పాసు పుస్తకాలు.. మహాప్రభో..!


Fri,April 19, 2019 01:48 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో 19 మండలాలుండగా.. 427 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 2017 సెప్టెంబర్ 15నుంచి డిసెంబర్ 31వరకు భూముల సమగ్ర సర్వే, భూరికార్డుల ప్రక్షాళన చేపట్టారు. జిల్లాలో మొత్తం 4,71,419 సర్వే నంబర్లు, 2,04,393 ఖాతాల పరిధిలోని 7,27,700ఎకరాల భూములున్నాయి. మొత్తం 4,71,300 సర్వే నంబర్లలో 7,27,502ఎకరాలు సర్వే చేశారు. 4,53,398 సర్వే నెంబర్లు, 1,95,177ఖాతాలకు సంబంధించిన 6,98,634 ఎకరాల భూములపై స్పష్టత వచ్చింది. ఇందులో వ్యవసాయ భూములు 3,53,914సర్వే నంబర్లు, 1,59,184ఖాతాలున్నాయి. మొత్తం 4,18,185 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఈ భూములకు ఎకరానికి రూ.8వేల (రెండు సీజన్లకు) చొప్పున ఏటా రూ.350.22కోట్లు రెండు విడతల్లో సాయం అందించారు. తొలి విడతలో భాగంగా రైతులకు చెక్కులు అందించగా.. రెండో విడతకు ఎన్నికల కోడ్ ఉండడంతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. జిల్లాలో చాలా మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడంతో రెండు విడతల్లో డబ్బులు అందకుండాపోయాయి.

పట్టాదారుడికి భూమి లేదు.. భూమి ఉండి దున్నే రైతుకు పట్టా లేదు.. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందవు.. క్షేత్ర స్థాయిలో భూములు చూపరు.. రైతుబంధు, రైతుబీమా పథకాలకు నోచుకోని రైతులు.. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంతో.. రైతులకు తంటాలు తప్పడం లేదు.. ఇదీ లోకేశ్వరం మండలం మల్కాపూర్ శివారులో అసైన్‌మెంట్ లబ్ధిదారుల పరిస్థితి.. సర్వే నంబరు 1నుంచి 333 వరకు 2081ఎకరాల భూమి ఉంది. ఈ శివారులో మొత్తం 807 మంది రైతులున్నారు. ఇందులో 574మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఇందులోనూ 24మంది పాసు పుస్తకాల్లో పేర్లు, సర్వే నంబర్లు తప్పులు రావడంతో తిరిగి తీసుకున్నారు. 233మందికి ఇప్పటి వరకు పట్టాదారు పాసు పుస్తకాలు రాలేదు. సర్వే నంబరు 120లో సర్వే నంబరులో 88ఎకరాలు, సర్వే నంబరు 148లో 1051ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. గత ప్రభుత్వాలు పేద రైతులకు ఈ భూములను పంపిణీ చేశాయి.. కొంతమంది పట్టాదారులకు భూమి ఎక్కడుందో.. తెలియదు. కొంతమంది భూమి దున్నుకుంటున్నా.. పట్టాలు, పట్టాదారు పాసు పుస్తకాలు లేవు. సర్వే నెంబరు 148లో 509 మంది పట్టాదారులుండగా.. వీరిలో సగం మందికి పట్టాదారు పాసు పుస్తకాలు అందలేదు. దీంతో రైతులు, లబ్ధిదారులు రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తించడం లేదు. అసైన్డ్ భూములను తర్వాత సర్వే చేయాలని అధికారులు పట్టించుకోకపోగా.. నిరుపేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో పట్టాదారు పాసు పుస్తకాల కోసం రైతులు, లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు..
- ఇది మచ్చుకు ఉదాహరణ మాత్రమే..

24,920 పాసుపుస్తకాల్లో తప్పులు!
జిల్లాలో మొత్తం 1.65లక్షలకు పైగా కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అవసరంకాగా.. గతేడాది మే నెలలో జిల్లాకు 1,40,653 కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు తొలి విడతలో వచ్చాయి. ఇందులో 24,920 పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు ఉన్నట్లు గుర్తించారు. కొన్నిచోట్ల ఒకరి భూమి బదులు మరొకరి పేరు మీద భూమి అదనంగా చేరడం, తగ్గడం వంటివి జరిగాయి. మరికొన్ని చోట్ల ప్రభుత్వ భూములు, ఇతర సమస్యలు, భూవిస్తీర్ణంలో హెచ్చుతగ్గులు వచ్చాయి. దీంతో 1,15,733 కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను తొలి విడతలో భాగంగా రైతుబంధు చెక్కులతో పాటు పంపిణీ చేశారు. 24,920 పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులను సరి చేసి రైతులకు పంపిణీ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 1,50,791 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. మరో 14,469 మందికి అందించాల్సి ఉంది. జిల్లాలో సమగ్ర సర్వే నిర్వహించి ఏడాదిన్నర పూర్తవుతున్నా ఇప్పటివరకు పదిశాతం మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందలేదు.

