గుట్కా దందాపై ఉక్కుపాదం


Tue,May 21, 2019 01:00 AM

-సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
-చెక్‌పోస్టుల వద్ద నిత్యం పొలీసుల తనిఖీలు
-ఇతర రాష్ర్టాల నుంచి అక్రమ రవాణా
-ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదు
-రూ.76.46 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

-జనవరిలోనే మూడు కేసులు నమోదు.. రూ.30 లక్షలు విలువ చేసే గుట్కా స్వాధీనం
నిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ : నిషేధిత గుట్కా, పాన్‌ మసాలాల అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ప్రభుత్వం వీటిపై నిషేధం విధించినప్పటికీ కొందరు గుట్కా వ్యాపారస్తులు అక్రమంగా ఇతర ప్రాంతాల నుంచి నాసిరకం గుట్కా ప్యాకెట్‌లను తెప్పించి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి కొందరు వ్యాపారులు పెద్ద మొత్తంలో గుట్కాను దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. గుట్కా అమ్మకాలు, రవాణాపై పోలీసులు నిఘా ఉంచడంతో గుట్కా తరలించే వాహనాలు పట్టుకొని సీజ్‌ చేస్తున్నారు. నిషేధిత గుట్కా తినడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని నిర్మల్‌ ఎస్పీ శశిధర్‌ రాజు అక్రమార్కులపై కొరడా ఝలిపిస్తున్నారు.

ఈ ఏడాదిలో గుట్కా కేసులు...
జనవరి 12వ తేదీన జిల్లా కేంద్రంలోని నారాయణ రెడ్డి మార్కెట్‌లో హీరా పాన్‌ దుకాణానికి సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న రూ.2లక్షల 50వేల విలువ చేసే 10 గుట్కా బ్యాగులు పట్టుకున్నారు.
జనవరి 14వ తేదీన పట్టణంలోని కబూతర్‌ కమాన్‌ కాలనీలో అజీం ఇంట్లో గుట్కా నిల్వ చేసినట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీ చేయగా లక్ష విలువ చేసే గుట్కా ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు.
జనవరి నెల 16 న లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌ చెక్‌ పోస్టు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించగా కర్ణాటక నుంచి కడెంకు తరలిస్తున్న రూ.27 లక్షల విలువ చేసే గుట్కాను పట్టుకున్నారు.
తాజాగా గంజాల్‌ టోల్‌ ప్లాజా వద్ద కర్ణాటక నుంచి నిర్మల్‌ వైపు వస్తున్న వాహనంలో రూ.21 లక్షల విలువ చేసే గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గుట్కా నిల్వలపై పోలీసుల నిఘా..
జిల్లా కేంద్రంలో ఉన్న పలు ప్రాంతాల్లో గుట్కా నిల్వలపై పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో గుట్కా సంచులను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమై అడ్డుకట్ట వేస్తున్నారు. జిల్లాకు మహారాష్ట్ర ప్రాంతం సరిహద్దున ఉండడంతో వీరి వ్యాపారం మూడు గుట్యాప్యాకెట్లు, ఆరు అంబర్‌ ప్యాకెట్లలా కొనసాగేది. ఇప్పుడు ఎస్పీ శశిధర్‌ రాజు ఆదేశాల మేరకు పోలీసులు నిర్మల్‌ జిల్లాలకు భైంసా, సారంగపూర్‌, ఆదిలాబాద్‌ ఇలా మూడు వైపులా నిఘాను పటిష్టం చేయడంతో గుట్కా కేసులు సంఖ్య రోజురోజుకు తగ్గి పోతున్నది. దిగుమతి చేసుకున్న గుట్కాను పట్టణంలోని శివారు ప్రాంతాలు, గోదాములు, పురాతన ఇండ్లలో నిల్వ చేస్తున్నారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ ద్వారా తనిఖీలను ముమ్మరం చేస్తూ అడ్డుకట్ట వేస్తున్నారు.

సవాల్‌గా తీసుకున్న పోలీసులు
గుట్కా, పాన్‌ మసాలాల అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ గుట్కా లభ్యమవుతుండడంతో ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది. ఎక్కడ నిల్వ చేస్తున్నారు.. అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేయడంతో పెద్ద మొత్తంలో గుట్కా సంచులు పట్టుబడుతున్నాయి. గతేడాది జిల్లా వ్యాప్తంగా 55 కేసులు నమోదు చేసి గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న 84 మంది నిందితులను అరెస్ట్‌ చేసి వీరి వద్ద నుంచి రూ.30,36,700 గుట్కా ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకోగా ఈ సంవత్సరం కేవలం 5నెలల్లో సోన్‌ సర్కిల్‌ పరిధిలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఆరు కేసుల్లో రూ.76 లక్షల 46వేల 300 రూపాయల విలువ చేసే గుట్కాను పట్టుకుని అక్రమ గుట్కా వ్యాపారుల్లో పోలీసులు గుబులు పుట్టిస్తున్నారు.

గంజాల్‌ టోల్‌ప్లాజా గుట్కా స్వాధీనం...
సోన్‌ : మండలంలోని గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం అక్రమంగా తరలిస్తున్న రూ. 21లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శశిధర్‌రాజు వెల్లడించారు. వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా.. పాండిచ్చేరి నుంచి కోల్‌కత్తా వెళ్తున్న ఐచర్‌ వాహనంలో 77 గుట్కా ప్యాకెట్ల సంచులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ రూ. 21లక్షలుగా ఉంటుందని వివరించారు. వ్యాపారుల కదలికలపై ప్రత్యేక నిఘా పెంచడంతోనే గత రెండు నెలల్లో రూ. 70లక్షల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అక్రమ గుట్కా రవాణాను పట్టుకున్న డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సోన్‌ సీఐ రమేశ్‌బాబు, ఎస్సై కె.రవీందర్‌, ఎఎస్సై నారాయణరెడ్డి, కానిస్టేబుళ్లు లక్ష్మణ్‌, గంగాధర్‌, సుదర్శన్‌, సాయికుమార్‌లను ప్రత్యేకంగా అభినందించారు.

ఉట్నూర్‌లో...
ఉట్నూర్‌, నమస్తే తెలంగాణ : మండల కేంద్రంలో సోమవారం పోలీసులు పలు వ్యాపార సముదాయాలపై దాడులు నిర్వహించి భారీగా గుట్కాను పట్టుకున్నారు. ఎస్సై జగన్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో గుట్కా నిల్వలు ఉన్నాయన్న పక్కా సమాచారం మేరకు క్రైం విభాగం సీఐ ప్రసాద్‌రావు బృందం ఉట్నూర్‌కు చేరుకున్నారన్నారు. అనంతరం పట్టణంలోని వెంకటసాయి కిరాణా యజమాని హరీశ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ. 2 లక్షల 70 వేల విలువ గల గుట్కా లభ్యమైందన్నారు. సీజ్‌ చేసిన అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. విక్రయందారుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. గుట్కాను ప్రభుత్వం నిషేధించిందన్నారు. అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎస్సై జగన్మోహన్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...