ఆశల పల్లకీలో..


Fri,April 19, 2019 11:55 PM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల సందడి నెలకొంది. నేడో, రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుండడంతో మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్దమవుతోంది. దీంతో ఆశావహులు షెడ్యూల్ వచ్చే లోపు తమ టికెట్లను ఖరారు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీలో టికెట్ల వేట జోరందుకుంది. ఇప్పటికే గ్రామాల్లో పట్టు ఉన్న వారు, మండలాల్లో పేరున్న వారు, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన వారు తమ అదృష్టాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరనేది స్థానిక ఎమ్మెల్యేలు జాబితా తయారు చేసి సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదించాల్సి ఉంది. ఆయా జిల్లాల నుంచి వచ్చిన సిఫారసుల ఆధారంగా రాష్ట్ర నాయకత్వం అభ్యర్థులను ఎంపిక చేయనుంది. దీంతో రెండు, మూడు రోజులుగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించడంతో.. అభ్యర్థులు ఎవరుంటే బాగుంటుందనే విషయంపై కసరత్తు జోరందుకుంది.

అభ్యర్థుల ఎంపికపై మంత్రి దృష్టి
రెండు రోజులుగా మంత్రి అల్లోలతో పాటు ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల అభ్యర్థులపై దృష్టి పెట్టారు. మండలాల వారీగా ముఖ్య నాయకులతో స్థానిక ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 567ఎంపీటీసీ, 66 జడ్పీటీసీ స్థానాలు, 66 ఎంపీపీ పదవులున్నాయి. నిర్మల్ జిల్లాలో 18 జడ్పీటీసీ, 18 ఎంపీపీ పదవులతో పాటు 156 ఎంపీటీసీ స్థానాలున్నాయి. మంచిర్యాల జిల్లాలో 16 జడ్పీటీసీ, 16 ఎంపీపీ పదవులతో పాటు 130 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 17ఎంపీపీ, 17జడ్పీటీసీ స్థానాలు, 158ఎంపీటీసీ స్థానాలున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 123 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ, 15 ఎంపీపీ పదవులున్నాయి. అధికార పార్టీలో వీటికి పెద్ద సంఖ్యలో ఆశావహులు ఉన్నారు. దీంతో అభ్యర్థుల ఖరారును అధినేత కేసీఆర్, రాష్ట్ర నాయకత్వానికే వదిలేశారు. అభ్యర్థులు ఎవరనే విషయంలో జిల్లా నుంచి ఎమ్మెల్యేలు సిఫారసు చేయనున్నారు. జిల్లా నుంచి వచ్చిన జాబితా ప్రకారం రాష్ట్ర నాయకత్వం అభ్యర్థులను ప్రకటించనుంది.రెండు, మూడు రోజుల్లో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి.. సీఎం కేసీఆర్‌కు పంపాలని ఎమ్మెల్యేలు కసరత్తులో వేగం పెంచారు. ఇప్పటికే ఆయా మండలాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులతో పాటు ఎంపీపీలుగా ఎవరుంటే బాగుంటుందనేది అందరి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఒకే పేరు ఉన్న చోట ఇబ్బంది లేకపోగా.. రెండు, మూడు పేర్లు ఉన్న చోట గ్రామ, మండల నాయకులందరి అభిప్రాయాలను సేకరించి జాబితా రూపొందిస్తున్నారు. ఏకాభిప్రాయం వచ్చిన చోట ఒకే పేరు సిఫారసు చేస్తుండగా.. ఏకాభిప్రాయం రాని చోట రెండు, మూడు పేర్లు పంపే అవకాశాలున్నాయి. అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేసినా.. అంతా కలిసి కట్టుగా పని చేయాలని ఎమ్మెల్యేలు అందరినీ సమన్వయం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాలు, మండలాలపై స్పష్టత రాగా.. కొన్ని గ్రామాలు, మండలాలపై కసరత్తు నడుస్తున్నది. సోమవారం నాటికి జాబితాలు సిద్ధం చేసి.. రాష్ట్ర నాయకత్వానికి పంపే అవకాశాలున్నాయి.

గ్రామాల్లో విందు రాజకీయాలు
మరోవైపు గ్రామాల్లో మందు, విందు రాజకీయాలు జోరందుకున్నాయి. తమకు టికెట్ వచ్చేందుకు మద్దతు ఇచ్చే వారందరిని గ్రూపుగా తయారు చేసుకుని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జుల వద్దకు వెళ్తున్నారు. ఇప్పటికే ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రామాల్లో ముఖ్య నాయకులు, కార్యకర్తలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. నిత్యం పల్లెల్లో విందులు సాగుతున్నాయి.

విపక్ష పార్టీల్లో అభ్యర్థులు కరువు
విపక్ష పార్టీల్లోనూ అభ్యర్థులు ఎవరనే దానిపై కసరత్తు చేపట్టినా.. చాలా చోట్ల ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితులు లేవు. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో.. అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు విపక్షాల్లో అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవంతో పోటీ చేయడం కంటే.. ఊరుకుండి పోవటమే మేలనే భావనతో చాలా మంది విపక్ష నాయకులున్నారు. దీంతో ఆర్థికంగా బలంగా ఉన్న వారిని ఎంచుకునే పనిలో పడ్డారు. దీంతో ప్రజల్లో పట్టు, పేరు ఉన్నా.. లేకపోయినా డబ్బులు పెట్టే వారుంటే చాలనే భావనతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...