ఓటరు చైతన్యం..!


Sun,May 12, 2019 02:10 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: తొలి విడతలోనే కాదు రెండో విడతలోనూ ఓటర్లు చైతన్యం ప్రదర్శించారు. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా నాలుగింటా మూడొంతులకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగం చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 70 మండలాలు ఉండగా.. ఇందులో 66 గ్రామీణ మండలా లున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1508గ్రామ పంచాయ తీలు ఉన్నాయి. వీటి పరిధిలో 66 జడ్పీటీసీ, 567ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహి స్తుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ పూర్తయింది.

తాజాగా ఈ నెల 14న మూడో విడత పోలింగ్ నిర్వహిం చనున్నారు. తొలి విడతలో భాగంగా ఈ నెల 6న ఉమ్మడి జిల్లాలో 26 జడ్పీటీసీ, 196 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ విడతలో మొత్తం 5,06,529 మంది ఓటర్లు ఉండగా.. 3,99,293 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో సగటున పోలింగ్ 78.83శాతంగా నమోదైం ది. రెండో విడత కింద 20 మండలాల్లోని 20 జడ్పీటీసీ స్థానాలకు, 181ఎంపీటీసీ స్థానాలకుగాను.. 174ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నిర్మల్ జిల్లాలో నాలుగు, మంచిర్యాల జిల్లాలో మూడు.. మొత్తం ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో 76.35 శాతం పోలింగ్ నమోదు
తొలి విడత, రెండో విడతలో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో సగటున 76.35 శాతం పోలింగ్ నమోదుకాగా.. నాలుగు జిల్లాల్లోనూ 75శాతానికిపైగా పోలింగ్ శాతం నమోదైంది. తొలి విడత కంటే స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గింది. తొలి విడతలో 78.83 శాతం నమోదు కాగా.. రెండో విడతలో 2.48 శాతం తగ్గి.. 76.35శాతంగా నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. తొలి విడత కంటే రెండో విడతలో మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో పోలింగ్ శాతం స్వల్పంగా పెరుగగా.. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో తగ్గింది. ఆదిలాబాద్‌లో తొలి విడతలో 82.13 శాతంకాగా.. రెండో విడతలో 6.80శాతం తగ్గి 75.33శాతంగా నమోదైంది. నిర్మల్ జిల్లాలో తొలి విడతలో 76.30 శాతం కాగా.. రెండో విడతలో 0.37 శాతం పెరిగి.. 76.67శాతంగా నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లాలో తొలి విడతలో 80.82 శాతంకాగా.. రెండో విడతలో 4.68 శాతం తగ్గి.. 76.14 శాతంగా ఉంది. మంచిర్యాల జిల్లాలో తొలి విడతలో 75.95 శాతంకాగా.. రెండో విడతలో 1.31శాతం పెరిగి 77.26 శాతానికి చేరింది.

మలివిడతలోనూ చైతన్యం ప్రదర్శించిన మహిళలు
రెండో విడత పోలింగ్‌లోనూ మహిళా చైతన్యం మరోసారి వెల్లివిరిసింది. ఉమ్మడి జిల్లాలో రెండో విడతలో మొత్తం 4,69,540 మంది ఓటర్లలో 2,30,330 మంది పురుష ఓటర్లు, 2,39,200 మంది మహిళా ఓటర్లు, 10మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 8870మంది అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో రెండో విడతలో మొత్తం 3,58,336 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనగా.. ఇందులో 1,74,152 మంది పురుష ఓటర్లు, 1,84,184మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళలు 10,032మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉండగా.. పోలింగ్‌లోనూ ఈ రెండు జిల్లాల్లో ఎక్కువగా మహిళలే ఓటింగ్‌లో పాల్గొనడం గమనార్హం.

ఓటర్లలో ఆదిలాబాద్ జిల్లాలో 2,212 మంది, నిర్మల్ జిల్లాలో 8,627మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. పోలింగ్ విషయానికొస్తే.. ఆదిలాబాద్ జిల్లాలో 164 మంది, నిర్మల్‌లో 10,927మంది పురుషుల కంటే మహిళలు ఎక్కువగా పోలింగ్‌లో పాల్గొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఓటర్లతో పాటు పోలింగ్‌లోనూ పురుషుల కంటే మహిళలు తక్కువగా ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో 565 మంది మహిళా ఓటర్లు పురుషుల కంటే తక్కువగా ఉండగా.. పోలింగ్‌లో 130మంది పురుషుల కంటే మహిళలు తక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 594 మంది మహిళలు పురుష ఓటర్ల కంటే తక్కువగా ఉండగా.. 929 మంది పురుషుల కంటే మహిళలు తక్కువగా పోలింగ్‌లో పాల్గొన్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళలు ఓటర్ల పరంగానే కాకుండా.. పోలింగ్‌లోనూ ఎక్కువ మంది పాల్గొనడం గమనార్హం.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...