ఘాటెక్కిన మిర్చి


Sat,April 20, 2019 11:55 PM

నిర్మల్ టౌన్: జిల్లాలో ఎండు మిర్చి ధర పెరిగింది. జిల్లాలో వాణిజ్య పంటగా మిర్చి సాగుచేస్తుండగా, సాగు విస్తీర్ణం ప్రతి ఏడాది తగ్గుముఖం పట్టడంతో ధరలు అమాంతగా పెరిగిపోతున్నాయి. ఇంట్లో నిత్యావసర వస్తువుల్లో మిర్చి ప్రధానమైంది. ప్రస్తుతం మార్కెట్లో మిర్చి ధర ఆకాశాన్ని అంటుతున్నది. ఇప్పటికే ఏడాదికి సరిపోయే కారం పొడిని సిద్ధం చేసుకునే వారు తప్పనిసరిగా ఎండు మిరప కొనుగోలు చేయడంతో మార్కెట్లో మిర్చికి రెక్కలు వస్తున్నాయి. ప్రజలు అమితంగా ఇష్టపడే తోట మిర్చి (పసుపులో పండించే మిర్చి) ధర కేజీకి రూ. 250 పలుకుతున్నది. ఇక సాధారణ మిర్చి రకాలైన గుంటూరు, తేజ, హైబ్రిడ్, లోకల్ మిర్చి రూ. 120 నుంచి రూ. 150 వరకు పలుకుతున్నది. జిల్లాలో మిర్చి సాగు ఏడాదికేడాది తగ్గుముఖం పట్టడంతోనే ప్రతిఏటా ధరల పెరుగుతున్నాయి. గతంలో జిల్లాలోని సారంగాపూర్, సోన్, దిలావర్‌పూర్, కుంటాల, భైంసా, తానూరు, కుభీర్ మండలాల్లో చాలా మంది రైతులు మిర్చి పంట సాగుకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు.

తగ్గుతున్న సాగు....
జిల్లావ్యాప్తంగా పదేండ్లుగా మిర్చి సాగు గణనీయంగా పడిపోతున్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. మార్కెట్లో మిర్చికి బాగా డిమాండ్ ఉన్నప్పటికీ సాగు విధానంలో అధిక పెట్టుబడులు, పంట కాలం కూడా 160 నుంచి 170 రోజుల సమయం ఉండడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. గతంలో వర్షాధారంగా రైతులు మిర్చిని సాగు చేశారు. ఇప్పుడు బోర్ల కింద మాత్రమే మిర్చిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సారంగాపూర్, భైంసా, దిలావర్‌పూర్ మండలాల్లో మాత్రమే మిర్చి పంటను సాగు చేస్తున్నారు. అది ఖర్చులకు సరిపోయేంత మాత్రమే సాగు చేస్తున్నారు. మిర్చికి మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ విత్తనం మొదలుకొని పంట చేతికొచ్చే వరకు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. విత్తనాలకే ఎకరాకి రూ. 10వేల వరకు ఖర్చు చేయగా.. కలుపు, రసాయన మందులు, కూలీలు, ఇతర ఖర్చులకు ఎకరానికి రూ. 70 వేల నుంచి రూ. 80వేల వరకు ఖర్చు చేయచాల్సి వస్తోంది.

మిర్చికి వాతావరణంలో మార్పుల కారణంగా తెగుళ్లు ఉధృతంగా ఉంటాయి. దీంతో రైతులు పంటను కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఆ తర్వాత పండించిన పంటకు మార్కెట్లోకి తీసుకెళ్లాలన్నా స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో మహారాష్ట్ర, నిజామాబాద్ మార్కెట్లపై ఆధారపడివలసి వస్తోంది. దీనికితోడు ఎకరానికి ఐదారేండ్లుగా రూ.6వేల నుంచి రూ.8వేల వరకు మాత్రమే ధర లభిస్తుంది. రైతు పెట్టుబడి పోను లాభం లేకపోవడవంతో మిర్చి సాగు చేయలేకపోతున్నారు. దీంతో మిర్చి ధర ప్రతి ఏడాది పెరుగుతూ వస్తున్నది. రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు రిటైల్ రూపంలో మాత్రం ధరలు అమాంతం పెంచి విక్రయిస్తున్నారు. మిర్చిలో చాలా మంది రైతులు పసుపు పంటలో సాగు చేస్తారు. పసుపు, మిర్చి ఏకకాలంలో పంట చేతికొచ్చే అవకాశం ఉంది. దీంతో పసుపులో సాగు చేసిన మిర్చి నాణ్యమైనదిగా కావడంతో ఈ మిర్చికి భలే డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో రైతులు కిలో రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు. సాధారణ మిర్చి రూ. 130 నుంచి రూ. 150 మాత్రమే ఉంది.

ధర్మాబాద్ మిర్చిపై మక్కువ
జిల్లాలో మిర్చి పంట ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మిర్చి కొనుగోళ్లకు మహారాష్ట్ర మార్కెట్లపై ఈ ప్రాంత ప్రజలు ఆధారపడుతున్నారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్, భోకర్ మార్కెట్లోకి వెళ్లి మిర్చిని కొనుగోలు చేసి అక్కడే పొడిని తయారు చేసుకొని వస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో సాధారణ మిర్చి రకం రూ. 120 వరకు పలుకుతుండగా.. తోట మిర్చి రూ. 200 వరకు లభిస్తుంది. నెల రోజుల నుంచి తమకు కావాల్సిన మిర్చిని కొనుగోలు చేసేందుకు ధర్మాబాద్‌కు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా అక్కడి వ్యాపారులు నిర్మల్, భైంసా, ముథోల్ పట్టణాలకు మిర్చిని తరలించి ఇక్కడ రిటైల్ రూపంలో విక్రయిస్తున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...