సాగు ప్రణాళిక సిద్ధం..!


Fri,May 17, 2019 02:49 AM

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో 2019 వానాకాలం సీజన్‌లో సాగు చేసే పంటల ప్రణాళికను వ్యవసాయ శాఖ రూపొందించి.. సిద్ధం చేసింది. జూన్‌ రెండో వారంలో రాష్ర్టానికి రుతుపవనాలు వచ్చే అవకాశాలుండడంతో.. ఏరువాకకు అవసరమైన ఎరువులు, విత్తనాల సరఫరాపై అధికారులు దృష్టిసారించారు. వానాకాలం సీజన్‌కు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలకు సంబంధించి ఇప్పటికే యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించగా.. ఎరువులు, విత్తనాలు విడతల వారీగా జిల్లాకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రైతులకు ఈ నెలాఖరుకు పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విత్తనాలు, ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేసిన రాయితీ విత్తనాలను సరఫరా చేయనున్నారు. రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా అన్ని చర్యలు చేపట్టారు.

1,60,342హెక్టార్లలో పంటల సాగుపై అంచనా
జిల్లాలో ఈ ఏడాది వానాకాలంలో 1,60,342హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 2018-19 వానాకాలం సీజన్‌లో సాధారణ సాగు 1,50,337హెక్టార్ల సాధారణ సాగు ఉండగా.. సాధారణానికి మించి 1,55,624హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. 2018-19 యాసంగి సీజన్‌లో 53,350 హెక్టార్ల సాధారణ సాగు అంచనా ఉండగా.. 60,478 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. 2019 వానాకాలం సీజన్‌లో 1,60,342హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇందులో అత్యధికంగా పత్తి, సోయాబీన్‌ పంటలు సాగు చేయనున్నారు. జిల్లాలో పత్తి 52,707 హెక్టార్లలో, సోయాబీన్‌ 50,535 హెక్టార్లలో సాగు చేస్తారని భావిస్తున్నారు. 9489 హెక్టార్లలో మొక్కజొన్న, 8,786 హెక్టార్లలో కందులు, 1308 హెక్టార్లలో పెసర్లు, 4987 హెక్టార్లలో మినుములు, 402 హెక్టార్లలో ఇతర పప్పు ధాన్యాలు సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు.

7213 హెక్టార్లలో పసుపు, 669 హెక్టార్లలో మిర్చి, ఐదు హెక్టార్లలో చెరుకు, 38 హెక్టార్లలో ఉల్లి, 3379 హెక్టార్లలో ఇతర ఆహార ధాన్యాలు పండిస్తారని అంచనా వేశారు. రైతులు పండించే పంటలకు అవసరమైన విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో వివిధ పంటల సాగు కోసం 64,843 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని భావిస్తున్నారు. 50,538 హెక్టార్లలో సోయాబీన్‌ సాగు చేస్తే 56,597 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని గుర్తించారు. ఇందులో 28,298.6 క్వింటాళ్ల సోయాబీన్‌ విత్తనాలు టీఎస్‌ఎస్‌డీసీ, 16972.2 క్వింటాళ్ల విత్తనాలు హకా, 11319.5 క్వింటాళ్లు జాతీయ విత్తన సంస్థ నుంచి సోయాబీన్‌ విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. 3164 క్వింటాళ్ల వరి విత్తనాలు, 100 క్వింటాళ్ల మినుములు, 264 క్వింటాళ్లు పెసర్లు, 50 క్వింటాళ్ల కందులు, 4664 క్వింటాళ్ల దయించ విత్తనాలు అవసరమని గుర్తించారు. వీటితో పాటు ఎకరానికి రెండు బ్యాగుల చొప్పున పత్తి విత్తనాలు అవసరం. వీటిని ప్రైవేటులో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 450 గ్రాముల బీటీ విత్తనాలకు రూ.730 ధర నిర్ణయించారు. జిల్లాకు 1.25లక్షల పత్తి గింజల ప్యాకెట్లు అవసరమని గుర్తించారు. మరోవైపు మొక్కజొన్న విత్తనాలు కూడా ప్రైవేటులో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎకరానికి నాలుగు కిలోల బస్తాలు రెండు చొప్పున అవసరమని భావిస్తున్నారు.

ఎరువులు సిద్ధం
రైతులు పండించే పంటలకు అవసరమైన ఎరువులను కూడా సిద్దం చేస్తున్నారు. ఎరువులకు సంబంధించిన ప్రణాళికను రూపొందించగా.. అవసరమైన ఎరువులను ప్రతిపాదనలు పంపగా.. ఇప్పటికే చాలా వరకు బఫర్‌ నిల్వలు ఉన్నాయి. వానాకాలం సీజన్‌లో 23,454 మెట్రిక్‌ టన్నుల యూరియా, 14,392 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 29,567 మె.ట ఎన్‌పీకే, 6481 మె.ట ఎంఓపీ, 3387 మె.ట ఎస్‌ఎస్‌పీ ఎరువులు అవసరమని గుర్తించారు. జిల్లాలో నాలుగు వ్యవసాయ డివిజన్లుండగా.. ముథోల్‌కు 1393 మెట్రిక్‌ టన్నుల యూరియా, 417మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 699 మె.ట ఎన్‌పీకే, 1039 మె.ట ఎంవోపీ, 314 మె.ట ఎస్‌ఎస్‌పీ ఎరువులు, భైంసాకు 4220 మెట్రిక్‌ టన్నుల యూరియా, 4665 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 6720 మె.ట ఎన్‌పీకే, 486.ట ఎంవోపీ, 205మె.ట ఎస్‌ఎస్‌పీ ఎరువులు, నిర్మల్‌కు 16,256 మెట్రిక్‌ టన్నుల యూరియా, 8130 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 20048 మె.ట ఎన్‌పీకే, 4296మె.ట ఎంవోపీ, 2683మె.ట ఎస్‌ఎస్‌పీ ఎరువులు, ఖానాపూర్‌కు 1585మెట్రిక్‌ టన్నుల యూరియా, 1180 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 2100 మె.ట ఎన్‌పీకే, 660 మె.ట ఎంవోపీ, 185 మె.ట ఎస్‌ఎస్‌పీ ఎరువులు అవసరమని గుర్తించారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...