విత్తనాల కొనుగోలుపై రైతులను అప్రమత్తం చేయాలి


Sun,May 19, 2019 01:13 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ నాసిరకం విత్తనాలపై అప్రమత్తం చేయాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నాసిరకం విత్తనాలు అరికట్టడంలో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులు ఏకకాలంలో జిల్లాలో దాడులు నిర్వహించాలని సూచించారు. వానాకాలం సీజన్ సమీస్తున్న తరుణంలో వివిధ కంపెనీలు రైతులకు మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలలే కొనుగోలు చేయాలని రైతులకు సూచించాలన్నారు. గుర్తింపు లేని విత్తనాలు మార్కెట్‌లో వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. వివిధ జిల్లాల్లో అక్కడక్కడ అధికారుల దాడుల్లో పట్టుబడిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. మన జిల్లాలో ఇలాంటి విత్తనాలను విక్రయించకుండా మూడు శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి అరికట్టాలన్నారు. విత్తనాలు విత్తక ముందే రైతులకు పంటల సాగుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడానికి కరపత్రాలు, షార్ట్ ఫిలింలను రూపొందించాలన్నారు. టాస్క్‌ఫోర్స్ టీం జిల్లా, మండల కేంద్రాల్లో సీడ్స్ షాపులపై ఆకస్మికంగా దాడులు జరపాలన్నారు. అనుమతి లేని కంపెనీల విత్తనాలు పట్టుబడితే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ కంచ మోహన్, ఆర్డీవో సూర్యనారాయణ, జగదీశ్వర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయ అధికారి మంగీలాల్ ఏవోలు తదితర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...