గెలుపుపై గులాబీ ధీమా


Mon,April 22, 2019 11:22 PM

- ప్రాదేశిక ఎన్నికల్లో పట్టు సాధిస్తున్న గులాబీ పార్టీ
- పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న టీఆర్‌ఎస్
- పార్టీ అభ్యర్థులకు బీ-ఫాంల అందజేత
- సమర్థులకే టికెట్లు ఇచ్చేందుకు నిర్ణయం

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఎన్నికలు ఏవైనా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారుదే జోరు.. 2001 నుంచి ఇప్పటి వరకు సాధారణ, ఉప ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లోనూ గులాబీ గుభాళిస్తోంది.. టీఆర్‌ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. తాజాగా నిర్వహించే ప్రాదేశిక పోరులోనూ.. గులాబీ జెండాను ఎగురవేసేందుకు సిద్ధమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలుగా ఏర్పాటు చేశారు. 2014లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ప్రకారం ఎన్నికలు నిర్వహించగా.. తాజాగా రెవెన్యూ జిల్లాల ప్రకారం జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేశారు. నాలుగు జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయగా.. నాలుగింటా గులాబీ జెండా ఎగుర వేసేలా టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, టీఆర్‌ఎస్‌పై అభిమానం, సీఎం కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం, విశ్వాసం, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో పూర్తి సానుకూలత ఉండటంతో.. ప్రాదేశిక పోరులో పల్లె పల్లెన గులాబీ జెండా ఎగుర వేసేందుకు పూర్తి అవకాశాలున్నాయి.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10అసెంబ్లీ స్థానాలకుగాను.. 9చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో 10స్థానాలు టీఆర్‌ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. ఇక ఇటీవల జరిగిన సర్పంచి ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ మద్దతుదారులే మెజారిటీ మంది గెలిచారు. తటస్థులు కూడా సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. మిగతా పార్టీల నుంచి సర్పంచులు, నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా ప్రాదేశిక ఎన్నికలు జరుగుతుండగా.. ఉమ్మడి జిల్లాలోని 66జడ్పీటీసీ స్థానాలు, 567ఎంపీటీసీ స్థానాలు సునాయాసంగా గెలుచుకునే వాతావరణం నెలకొంది. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికలే మరోసారి పునరావృతం అవుతాయనే చర్చ సాగుతోంది.

కాంగ్రెస్ ఉనికి ఉన్నా.. అది ఎన్నికల్లో గెలిచేందుకు ప్రభావం చూపదనే భావన వ్యక్తమవుతోంది. బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండగా.. ఇక టీడీపీ ఉనికి లేకుండా పోయింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క చోట కూడా టీడీపీ అసలు పోటీ చేయలేదు. ఇక బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా.. రెండు చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కింది. ప్రస్తుతం జరిగే ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయనే చర్చ నడుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఈ ప్రాదేశిక ఎన్నికల్లో.. పూర్తిగా టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగుతుందనే వాదన వినిపిస్తోంది. టీఆర్‌ఎస్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి పెద్దగా పోటీ లేకపోగా.. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో పార్టీలోనే అభ్యర్థుల ఎంపికలో పోటీ తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలకు అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. ప్రజల్లో ఉన్న నాయకులు, సమర్థులకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తొలి విడత నామినేషన్లు సోమవారం నుంచి ప్రారంభం కావటంతో.. అభ్యర్థులకు బీ-ఫాంలు అందజేస్తున్నారు.
నాలుగు జిల్లా పరిషత్‌లను దక్కించుకునేందుకు పక్కా వ్యూహంతో టీఆర్‌ఎస్ పార్టీ ముందుకు వెళ్తోంది.

నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఇంచార్జిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని ఇంచార్జిగా నియమించారు. ఆదిలాబాద్ జిల్లాకు మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఇంచార్జిగా వేశారు. అభ్యర్థుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఇంచార్జిలు కూడా భాగస్వాములవుతున్నారు. సమర్ధులైన వారికే టికెట్లు ఇస్తున్నారు. తొలి విడతలో ఆదిలాబాద్ జిల్లాలో ఆరు మండలాలు, 51 ఎంపీటీసీ స్థానాలు, ఆసిఫాబాద్ జిల్లాలో 6 మండలాలు, 45 ఎంపీటీసీ స్థానాలు, మంచిర్యాల జిల్లాలో ఏడు మండలాలు, 47 ఎంపీటీసీ స్థానాలు, నిర్మల్ జిల్లాలో ఏడు మండలాలు, 51 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. బి-ఫాంలను కూడా అందజేస్తున్నారు. మూడు విడతల్లో జరిగే ఎన్నికల్లో ఎలాగైన నాలుగు జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకునేందుకు పక్కా వ్యూహంతో టీఆర్‌ఎస్ ముందుకు వెళ్తోంది.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...