పదో తరగతిఫలితాల విడుదల


Tue,May 14, 2019 05:01 AM

-ఉత్తీర్ణత పెరిగింది.. ర్యాంకు తగ్గింది
-జిల్లాలో 93.09 శాతం ఉత్తీర్ణత
నిర్మల్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికల ఉత్తీర్ణత శాతం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 142 ప్రభుత్వ పాఠశాలలు,75 ప్రవేటు పాఠశాలను కలుపుకుని మొత్తం 217 పాఠశాలలు ఉన్నాయి. వీటి నుంచి 9,684 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 9015 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 93.09 శాతం మంది పాసయ్యారు. ఇందులో బాలురు 4651 మందికి గాను 4240 మంది పాసవగా.. 91.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 5033 మందికి గాను 4775 మంది పాసయ్యారు. 94.77 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 3.71 శాతం మంది అధిక ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా 93.09 శాతం ఉత్తీర్ణ సాధించగా.. నిర్మల్ జిల్లా రాష్ట్ర స్థాయిలో 20వ స్థానంతో సరిపెట్టుకుంది.

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గతేడాదిలో పోల్చితే ఉత్తీర్ణత శాతం పెరిగినప్పటికీ ..రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థానం 20వ స్థానానికి చేరింది. గతేడాది పది ఫలితాల్లో 85.92 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో జిల్లా 18వ స్థానం సాధించింది. గతేడాది 9320 మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఇందులో 3726 మంది బాలురు 83.62 శాతంతో, 4282 మంది బాలికలు 88.03 శాతంతో మొత్తం 8008 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 85.92 శాతంతో 18వ స్థానంలో నిలిచింది.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యత ప్రతిభ కనబర్చారు. జిల్లాలో మొత్తం 82 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో 46 ప్రైవేటు పాఠశాలలు ఉండగా 36 ప్రభుత్వ పాఠశాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో సోఫీనగర్ బాలికల గురుకుల పాఠశాలలో పుట్టి ప్రణీత 10 జీ.పీ.ఏ, ముథోల్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలకు చెందిన ప్రవీణ్ కుమార్ 10జీ.పీఏ మార్కులు సాధించారు. జిల్లాలో 23 స్థానిక సంస్థల పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణతను సాధించాయి. 13 కేజీబీవీ పాఠశాల్లో 7కేజీబీవీ పాఠశాల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించారు.


జిల్లాలోని ఒక మోడల్ స్కూల్, మూడు ఆశ్రమ పాఠశాలలు, రెండు రెసిడెన్షియల్ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత వచ్చాయి. మామడ కేజీబీవీలో 32 మంది విద్యార్థులకు 32 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ముథోల్‌లో 24కు 24, దిలావర్‌పూర్ 42కు 42,కల్లూర్‌లో 30కు 30, తానూర్‌లో 35కు 35, జామ్‌లో 44కు 44, కడెంలో 29కు 29 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ఆశ్రమ హైస్కూల్‌లలో 90.10 శాతం, ఎయిడెడ్ స్కూల్‌లలో 80.70 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 77.32 శాతం, కేజీబీవీలలో 94.19 శాతం, స్థానిక సంస్థల పాఠశాలల్లో 90.38 శాతం, మోడల్ స్కూల్‌లలో 100 శాతం, రెసిడెన్షియల్ స్కూల్‌లలో 98.68 శాతం, సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లలో 98.35 శాతం, ప్రైవేటు పాఠశాలల్లో 98.60 శాతం పాసయ్యారు. ఫస్ట్ లాంగ్వేజ్‌లో 99.02 శాతం పాసవగా.. 95 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. సెకండ్ లాంగ్వేజ్‌లో 99.87 శాతం మంది పాసవగా.. 13 మంది ఫెయిల్ అయ్యారు. ఇంగ్లీష్‌లో 98.62 శాతం పాసవగా.. 134 మంది, గణితంలో 97.34 శాతం పాసవగా.. 258, సైన్స్‌లో 95.77 శాతం పాసవగా.. 410 మంది అనుత్తీర్ణులయ్యారు. సోషల్‌లో 99.31 శాతం పాసవగా.. 67 మంది ఫెయిల్ అయ్యారు.

జూన్ 10 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
పదోతరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు డీఈవో ప్రణీత తెలిపారు. ఈ నెల 14 నుంచి 27వ తేదీ వరకు పరీక్ష ఫీజును గడువు తేదీలోపు ఫీజు చెల్లించాలని, 29లోపు ప్రదానోపాధ్యాయులు ట్రెజరీలో జమజేయాలని సూచించారు. ఈ నెల 31లోపు వాటిని డీఈవో కార్యాలయంలో అందించాలన్నారు. పదో తరగతిలో తక్కువ మార్కులు,వచ్చిన విద్యార్థులకు రీవెరిఫికేషన్ సదుపాయం ఉందని తెలిపారు. ఒక్కో పేపరుకు రూ.1000 చెల్లించి ఈ నెల 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రీకౌంటింగ్‌కు ఒక్కో పేపరుకు రూ.500 బోర్డు ఆఫ్ సెకండరీ హైదరాబాద్‌లో నేరుగా చెల్లించి పరీక్షా పత్రాలను రీకౌంటింగ్ చేసుకోవచ్చన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...