ఐదో విడత హరితహారానికి సన్నద్ధం!


Sat,May 25, 2019 02:39 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో 1216.60 హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణం 3734.43 హెక్టార్లుకాగా.. ఈ లెక్కన అడవుల విస్తీర్ణం 32.58శాతం ఉంది. జిల్లాలో కవ్వాల్ టైగర్ రిజార్వ్ ఫారెస్టులోని కోర్, బఫర్ ఏరియాలు ఉన్నాయి. జిల్లాలో 751.01 చదరపు కిలోమీటర్లలో కవ్వాల్ పులుల రక్షిత ప్రాంతం విస్తరించి ఉండగా ఇందులో 517.48 చ.కిలో మీటర్ల కోర్ ఏరియా, 233.53 చ.కి.మీ. బఫర్ ఏరియా ఉంది. జిల్లాలో తెలంగాణకు హరితహారంలో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. 2015జూన్‌లో ప్రారంభించగా.. ఇప్పటికే నాలుగు విడతల్లో మొక్కలు నాటారు. తాజాగా ఐదో విడతలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2015లో 3కోట్లకుపైగా మొక్కలు నాటగా.. 2016లో నిర్మల్ జిల్లాలో 23లక్షల మొక్కలు నాటారు. 2017లో 96లక్షల మొక్కలకుగాను.. 59.60లక్షల మొక్కలు నాటారు. 2018లో 1.02కోట్ల మొక్కలను నాటారు. ఐదో విడతలో భాగంగా 2.10కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

2.10 కోట్లమొక్కలు సిద్ధం
జిల్లాలో మొత్తం 312 నర్సరీల్లో 2.10కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 248నర్సరీల్లో 1.40కోట్ల మొక్కలను పెంచారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 62నర్సరీల్లో 64లక్షల మొక్కలు పెంచారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రెండు నర్సరీలుండగా.. మూడు లక్షల మొక్కలను పెంచారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 1.40కోట్ల మొక్కలు నాటుతుండగా.. మిగతావి ఆయా శాఖల ఆధ్వర్యంలో నాటనున్నారు. జిల్లాలో 40శాతం టేకు మొక్కలను, 20శాతం హోంస్టెడ్ మొక్కలను, 40శాతం అడవులను పెంచే మొక్కలను నాటాలని నిర్ణయించారు. డీఆర్డీఏ, అటవీ శాఖ నర్సరీల్లో పెద్ద సంఖ్యలో టేకు మొక్కలను పెంచారు. సుమారు 85లక్షలకు పైగా టేకు మొక్కలు నాటాలని భావిస్తున్నారు. ఈ టేకు మొక్కలను రైతుల బీడు, ఖాళీ భూములు, పొలం గట్లపై నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. జూన్ మొదటి వారంలో వర్షాలు కురిస్తే మొక్కలు నాటడం ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లో పెంచిన మొక్కల్లో 80శాతం ఎదుగుదల ఉంది.

యాక్షన్‌ప్లాన్ సిద్ధం
ఐదో విడత హరితహారం కోసం అధికారులు యాక్షన్‌ప్లాన్ సిద్దం చేస్తున్నారు. ఏ ఏ ప్రాంతంలో మొక్కలు నాటాలనేది ముందే గుర్తిస్తున్నారు. ఇప్పటికే అంచనాలు తయారు చేయగా.. శాఖల వారీగా లక్ష్యాలను నిర్ధేశించారు. ఏ ఏ శాఖ ఆధ్వర్యంలో ఎన్ని మొక్కలు, ఎక్కడెక్కడ నాటాలనేది ముందే ఒక అంచనాకు వచ్చారు. వర్షాలు పడిన వెంటనే మొక్కలు నాటాలని నిర్ణయించారు. తొలకరి వర్షాలకే గుంతలు తీయాలని, ఆ వెంటనే మొక్కలు నాటాలని కార్యాచరణ రూపొందించారు. ప్రతి మొక్కకు జియోట్యాగింగ్ చేయాలని నిర్ణయించారు. గతేడాది కోటి మొక్కలు నాటగా.. ఇందులో డీఆర్డీఏ ఆధ్వర్యంలో 60లక్షల మొక్కలను నాటారు. 60శాతం వరకు మొక్కలు బతికి ఉన్నాయని వర్షాలు కురిస్తే మళ్లీ చిగురిస్తాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఐదో విడత హరితహారం కోసం సిద్ధంగా ఉన్నామని డీఆర్డీవో వెంకటేశ్వర్లు నమస్తే తెలంగాణతో పేర్కొన్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు సిద్ధ్దంగా ఉన్నాయని.. వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటుతామని తెలిపారు. ఏ ప్రాంతంలో ఎన్ని మొక్కలు నాటాలనేది గుర్తించామని.. శాఖల వారీగా లక్ష్యాలను కలెక్టర్ ప్రశాంతి నిర్దేశించారన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...