నేటి నుంచి సోయా విత్తనాల పంపిణీ


Sat,May 25, 2019 02:38 AM

నిర్మల్ టౌన్: మరికొద్ది రోజుల్లో వానాకాలం సీజన్ వచ్చేస్తున్నది. మృగశిర కార్తెతో సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వానాకాలం సీజన్‌లో అవసరమైన రైతులందరికీ సోయా విత్తనాలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున విత్తనాలు జిల్లాకు వచ్చాయి. జిల్లాలో మూడు, నాలుగేండ్లుగా సోయా పంట సాగుకు రైతులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడులు ఇచ్చే పంట కావడంతో సోయాకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో ముఖ్యంగా నల్లరేగడి భూములతో పాటు ఎర్రరేగడి, చలిదుబ్బ భూములు ఎక్కువగా ఉండడంతో వర్షాపాతం తక్కువగా ఉన్నప్పటికి సోయా పంట పండే అవకాశం ఉంది. కేవలం 90 రోజుల్లోనే తక్కువ పెట్టుబడితో రైతు చేతికి వచ్చే అవకాశం ఉండడం, మార్కెట్లో మద్దతు ధర కూడా బాగా పలుకుతుండడంతో కష్టకాలంలో రైతు పెట్టుబడికి అవసరమైన ఆర్థిక అవసరాలు తీర్చే పంటగా సోయాను ఎక్కువ మంది రైతులు సాగు చేస్తున్నారు.

జిల్లాలో 50వేల హెక్టార్లలో సోయా సాగుకు అంచనా...
జిల్లాలో వానాకాలం సీజన్‌లో 50వేల హెక్టార్లలో సోయా సాగు ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా పండించే పంటల్లో పత్తి తర్వాత సోయా, పసుపు, మొక్కజొన్న, వరి పంటలు ప్రధానమైనప్పటికీ సోయాను చాలా మంది రైతులు సాగు చేస్తారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 19 మండలాల్లో 40వేల హెక్టార్లకు పైగా సోయా సాగు కాగా.. ఈసారి మరో పదివేల హెక్టార్లు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కడెం, ఖానాపూర్, లక్ష్మణచాంద, సారంగాపూర్, కుంటాల, కుభీర్, తానూరు, లోకేశ్వరం, దిలావర్‌పూర్, పెంబి, దస్తురాబాద్ తదితర మండలాల్లో సోయా సాగుకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. జూన్‌లో సోయాను విత్తుకుంటే ఆగస్టులో పంట చేతికొచ్చే అవకాశం ఉంది. దీంతో రెండో పంట కింద మొక్కజొన్న పంట సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎకరానికి 8 క్వింటాళ్ల నుంచి పది క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. క్వింటాలుకు రూ. 2600 నుంచి రూ. 3వేల వరకు ధర పలుకుతోంది. విత్తనాల ఖర్చుతో పాటు ఇతర ఖర్చులు తక్కువగా ఉండడంతో ఈ పంటనే రైతులు ఎక్కువగా సాగు చేస్తారు.

జిల్లాకు 39వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు...
జిల్లాలో 39వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉంచారు. శనివారం నుంచి ఈ విత్తనాలు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం జిల్లాలో మొత్తం 44 విక్రయ కేంద్రాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 17 సహకార సంఘాలుండగా.. ఒక్కో సహకార సంఘానికి 2 నుంచి 3 సోయా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పారదర్శకంగా విత్తనాల పంపిణీ...
సోయా విత్తనాల పంపిణీకి వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. విత్తనాలు పక్కదారి పట్టకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. సహకార సంఘంలో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రంలో సబ్సిడీపై ఒక్కో రైతుకు ఎకరానికి రెండు బస్తాల చొప్పున సోయా విత్తనాలను అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. 30 కేజీల బ్యాగు ధర రూ. 1845 ఉంటే 35శాతం సబ్సిడీ పోను రూ. 1095 చెల్లించాల్సి ఉంటుంది. సోయా విత్తనాలు పొందాలనుకునే రైతు తప్పనిసరిగా పట్టా పాసుపుస్తకాన్ని తీసుకొచ్చి వ్యవసాయశాఖ కార్యాలయంలో సోయా కూపన్లను పొందాలని సూచించారు. జిల్లాలో 78 వ్యవసాయ క్లస్టర్లుండగా.. ఏఈలు ప్రతిరోజు ఆయా గ్రామంలో అవసరమైన రైతులకు కూపన్లను జారీ చేస్తారు. జారీ చేసిన కూపన్‌తో విక్రయ కేంద్రానికి వెళితే విత్తనాలు పొందవచ్చు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ, పోలీసుశాఖ ఆధ్వర్యంలో విత్తన కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు...
సోయా విత్తనాలు పక్కదారి పట్టకుండా వ్యవసాయ, పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. నాలుగేండ్లుగా జిల్లాలో రైతుల పేరిట సోయా విత్తనాలను పొందిన దళారులు వాటిని బయట మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయించడం, మహారాష్ట్రకు తరలించి అమ్ముకోవడంతో సోయా విత్తనాల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ, పోలీసుశాఖ రైతులు తీసుకున్న విత్తనాలు పక్కదారి పట్టకుండా సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. కుభీర్, తానూరు, బాసర మండలంలోని బిద్రెల్లి, కుంటాల మండలంలోని దౌనెల్లి, నర్సాపూర్ మండంలోని గొల్లమాడ, సారంగాపూర్ మండల్లాలోని స్వర్ణ తదితర ప్రాంతాల్లో వాహనాల తనిఖీ చేపట్టాలని పోలీసుశాఖకు సూచించింది. సబ్సిడీ విత్తనాలు అక్రమంగా తరలిస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడమే కాకుండా పీడీ యాక్టు చట్టాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంది. దీనికితోడు రైతులు స్వచ్ఛందంగా రైతులు అవసరం మేరకు విత్తనాలు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...