నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ


Mon,April 22, 2019 02:28 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో 19 మండలాలుండగా.. 18 గ్రామీణ మండలాలున్నాయి. వీటి పరిధిలో 396 గ్రామ పంచాయతీలుండగా.. 156 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ శనివారం విడుదల చేయగా... తొలి విడత ఎన్నికలు జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సోమవారం రోజున నోటీసు జారీ చేయనున్నారు. జిల్లాలోని ఏడు మండలాలు, 51 ఎంపీటీసీ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను సోమవారం రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తుండగా.. 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న అభ్యంతరాల స్వీకరణ, 27న నామినేషన్లపై ప్రకటన, 28న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉండనుంది.

మే 6న పోలింగ్ ఉండగా.. 27న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారు. మొదటి విడతలో ఖానాపూర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు.. దస్తురాబాద్, కడెం, ఖానాపూర్, పెంబి మండలాలతో పాటు నిర్మల్ నియోజకవర్గంలోని మూడు మండలాలు.. లక్ష్మణచాంద, మామడ, దిలావర్‌పూర్ మండలాలున్నాయి. ఏడు మండలాల్లో మొత్తం 146గ్రామ పంచాయతీలు ఉండగా.. 51 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 1,33,834మంది ఓటర్లు ఉండగా.. వీరికి 294 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దస్తురాబాద్‌లో ఐదు, కడెంలో 10, ఖానాపూర్‌లో 8, లక్ష్మణచాందలో 9, మామడలో 9, పెంబిలో 4, దిలావర్‌పూర్‌లో 6చొప్పున ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఆయా మండల కేంద్రాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కోసం వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. పాత మండల కేంద్రాల్లో మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందు కోసం కొత్త, పాత మండలాలకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేశారు.

పార్టీల గుర్తులపై ఎన్నికలు
పార్టీల గుర్తులపై ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుండగా.. అభ్యర్థులు పార్టీ తరపున ఇచ్చే ఫాం-ఎ, బిలను ఇవ్వాల్సి ఉంటుంది. ఫాం-ఎ,బిలను సమర్పించకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించి గుర్తులను కేటాయిస్తారు. నామినేషన్ల పర్వం ముగిశాకే బ్యాలెట్‌లను ముద్రిస్తారు. బరిలో ఉండే అభ్యర్థుల ప్రకారం గుర్తులను కేటాయించి బ్యాలెట్‌లను ముద్రిస్తారు. జడ్పీటీసీ అభ్యర్థులకు రూ.4లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.1.50లక్షల గరిష్ట వ్యయ పరిమితిగా విధించారు. మే 27న స్థానిక సంస్థల ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు. ఇప్పటికే ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. పీవోలు, ఏపీవోలు, ఆర్వోలు, ఏఆర్వోలకు తొలి విడత శిక్షణ కూడా పూర్తి చేశారు. ప్రతి 600 మందికి ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా.. తొలి విడతలో 294 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దస్తురాబాద్‌లో 23, కడెంలో 56, ఖానాపూర్‌లో 48, లక్ష్మణచాందలో 49, మామడలో 52, పెంబిలో 30, దిలావర్‌పూర్‌లో 36 చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...