ముందే వచ్చేశాయి..


Mon,April 22, 2019 02:26 AM

నిర్మల్ అర్బన్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తున్నది. గతంలో పాఠశాలలు ప్రారంభమై తరగతులు కొనసాగుతున్నా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందకపోయేవి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పాఠశాల ప్రారంభం నాటికి పాఠ్య పుస్తకాలను సిద్ధం చేస్తున్నది. వేసవి సెలవులు ప్రారంభమైన కొద్ది రోజులకే నూతన విద్యాసంవత్సరానికి ముందుగానే జిల్లాకు మొదటి విడతగా పాఠ్య పుస్తకాలు చేరుకున్నాయి.

బడుల ప్రారంభం కంటే ముందే పాఠ్యపుస్తకాలు
ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. జూన్ ఒకటో తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు,ప్రాథమికోన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు మొత్తం కలిపి జిల్లాలో 835 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో చదువుతున్న విద్యార్థులకు 3,60,775 పుస్తకాలు అవసరం ఉన్నాయి. ఇప్పటికే 1,43,800 పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. ఇంకా 2,16,975 పుస్తకాలు రావాల్సి ఉంది. రెండో విడతలో పూర్తి స్థాయిలో జిల్లాకు త్వరలో రానున్నాయి.

విద్యార్థుల ఆన్‌లైన్ సంఖ్య ద్వారా పంపిణీ
ప్రభుత్వం ముద్రించే పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు విద్యార్థులు పాఠశాలలో చేరినవెంటనే వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.ఆన్‌లైన్‌లో నమోదు చేసిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠ్యపుస్తకాల కోసం నివేదికలు పంపించారు. నివేదికల ఆధారంగా ఏ పాఠశాలలో ఏ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో పూర్తి వివరాల ఆధారంగా పాఠ్యపుస్తకాలను అందజేయనున్నారు. నూతనంగా ఎవరైనా విద్యార్థులు పాఠశాలలో చేరితే వారి వివరాలను పంపించి పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసే సమయంలో విద్యార్థుల ఆధార్ నంబర్, వారికి పంపిణీ చేస్తున్న పాఠ్యపుస్తకాల క్రమ సంఖ్యను నమోదు చేసుకుని పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.దీంతో పుస్తకాలు పక్కదారి పట్టే అవకాశానికి అడ్డుకట్ట వేయడంతో పాటు ఏ విద్యార్థికి ఏ పుస్తకం పంపిణీ చేశారో ఆ పుస్తకంపై ఏ క్రమ సంఖ్య ఉందో సులభంగా గుర్తించవచ్చు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...