‌ఎస్ మండల పరిషత్‌లను దక్కించుకుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15మండలాలుండగా.. క్లీన్‌స్వీప్ చేసింది. నిర్మల్‌లో 18మండలాలకు.. 13, ఆదిలాబాద్‌లో 17మండలాలకు.. 11, మంచిర్యాలలో 16మండలాలకు.. 15 చోట్ల టీఆర్‌ఎస్ వారే ఎంపీపీలుగా గెలిచారు. 66జడ్పీటీసీ స్థానాలకు.. 47జడ్పీటీసీ స్థానాలు గెలుచుకుంది. మరో ఇద్దరు స్వతంత్రులు, ఇద్దరు కాంగ్రెస్ వారు టీఆర్‌ఎస్‌కే మద్దతు ఇవ్వటంతో.. వీరి సంఖ్య 51కి చేరింది. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తున్నారు. మరోవైపు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక వ్యూహం, సమన్వయంతో ముందుకెళ్తుండగా.. ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి పెట్టడంతో జిల్లాలో టీఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా జిల్లాలో రోజురోజుకు దిగజారిపోతోంది. 2014సాధారణ ఎన్నికల్లో ఒకే ఒక అసెంబ్లీ స్థానం (ముథోల్)లో కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే గెలువగా.. ఆ పార్టీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఆ పార్టీకి జిల్లాలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆత్రం సక్కు గెలువగా.. ఇటీవల 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేశారు. దీంతో ఆయన కూడా ఈ 12మంది ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ ఎల్పీ నుంచి టీఆర్‌ఎస్ ఎల్పీలో విలీనమయ్యారు. దీంతో ఆ పార్టీకి జిల్లా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ మద్దతుదారులు అంతంత మాత్రంగానే గెలిచారు. వారంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో మూడో స్థానానికి పరిమితంకాగా..

పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. తాజాగా జరిగిన ప్రాదేశిక పోరులోనూ ఆ పార్టీ ఆశించిన మేర స్థానాలు దక్కలేదు. 567ఎంపీటీసీ స్థానాలకుగాను.. కేవలం 138స్థానాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. 11మంది జడ్పీటీసీ సభ్యులు గెలువగా.. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ జడ్పీటీసీ టీఆర్‌ఎస్‌లో చేరటంతో 10కి పడిపోయింది. నిర్మల్‌లో 5, మంచిర్యాలలో 2, ఆదిలాబాద్‌లో 3చొప్పున జడ్పీటీసీ సభ్యులున్నారు. ఎంపీపీలకు సంబంధించి.. నిర్మల్‌లో 5, ఆదిలాబాద్‌లో 1, మంచిర్యాలలో ఒకటి చొప్పున మొత్తం 7ఎంపీపీ స్థానాలు మాత్రమే కాంగ్రెస్‌కు దక్కాయి.

జిల్లాలో బీజేపీకి ఒక్క ఎంపీ స్థానం మినహా.. ఏ ఎన్నికల్లోనూ ఆశించిన మేర స్థానాలు రావటం లేదు. 2014సాధారణ ఎన్నికల్లో ఒక్క స్థానం దక్కక పోగా.. తాజాగా 2018లోనూ అదే పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులు ఒకరిద్దరు తప్పా.. ఆశించిన స్థాయిలో ఎవరూ గెలవలేదు. తాజాగా ప్రాదేశిక పోరులోనూ ఆ పార్టీ ఉనికి అంతంత మాత్రమేనని తేలిపోయింది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో కొద్దిగా ఉన్నా.. మిగతా జిల్లాలో ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి జిల్లాలో 41స్థానాలు గెలువగా.. ఆదిలాబాద్‌లో 33, నిర్మల్‌లో 6, ఆసిఫాబాద్‌లో 3చొప్పున ఎంపీటీసీ స్థానాలు గెలిచింది. మంచిర్యాల జిల్లాలో అసలు బోణీ చేయలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 3ఎంపీపీ, 5జడ్పీటీసీ స్థానాలు దక్కగా.. నిర్మల్ జిల్లాలో ఒక వైస్ ఎంపీపీ స్థానం దక్కింది.

మిగతా జిల్లాల్లో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో ఖాతా కూడా తెరవలేదు. గ్రామస్థాయిలో క్యాడర్, సంస్థాగత నిర్మాణం లేదనేందుకు ప్రాదేశిక ఫలితాలే నిదర్శనంగా ఉన్నాయి. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లా.. ప్రస్తుతం ఆ పార్టీల కోట కూలిపోయింది. అసలు టీడీపీ ఉనికి లేకుండా పోయింది. 2014 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటోంది. క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకులు, క్యాడర్ పార్టీని వీడగా..
ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీకి లీడర్లు, క్యాడర్ లేకుండా పోయింది. పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు లేకపోగా.. ఎన్నికల్లో పోటీ కూడా చేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే జిల్లాలో టీడీపీ ఉనికి కోల్పోయింది.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...