శాంతి భద్రతల పరిరక్షణకే తనిఖీలు


Fri,May 17, 2019 02:47 AM

నిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ : ప్రజలకు పూర్తి రక్షణ కల్పించి జిల్లాలో మెరుగైన శాంతి భద్రతలను అందించేందుకు కార్డర్‌ సెర్చ్‌ ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామని నిర్మల్‌ జిల్లా ఎస్పీ శశిధర్‌ రాజు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ కాలనీలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ను చేపట్టారు. జిల్లా ఎస్పీ శశిధర్‌ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ సీఐ జాన్‌దివాకర్‌ పోలీసులు తనిఖీలను చేపట్టారు. ఉదయం 6గంటల నుంచే నిర్మల్‌, ఇతర చుట్టు ప్రక్కల పోలీసుల ఆధ్వర్యంలో కాలనీని దిగ్భంధనం చేసి సామూహిక తనిఖీలను చేశారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ గుర్తింపు కార్డుల సహాయంతో అక్కడి ప్రజల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ శశిధర్‌ రాజు మాట్లాడుతూ ...శాంతి భద్రతల పరిరక్షణకే తనిఖీలను చేపట్టామని అన్నారు. తనిఖీలతో నేరాలను నియంత్రిస్తామని . నేరస్థులను గుర్తించేందుకు పోలీసులు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారని, నేరం చేసిన వ్యక్తికి తప్పకుండా శిక్ష పడుతుందన్నారు. పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానికులు ముందుకు వచ్చి పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాలు ప్రజలకు మరింత భద్రత కలిగిస్తాయని తెలిపారు. కార్డన్‌ సెర్చ్‌ ద్వారా నూతన వ్యక్తులు కాలనీల్లో బస చేసి నేరాలు చేయడానికి బయపడ్తారని అన్నారు. అలాగే కాలనీల్లో కొత్తగా వచ్చే వారిపై నిఘా ఉంచాలని సూచించారు. పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాతనే ఇల్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించాలని, లేదా 8333986939 వాట్సాప్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసినా, ఫోటో వివరాలు పంపినా వెంటనే చర్యలు చేపడుతామని వెల్లడిం చారు.
వాహనాల స్వాధీనం
వంద మంది పోలీసులు రాంనగర్‌ కాలనీలోని దాదాపు 250 ఇండ్లను తనిఖీలు చేశారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 13 ఆటోలు, కార్లకు సంబంధించిన ఆర్సీ, లైసెన్సు, ఇన్సూరెన్సు పత్రాలు లేని వాహనాలను స్వాధీన పర్చుకున్నారు. కాలనీలో అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ దక్షిణ మూర్తి, డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, కానిస్టేబుల్‌లు, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...