చెరువు మట్టి.. చేనుకు పుష్టి


Sat,April 20, 2019 11:54 PM

నిర్మల్ టౌన్: సంగి సీజన్ ముగిసింది. రైతులు సాగు చేసుకుంటున్న పంట ఇంటికి చేరుకోవడంతో ఇప్పుడు రైతులు సేద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జూన్ మాసం నుంచి వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 70శాతం రైతులు వర్షాధారంగా వ్యవసాయం చేస్తుండగా.. 30శాతం సాగు నీటి బోర్లు, వ్యవసాయ బావుల కింద సేద్యాన్ని చేస్తున్నారు. నిర్మల్, లక్ష్మణచాంద, సోన్, దిలావర్‌పూర్, కుంటాల, కుభీర్, తానూరు, ఖానాపూర్, పెంబి, సారంగాపూర్, తదితర మండలాల్లో ఎక్కువగా చలిదుబ్బ భూములతో పాటు ఎర్రనేల భూములు ఉన్నాయి. దీంతో రైతులు వేసవికాలంలో చెరువు మట్టిని చేనుకు తరలించి అధిక దిగుబడుల కోసం పాట్లు పడుతున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో మూడు నుంచి నాలుగు చెరువులు ఉన్నాయి. చెరువుల్లో వేసవికాలంలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో వర్షాకాలంలో వచ్చిన నల్లమట్టిని పొలాలకు తరలించి పంట సాగు చేసుకుంటే సూక్ష్మధాతుల లోపాన్ని అధిగమించి అధిక దిగుబడులు సాధించవచ్చని రైతుల నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం జిల్లాలో చెరువులతో పాటు జిల్లా సరిహద్దులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రతినిత్యం వేలాది సంఖ్యలో వాహనాల్లో నల్లమట్టిని పొలాలకు తరలిస్తున్నారు.

నల్లమట్టితో ఎంతో ప్రయోజనం..
జిల్లాలోని ఆయా చెరువులతో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు శివారు ప్రాంతంలో ప్రతియేటా వేలాది క్యూబిక్ మీటర్ల నల్లమట్టి వర్షాలతో నిల్వ పెరగడంతో వాటిని రైతులు పొలాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి లక్ష్మణచాంద, దిలావర్‌పూర్, మామడ, సోన్, సారంగాపూర్, కడెం, ఖానాపూర్‌తో పాటు పక్క జిల్లా అయిన నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, పెర్కిట్, ముప్కాల్, బాల్కొండ, కమ్మర్‌పల్లి, మోర్తాడ్ తదితర ప్రాంతాలకు వేలాది వాహనాల్లో ప్రతిరోజు తరలిస్తారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో భారీ పొక్లెయిన్లను ఉపయోగించి నల్లమట్టిని ప్రత్యేక భారీ టిప్పర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు రైతులు తీసుకెళ్లి పంట పొలాల్లో వేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాకు మట్టిని తరలించేందుకు ఒక్కో టిప్పర్‌కు రూ. 2,500 నుంచి రూ. మూడు వేల వరకు ఖర్చు అవుతుండగా.. నిర్మల్ జిల్లాలో మాత్రం రూ. 1500 నుంచి రూ. రెండు వేల వరకు ఖర్చువుతుంది. ఇక చెరువులో మట్టి చేనుకు తరలించాలంటే ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 300 నుంచి రూ.500 వరకు ఖర్చువుతున్నది. పంట సాగు చేయాలంటే ప్రధానంగా పత్తితో పాటు మొక్కజొన్న, పసుపు, జొన్న పంటలకు రసాయన ఎరువుల రూపంలో పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. పంట ఎదుగాలంటే ముఖ్యంగా భూమిలో నత్రజని, భాస్వరం తగిన మోతాదులో ఉండాలి. వీటి కోసం రైతులు నత్రజని, భాస్వరం ఎరువులను ఎక్కువగా వినియోగించడంతో భూసారం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో రైతులు నల్లమట్టికే ఎక్కువగా ప్రాధాన్యం చూపుతున్నారు. నల్లమట్టిలో నత్రజని, భాస్వరం ధాతువులు ఎక్కువగా ఉండడంతో పంట ఎదుగుదలకు కారణమే కాకుండా భూసారం పరిరక్షించుకునేందుకు నల్లమట్టిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఉపాధి పనులు కూడా జోరుగా సాగడంతో కూలీల సాయంతో చెరువులో నల్లమట్టిని తీస్తుండగా.. వాటిని రైతులు ప్రత్యేక ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని పొలాలకు తరలిస్తున్నారు.

