ఆరోగ్యమస్తు


Wed,May 15, 2019 02:51 AM

నిర్మల్‌ టౌన్‌: ప్రభుత్వం దవాఖానలపై ప్రజలకు భరోసా పెరిగింది. మెరుగైన వైద్య సేవలు అందించడంతో జిల్లాలో సర్కారు దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రభుత్వ వైద్యం భరోసానిస్తోంది. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడమేకాకుండా గర్భిణులకు ఉచిత రవాణా సౌకర్యం అంబులెన్స్‌ ద్వారా అందించడం, కేసీఆర్‌ కిట్‌ అమలు చేయడంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జిల్లా కేంద్రంలోని ప్రసూతి దవాఖానతో పాటు భైంసాలోని ఏరియా దవాఖాన, ముథోల్‌లోని సామాజిక దవాఖాన, ఖానాపూర్‌లోని ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించడమేకాకుండా నెలసరి ఆరోగ్య పరీక్షలూ నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని 50 పడకల ప్రత్యేక మహిళా ప్రసూతి దవాఖాన, భైంసా, ఖానాపూర్‌లలో 30 పడకల ప్రత్యేక వార్డులను కేటాయించారు. నర్సాపూర్‌ (జి), సారంగాపూర్‌, కుభీర్‌, లోకేశ్వరం, కుంటాల తదితర పీహెచ్‌సీలో కూడా స్థానికంగానే గర్భిణులకు అన్ని రకాల వైద్య పరీక్షలు అందించడంతో ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు విశ్వాసం ఏర్పడింది. ఒక్కప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవడానికి ముందుకు రాని వారు ఇప్పుడు తొమ్మిది నెలలు ఇక్కడే పరీక్షలు నిర్వహించుకుంటున్నారు.

మెరుగైన సదుపాయాలు...
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని దవాఖానల్లో ప్రసూతి కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశారు. నిర్మల్‌ ప్రసూతి దవాఖానలో ఐదుగురు మహిళా వైద్యులను నియమించారు. ఖానాపూర్‌, ముథోల్‌తో పాటు ఆయా పీహెచ్‌సీల్లో మహిళా డాక్టర్లతో పాటు సీనియర్‌ నర్సులను కూడా నియమించడంతో ప్రసూతి సేవలు అందుబాటులో వచ్చాయి. ప్రసూతి దవాఖానలో ప్రభుత్వం ద్వారా కేసీఆర్‌ కిట్‌ అందిస్తోంది. ఆడ పిల్ల పుడితే రూ. 13వేలు, మగ పిల్లడు పుడితే రూ.12వేల కిట్‌ను అందిస్తోంది. అమ్మ ఒడి పథకం కింద 102, 108 అంబులెన్స్‌ సేవలను అందిస్తున్నారు. అంటే పాప పుట్టడానికి ముందు దవాఖానలో చేర్చేందుకు, పుట్టిన తర్వాత ఇంటికి తీసుకెళ్లేందుకు ఉచితంగా ఈ సౌకర్యం అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంత మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.

ప్రతిరోజూ 100 నుంచి 150 మంది గర్భిణులకు పరీక్షలు
జిల్లా ప్రభుత్వ దవాఖానలో ప్రతిరోజు 100 నుంచి 150 మంది గర్భిణులకు నెలనెలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. భైంసా, ఖానాపూర్‌ దవాఖానల్లో 50మందికి పైగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల సమయంలో ప్రభుత్వ దవాఖానలోనే ప్రసవం పొందాలని వైద్యులు గర్భిణులకు సూచిస్తున్నారు. ఇటీవల నిర్మల్‌ దవాఖానలో ఒకేరోజు 24 మందికి ప్రసవాలు నిర్వహించడం గమనార్హం. ఇందులో 12 సాధారణ ప్రసవాలు కాగా.. మరో 12 మందికి ఆపరేషన్‌ ద్వారా నిర్వహించారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...