నాసిరకం విత్తనాలపై నిఘా


Sun,May 19, 2019 01:18 AM

-బీటీ-3 విత్తనాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి
-టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు
-ఎరువుల దుకాణాల్లో నిరంతర తనిఖీలు
-రైతులను అప్రమత్తం చేస్తున్న వ్యవసాయశాఖ అధికారులు
ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : నాసిరకం విత్తనాలపై నిఘా కొనసాగిస్తున్నామని, వాటిని అరికట్టేందుకు ప్రత్యేక పోలీసు టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేశామని ఎస్పీ విష్ణువారియర్ వెల్లడించారు. ఈ విషయమై ఎస్పీ శనివారం జిల్లాకేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. వానాకాలం (ఖరీఫ్) సీజన్ సమీపిస్తుండడంతో వ్యాపారులు నాసిరకం విత్తనాలు, నిషేధిత బీటీ-3, పత్తి విత్తనాలను మార్కెట్‌లో, గ్రామస్థాయిలో విక్రయించడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. వీటిని అరికట్టేందుకు ముందస్తుగానే పోలీసు శాఖను అప్రమత్తం చేశామని తెలిపారు. అవసరమైన చోట ఆకస్మిక దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.

మహారాష్ట్ర సరిహద్దు గుండా, రైలు మార్గంలో నాసిరకం విత్తనాలను ముందుగానే తెప్పించుకొని జిల్లాలో నిల్వ చేయడానికి అక్రమార్కులు ప్రయత్నిస్తుంటారని పేర్కొన్నారు. అక్రమార్కులు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రవేశించి గ్రామాల్లో నేరుగా రైతులకు మాయమాటలు చెప్పి, తక్కువ ధర పేర ఎరవేసి విక్రయిస్తారని తెలిపారు. ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండి పకడ్బందీగా నిరోధించడానికి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. మండల కేంద్రాల వారీగా ఎస్సైలు అనుమతి ఉన్న లైసెన్సు వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించాలని సూచించామని తెలిపారు. లైసెన్స్ లేని వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.

అవగాహన కార్యక్రమాలు...
గ్రామాల వారీగా ప్రజలకు నాసిరకం విత్తనాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్సైలు పది మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతారన్నారు. వీరికి ప్రత్యేక నిఘా పోలీసు అధికారుల సహకారం ఉంటుందని తెలిపారు. ప్రజల వద్ద ఎలాంటి సమాచారం పోలీసులకు అందజేయాలన్నారు. నాసిరకం విత్తనాలు అమ్మేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులను పోలీసు టాస్క్‌ఫోర్స్ బృందంలో చేర్చుకోవాలని నిర్ణయించామని చెప్పారు.

ఇటీవలే నేరడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విత్తనాలకు సంబంధించి ముడి సరుకులను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్నదన్నారు. ప్రతి విత్తన దుకాణంలో కంపెనీల పేర్లు, రకాలు, నిల్వ సమాచారాన్ని టాస్క్‌ఫోర్స్ టీమ్ సేకరిస్తుందన్నారు. రైతులు లైసెన్స్ ఉన్న వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి తప్పనిసరి రసీదు తీసుకోవాలని ఎస్పీ కోరారు. గ్రామాల్లో తిరుగుతూ విత్తనాలు విక్రయిస్తున్న వారి సమాచారం పోలీస్ స్టేషన్‌లో తెలుపాలని కోరారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...