బ్యాంకుల ప్రోత్సాహం..
జిల్లాలో నల్లమట్టిని పొలాలకు తరలించే రైతులకు బ్యాంకుల ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నారు. నిర్మల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, దిలావర్‌పూర్ మండలాల పరిధిలో రైతులు పెద్ద ఎత్తున శ్రీరాంసాగర్‌తో పాటు చెరువుల నుంచి నల్లమట్టిని పొలాలకు తరలిస్తుండడంతో బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తున్నారు. ఎకరానికి రూ. 25వేల చొప్పున రుణం అందించేందుకు బ్యాంకు అధికారులు ముందుకు వస్తున్నారు. ఈ తరుణంలో రైతులు చెరువుల మట్టిని పొలాలకు తరలించి రుణాన్ని మూడు విడతల్లో మూడేండ్లలో చెల్లించాలని బ్యాంకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. రెండేండ్ల నుంచి నిర్మల్, సోన్ మండలాల్లో సుమారు వంద మంది రైతులు బ్యాంకుల ద్వారా రుణాన్ని తీసుకుని నల్లమట్టిని చేనులో నింపుకొని చేనుకు పుష్టి చేసుకుంటున్నారు.

నల్లమట్టితో రైతులకు లాభం..
జిల్లాలో ఎర్రరేగడి భూములతో పాటు చలిదుబ్బ భూములు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి భూముల్లో ప్రతిఏటా వర్షాలు, వరదలతో భూమిలో ఉన్న నత్రజని, భాస్వరం సూక్ష్మధాతువులు లోపించి పంట దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు భాస్వరం, నత్రజని ఎక్కువగా లభించే నల్లమట్టిని పొలాలకు తరలించి వ్యవసాయం చేయడంతో భూసారం పెంచుకోవడమేకాకుండా అధిక దిగుబడులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతులను ప్రోత్సహిస్తున్నాం.
-కోటేశ్వర్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి

ప్రతిఏటా నల్లమట్టిని పోసుకుంటాం...
మాది నిర్మల్ మండలంలోని మేడిపెల్లి గ్రామం. నాకు పదెకరాల వరకు భూమి ఉంది. ప్రతి సంవత్సరం ఎకరం నుంచి రెండెకరాల్లో నల్లమట్టిని పోసుకుంటాం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో పాటు గ్రామ సమీపంలో ఉన్న చెరువుల్లో ఉన్న నల్లమట్టిని పొలాలకు తరలించేందుకు ప్రతిఏటా రూ.30వేల నుంచి రూ.40వేల వరకు ఖర్చు చేస్తా. దీంఓ వ్యవసాయ సీజన్‌లో పంట ఎదుగుదలకు అవసరమయ్యే నత్రజని, భాస్వరం ఎరువుల వాడకం పూర్తిగా తగ్గిపోవడమేకాకుండా భూసారం కాపాడుకుంటున్నాం.
-కుంట పద్మకర్,రైతు, మేడిపెల్లి

ఉపాధిహామీతో రైతులకు మేలు..
చెరువులో ఉన్న మట్టిని చేనుకు తరలించేందుకు ఉపాధిహామీ పథకం రైతుకు కొంత ప్రయోజనం ఇస్తుంది. ఉపాధి కూలీలు చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడంతో తీసిన నల్లమట్టిని ప్రత్యేక ట్రాక్టర్లలో పొలాలకు తరలిస్తున్నాం. ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 300 నుంచి రూ. 400 వరకు ఖర్చు కావడంతో ఎకరానికి రూ. 10వేలు లోపు నల్లమట్టిని సిద్ధం చేసుకుంటున్నాం.
-భోజన్న, ఓలా, కుంటాల మండలం

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...