మోగిన స్థానిక నగారా


Sat,April 20, 2019 11:55 PM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి వచ్చే 27లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. తొలి దశ పోలింగ్‌కు ఈ నెల 22న, రెండో దశ పోలింగ్‌కు ఈ నెల 26న, మూడో దశ పోలింగ్‌కు ఈ నెల 30న నోటీసులు విడుదల చేయనున్నారు. ఈ నెల 22 నుంచి తొలి విడతలో ఎన్నికలు జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 6, 10, 14వ తేదీల్లో మూడు విడతల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి విడతలోనూ నామినేషన్ల దాఖలుకు మూడు రోజుల పాటు గడువు ఇచ్చారు.

మే 27 ఓట్ల లెక్కింపు..ఫలితాలు
జడ్పీటీసీ అభ్యర్థులకు రూ.4లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.1.50 లక్షల గరిష్ట వ్యయ పరిమితిగా విధించారు. మే 27న స్థానిక సంస్థల ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు.
జిల్లాలో 19 మండలాలుండగా.. వీటిలో 18గ్రామీణ మండలాలున్నాయి. వీటి పరిధిలో 396 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటి పరిధిలో 156ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం గ్రామీణ ఓటర్లు 4,08,301మంది ఉండగా.. వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 871పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోలింగ్ కేంద్రాలను 471ప్రాంతాలు/గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు.

మొదటి విడతలో..
మొదటి విడతలో ఏడు మండలాలు, రెండో విడతలో ఆరు మండలాలు, మూడో విడతలో భాగంగా అయిదు మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలి విడతలో ఏడు జడ్పీటీసీ స్థానాలు, 51ఎంపీటీసీ స్థానాలు, రెండో విడతలో ఆరు జడ్పీటీసీ స్థానాలు, 53ఎంపీటీసీ స్థానాలు, మూడో విడతలో అయిదు జడ్పీటీసీ స్థానాలు, 52 ఎంపీటీసీ స్థానాల చొప్పున ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు. పార్టీల గుర్తులపై ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుండగా.. ఇప్పటికే ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు కూడా ప్రకటించారు. పీవోలు, ఏపీవోలు, ఆర్వోలు, ఏఆర్వోలకు తొలి విడత శిక్షణ ఇచ్చారు.

మొదటి విడతలో ఖానాపూర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు.. దస్తురాబాద్, కడెం, ఖానాపూర్, పెంబి మండలాలతో పాటు నిర్మల్ నియోజకవర్గంలోని మూడు మండలాలు.. లక్ష్మణచాంద, మామడ, దిలావర్‌పూర్ మండలాలున్నాయి. ఏడు మండలాల్లో మొత్తం 146గ్రామ పంచాయతీలు ఉండగా.. 51ఎంపీటీసీ స్థానాలున్నాయి. 1,33,834 మంది ఓటర్లు ఉండగా.. వీరికి 294పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

రెండో విడతలో..
రెండో విడతలో నిర్మల్ నియోజకవర్గంలో నాలుగు మండలాలు.. సారంగాపూర్, నిర్మల్, సోన్, నర్సాపూర్(జి) మండలాలు, ముథోల్ నియోజకవర్గంలోని రెండు మండలాలు.. కుంటాల, లోకేశ్వరం మండలాలున్నాయి. ఆరు మండలాల్లో మొత్తం 119గ్రామ పంచాయతీలు ఉండగా.. 53ఎంపీటీసీ స్థానాలున్నాయి. మొత్తం 1,40,006మంది ఓటర్లు ఉండగా.. వీరికి 286పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

మూడో విడతలో..
మూడో విడతలో ముథోల్ నియోజకవర్గంలోని అయిదు మండలాలు.. బాసర్, భైంసా, కుభీర్, ముథోల్, తానూర్ మండలాలున్నాయి. 131గ్రామ పంచాయతీలు ఉండగా.. 52 ఎంపీటీసీ స్థానాలున్నాయి. మొత్తం 1,34,461మంది ఓటర్లు ఉండగా.. 291 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ నెల 11న ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు వేయగా.. ఇంకా అలాగే ఉన్నందున పరిషత్ ఎన్నికల్లో ఎడమ చేతి మధ్య వేలుపై సిరా గుర్తును వేయనున్నారు. జడ్పీటీసీ సభ్యుడి బ్యాలెట్ తెలుపు రంగు, ఎంపీటీసీ సభ్యుడి బ్యాలెట్ గులాబీ రంగులో ఉండనున్నాయి. పోలింగ్ అధికారి తొలుత ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాన్ని అందజేస్తారు పోలింగ్ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి ఓటు వేసి బయటకు వచ్చాక.. అప్పుడు జడ్పీటీసీ బ్యాలెట్ పత్రాన్ని అందజేస్తారు. రెండు పత్రాలపై ఓటు ముద్ర వేసేందుకు నిమిషం సమయం సరిపోతుందని భావిస్తుండగా.. బ్యాలెట్ పత్రాలను జారీ చేసే ముందు కౌంటర్ ఫైల్‌పై ఓటరు సంతకం/ వేలిముద్రను పోలింగ్ అధికారి తీసుకుంటారు. ప్రతి 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పాత మండల కేంద్రాల్లోనే నామపత్రాలు స్వీకరించనున్నారు. 66 గ్రామీణ మండలాలుండగా.. 52 పాత మండలాల్లోనే నామపత్రాలు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణ పూర్తయ్యాక.. తుది బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య ప్రకారమే బ్యాలెట్ పత్రాలు ముద్రిస్తారు. ఆయా జిల్లా కేంద్రాల్లోని ప్రింటింగ్ ప్రెస్‌లలో బ్యాలెట్ పత్రాల ముద్రణ చేపట్టనున్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...