జిల్లాకు గురుకళ


Wed,June 12, 2019 12:51 AM

నిర్మల్ అర్బన్, నమస్తే తెలంగాణ: పాఠశాల విద్యను ప్రారంభం నుంచే బలోపేతం చేస్తే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం గురుకుల విద్యను మరింత పటిష్టం చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒక బీసీ గురుకులం కేటాయించగా, జిల్లాకు మూడు నూతన గురుకులాలు మంజూరు అయ్యాయి. ఈనెల 17వ తేదీ నుంచి నూతన గురుకులాలను ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటీవల నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్షలో అదనపు సీట్లను కలుపుకొని విద్యార్థులకు కౌన్సిలింగ్‌ను నిర్వహించారు.

నిర్మల్, ముథోల్‌లో బాలికల.. ఖానాపూర్‌లో బాలుర..
ప్రభుత్వం జిల్లాలోని నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలకు బాలికల, ఖానాపూర్ నియోజకవర్గానికి బాలుర గురుకులాలను మంజూరు చేసింది. నూతన గురుకులాల్లో ఐదు, ఆరు, ఏడు తరగతులను ప్రారంభించనున్నారు. తరగతికి 80 మంది విద్యార్థుల చొప్పున ఒక్కో గురుకులంలో మూడు తరగతులకు కలుపుకొని మొత్తం 240 మంది విద్యార్థులు, జిల్లాలో 720 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. నూతన భవనాల నిర్మాణానికి సమయం లేకపోవడంతో అద్దె భవనాల్లో విద్యాబోధనతో పాటు వసతి కల్పించనున్నారు. నిర్మల్ నియోజకవర్గానికి మంజూరైన గురుకులాన్ని జిల్లా కేంద్రంలోని పాత సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో, ఖానాపూర్ నియోజకవర్గానికి మంజూరైన గురుకులాన్ని ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో, ముథోల్‌కు మంజూరైన గురుకులాన్ని ముథోల్‌లోని జాగృతి జూనియర్ కళాశాల భవనంలో కొనసాగించనున్నారు.

ప్రారంభించనున్న మంత్రి, ఎమ్మెల్యేలు
ఈనెల 17వ తేదీన నూతన గురుకులాలను మంత్రి ఐకే రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. నిర్మల్‌లో మంత్రి ఐకే రెడ్డి, ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్, ముథోల్‌లో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి గురుకులాలను ప్రారంభిస్తారు.

సర్వత్రా హర్షం
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు ఒక్కో నియోజకవర్గానికి అదనంగా ఒక్కో బీసీ గురుకులాన్ని మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తమ పిల్లలను చదివించేందుకు ప్రైవేట్ పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించలేక, ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పించలేక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి వారు తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పాఠ్యపుస్తకాలు, వారికి అవసరమైన సామగ్రి, భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తుండడంతో వారు గురుకులాల వైపు అడుగులు వేస్తున్నారు. గురుకులాల్లో ప్రవేశానికి పోటీ తీవ్రమవుతుండడంతో తమ పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి ప్రవేశ పరీక్ష రాయిస్తున్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...