తాగి నడిపితే జైలుకే..


Mon,May 20, 2019 03:10 AM

-జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ 208 కేసులు నమోదు
-తాగి వాహనం నడిపిన ఏడుగురికి జైలు శిక్ష
-కుటుంబీకుల సమక్షంలో పోలీసుల కౌన్సెలింగ్
నిర్మల్ అర్బన్, నమస్తే తెలంగాణ : రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. రోడ్డు ప్రమాదాలకు మద్యం సేవించి వాహనాలను నడుపడం, అతివేగం తదితర కారణాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలను ముమ్మరం చేశారు. ప్రతి రోజూ వాహనాల తనిఖీలతో పాటు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులను చేపడుతున్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్సైలు నిత్యం తనిఖీలు చేపడుతూ కేసులను నమోదు చేస్తున్నారు.

నిర్మల్ జిల్లాలో 208 కేసులు నమోదు
మద్యం తాగి వాహనాలు నడిపిన వారితో పాటు రహదారి నియమాలు పాటించని వారికి ఈ-చలాన్, ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు, వారి పూర్తి వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు నెలల్లో ఎం.వీ యాక్టు 185 సెక్షన్ కింద 208 మంది డ్రంకెన్ డ్రైవ్‌లో కేసులు నమోదు చేశారు.

ఏడుగురికి జైలు శిక్ష
జిల్లాలో మద్యం సేవించి వాహనాలను నడుపుతూ పట్టుబడిన వాహనదారుల్లో గుబులు రేగుతుంది. ఎస్పీ శశిధర్ రాజు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులను చేపట్టడంతో మందుబాబులు మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. తాగి వాహనాలను నడిపే వారికి జరిమానా విధించడంతో పాటు మోతాదుకు మించి మద్యం సేవించిన 49 మందిపై కేసులు నమోదు చేసి ఇందులో ఏడుగురుకి జైలు సైతం విధించారు.

సత్ఫలితాలను ఇస్తున్న పోలీసుల కౌన్సెలింగ్
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ జరిమానాలు విధించడమే కాకుండా వారిలో పూర్తిగా మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. స్పాట్‌లో కేసును నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసి మరుసటి రోజు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. దీని ద్వారానైనా మందు బాబుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...