మోదం.. ఖేదం.. !


Sat,May 25, 2019 11:54 PM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 70మండలాలు ఉండగా.. ఇందులో 66 గ్రామీణ మండలాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1508 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 66 జడ్పీటీసీ, 567ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఒక జడ్పీటీసీ స్థానంతో పాటు 9ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 65 జడ్పీటీసీ, 558ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో భాగంగా ఈ నెల 6న ఉమ్మడి జిల్లాలో 26 జడ్పీటీసీ స్థానాలకు, 194ఎంపీటీసీ స్థానాలకుగాను.. 192 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. తొలి విడతలో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంకాగా.. నిర్మల్ జిల్లాలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో ఒకరు చొప్పున టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.

రెండో విడత కింద 20మండలాల్లోని 20జడ్పీటీసీ స్థానాలకు, 181ఎంపీటీసీ స్థానాలకు గాను.. 174ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నిర్మల్ జిల్లాలో నాలుగు, మంచిర్యాల జిల్లాలో మూడు.. మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మూడో విడతలో భాగంగా ఈ నెల 14న ఉమ్మడి జిల్లాలో 20జడ్పీటీసీ స్థానాలకుగాను.. 19జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ నుంచి ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మీ జైనూర్ జడ్పీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక 192ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

12 చోట్ల లెక్కింపు కేంద్రాలు

మూడు విడతల్లో స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించగా.. వీటి ఓట్ల లెక్కింపును ఈ నెల 27న నిర్వహించాల్సి ఉంది. ప్రత్యక్ష ఎన్నికల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఓట్ల లెక్కింపు తేదీకి.. పరోక్ష ఎన్నికల (మండల, జిల్లా పరిషత్ చైర్మన్లు)కు మధ్య 40రోజుల సమయం ఉండటంతో.. ఈ లోగా గెలిచిన సభ్యులను ప్రలోభాలకు గురి చేసే అవకాశముందని రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపును వాయిదా వేసింది. ప్రత్యక్ష ఎన్నికల ఫలితాల లెక్కింపునకు.. పరోక్ష ఎన్నికల నిర్వహణకు మధ్య ఉన్న సమయాన్ని తగ్గించాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఎస్‌ఈసీ పేర్కొంది. అప్పటి వరకు పాఠశాలలు, కళాశాలల్లోని బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలకు పోలీసు భద్రత కల్పిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి నియోజకవర్గ కేంద్రంతో పాటు ఇతర చోట్ల కూడా ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం నాలుగు జిల్లాల పరిధిలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12చోట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మూడు చోట్ల ఆదిలాబాద్, బోథ్, ఉట్నూర్‌లో.. నిర్మల్ జిల్లాకు సంబంధించి మూడు చోట్ల.. నిర్మల్, ముథోల్, ఖానాపూర్‌లో ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి నాలుగు చోట్ల మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, లక్సెట్టిపేటలో.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి రెండు చోట్ల ఆసిఫాబాద్, సిర్పూర్(టి)లో ఏర్పాటు చేశారు.

ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. త్వరలోనే ఓట్ల లెక్కింపు తేదీని ప్రకటించనున్నారు. ఈ నిర్ణయంతో కొందరికి ఖేదం.. మరికొందరికి మోదం అన్నట్లుగా మారింది. ఈ నెల 6, 10, 14తేదీత్లో మూడు విడతల్లో ఎన్నికలు జరుగ్గా.. తొలి విడత వారికి 21రోజులకు, రెండో విడత వారికి 17రోజులకు, మూడో విడత వారికి 13రోజులకు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ఉండేలా ముందుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఫలితాలపై టెన్షన్..

మరోవైపు జూలై 4న మండల పరిషత్‌లు, జూలై 5న జిల్లా పరిషత్‌ల కాలపరిమితి ముగియనుంది. జూలై 4తర్వాతే కొత్త మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాలు కొలువు దీరేందుకు అవకాశముంది. దీంతో ప్రత్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 27న పూర్తి చేస్తే.. పరోక్ష ఎన్నికలకు మరో 40రోజుల సమయం మధ్యలో ఉంటోంది. దీంతో స్థానిక సంస్థల సభ్యులు ప్రలోభాలకు గురయ్యే అవకాశముంది. దీంతో ఓట్ల లెక్కింపు వాయిదా వేయగా.. త్వరలోనే తేదీ ప్రకటించనున్నారు. ఎస్‌ఈసీ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు తీవ్ర నిరాశ మిలిగింది. ఎన్నికల ఫలితాల కోసం ఇప్పటికే వారంతా ఎదురు చూస్తుండగా.. తాజా నిర్ణయంతో మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. మరికొన్ని రోజుల వరకు ఫలితాలపై టెన్షన్ తప్పేలా లేదు. ఇప్పటికే ఓట్ల లెక్కల్లో నిమగ్నమైన వారంతా.. గెలుస్తామా.. లేదో.. తెలియక ఆందోళన చెందుతున్నారు.

ఫలితాలు వస్తే తమ భవితవ్యం తేలిపోయేదని భావించారు. ఇక ఎంపీపీ, జడ్పీ చైర్మన్ పదవులు ఆశిస్తున్న వారికి మాత్రం ఈ వాయిదా నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా మారింది. స్థానిక సంస్థల ప్రత్యక్ష ఓట్ల లెక్కింపు తర్వాత 40రోజుల పాటు ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులను క్యాంపుల్లో ఉంచడం, వారికి సకల సేవలు, మర్యాదలు చేయాల్సి వచ్చేంది. మరోవైపు డబ్బుల పంపిణీ, నజరానాల ప్రకటన ఎలాగో ఉండనుంది. ఈ నిర్ణయంతో ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల మధ్య గడువు తగ్గడంతో.. వ్యయ, ప్రయాసలు తగ్గనున్నాయి. హమ్మయ్యా అంటూ ఎంపీపీ, జడ్పీ చైర్మన్ అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...