ఎన్నికల తర్వాత కొత్త జడ్పీలు


Fri,April 19, 2019 11:54 PM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : కొత్తజిల్లాల ఆవిర్భావంతో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు తప్పనిసరిగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలుగా విభజించారు. నాలుగు జిల్లాల్లోనూ ప్రతి జిల్లాకు జిల్లా పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. జిల్లాల విభజనలో భాగంగా అన్ని శాఖలను జిల్లాల వారీగా విభజించి అధికారులు, సిబ్బందిని కేటాయించినా పాలకవర్గం ఉండడంతో జిల్లా పరిషత్‌ను విభజించలేదు. ఏప్రిల్, మే నెలల్లో మూడు విడతలుగా పరిషత్ ఎన్నికలు జరుగుతుండడంతో జడ్పీల ఏర్పాటుపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్‌లను ప్రకటించగా ఆదిలాబాద్ ఎస్టీ జనరల్, కుమ్రుంభీం ఆసిఫాబాద్ ఎస్టీ మహిళా, నిర్మల్ జనరల్ మహిళా, మంచిర్యాల ఎస్సీ మహిళకు కేటాయించారు. ప్రస్తుతం జడ్పీ సీఈవో ఎన్నికల నిర్వహణ పర్యవేక్షిస్తుండగా కొత్త జిల్లాలు ఎన్నికల ఏర్పాట్ల కోసం లైజన్ అధికారులను నియమించారు. జిల్లా ఎన్నికల అధికారులుగా నాలుగు జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్‌లు వ్యవహరిస్తారు.

జడ్పీలో 60 మంది సిబ్బంది
జిల్లా పరిషత్ ఆధీనంలో మండల పరిషత్ కార్యాలయాలతో పాటు, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల సౌకర్యాల కల్పన, బోధనేతర సిబ్బంది ఉండగా వీరిని పంచాయతీ రాజ్ ఉద్యోగులుగా పరిగణిస్తారు. గ్రామీణ నీటి పారుదల, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగాల్లోనూ పనిచేసే సిబ్బంది ఉంటారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో విద్యావిభాగం, జీపీఎఫ్, అకౌంట్స్, బీఆర్‌జీఎఫ్, ప్లానింగ్ ఐదు డిపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. ఈ కార్యాలయాల్లో ఐదుగురు సూపరింటెండెంట్‌లు, 14 మంది సీనియర్ అసిస్టెంట్‌లు,14 మంది జూనియర్ అసిస్టెంట్‌లు, టైపిస్ట్‌లు, అంటెండర్‌లు, ఇతర సిబ్బంది కలిపి 60 మంది ఉన్నారు. వీరితో పాటు 44 మంది ఎంపీడీవోలు, 120 మంది సీనియర్ అసిస్టెంట్‌లు, 115 మంది జూనియర్ అసిస్టెంట్‌లు, 3440 జడ్పీ, మండల పరిషత్ పాఠశాలలు, 7 వేల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్ ఖాతాలు, 340 మంది నాలుగో తరగతి ఉద్యోగులు జడ్పీ పరిధిలో పనిచేస్తారు.

జడ్పీ విభజనలో భాగంగా ఉద్యోగులు, ఆస్తులు, ఫర్నిచర్, ఇతర వివరాలను పంపాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికలు ఉండడంతో అధికారులు ఎన్నికల నిర్వహణలో బీజీగా ఉన్నారు. మూడు విడతలుగా ఎన్నికలు ముగిసిన వెంటనే వివరాలు తయారు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. పరిషత్ ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త జిల్లా పరిషత్‌లు, కొత్త మండల పరిషత్‌ల ఏర్పాటు జరుగుతుందని అధికారులు తెలిపారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...