పెండింగ్‌లో డిజిటల్ సంతకం
జిల్లాలో 14,469 మందికి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందాల్సి ఉంది. ఇందులో 463 మందికి సంబంధించి తప్పులను సరి చే యాల్సి ఉంది. మరో 2183 మంది రైతుల పట్టాదారు పాసుపుస్తకాల్లో డిజిటల్ సంతకం పెండింగ్‌లో ఉంది. 2953 మంది రైతులకు సంబంధించి ఇప్పటివరకు పరిగణలోకి తీసుకోలేరు. మరో 220 పాసుపుస్తకాలు తప్పులు సరిచేసి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఆధార్‌సీడింగ్ కాకపోవడమే సమస్యగా మారాయి. భూముల సమగ్ర సర్వే సమయంలో చాలా మంది రైతులు తమ ఆధా ర్ నంబర్లను ఫీడింగ్ చేసుకోలేదు. 24వేల మం ది ఆధార్ సీడింగ్ చేసుకోపోగా.. ప్రస్తుతానికి సీడింగ్ కాని రైతులు 8681మంది ఉన్నారు. గ్రామాల్లో వీఆర్వోలు చేసిన సర్వేకు, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే వివరాలకు పొంతన ఉండడం లేదు. దీంతో చాలా చోట్ల ఎక్కువ, తక్కువ విస్తీర్ణం, తప్పులు దొర్లాయి. వీటిని సరి చేయడంపై క్షేత్రస్థాయిలో వీఆర్వోలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పాసుపుస్తకాలకు సంబంధించి తప్పులను సరి చేసేందుకు ఇటీవల అన్‌సైన్ ఆప్షన్ ఇచ్చారు. వరుస ఎన్నికలు ఉండడంతో రెవెన్యూ అధికారులు దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయారు. తాజాగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై జిల్లాఅధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జేసీ భాస్కర్‌రావు వచ్చాక.. పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులను సరి చేయడంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమీక్షిస్తున్నారు. జేసీ రైతులతోనే నేరుగా మాట్లాడుతూ.. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందేలా చూస్తున్నారు. ఇప్పటికే లోకేశ్వరం మండలంలో పెద్ద మొత్తంలో సమస్యలు ఉండగా.. పలుమార్లు ఆయన క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారు. మల్కాపూర్ శివారులోని భూములకు సంబంధించి కూడా పలుమార్లు ఆయన సందర్శించి.. సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు. ఇప్పటికే పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో వేగం పెంచారు.

ఆన్‌లైన్‌లో భూములు లేకపోవడం మాకు శాపం
మా పూర్వీకుల నుంచి మాకు వచ్చిన భూములను మేం గత 30 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్నాం. భూముల సమగ్ర సర్వేలో మా పేరిట ఉన్న భూములు ఆన్‌లైన్‌లో పొందుపర్చలేదు. దీంతో మాకు పట్టాదారు పుస్తకాలు తొందరగా రాలేదు. ఇటీవల ఇచ్చినా.. మొదటి విడత రైతుబంధు డబ్బులను కోల్పోయాం. ఇటీవల రెండో విడత డబ్బులు మాత్రమే ఖాతాల్లో జమ చేశారు.
- కదం దిలీప్, హథ్‌గాం

సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం..
మల్కాపూర్ శివారులోని భూముల సమస్యలను దాదాపు 80 శాతం పరిష్కరించాం. కొన్ని సర్వే నంబర్లలో పొరపాట్లు జరిగాయి. క్షుణ్ణంగా పరిశీలించాకే.. డిజిటల్ సంతకం చేసి పాసు పుస్తకాలు అందిస్తున్నాం. సర్వే నంబరు 148లో 509మంది రైతులకుగాను కొంతమంది వద్ద పట్టాదారు పుస్తకాలు ఉన్నప్పటికీ.. వారి భూమి ఎక్కడుందో.. తెలియడం లేదు. మరికొందరు భూమి సాగు చేస్తున్నప్పటికీ.. పట్టాలు లేవు. ఈ సర్వే నంబర్లు గల భూమిని రీసర్వే చేయించిన తర్వాతే.. పట్టాదారు పుస్తకాలు అందజేస్తాం. గతంలోని అధికారుల పొరపాట్ల వల్ల పాసుపుస్తకాలు సకాలంలో అందించలేదు. ఇప్పటికే తొలి విడతలో 363మందికి.. ఇటీవల కాలంలో మరికొందరికి అందించాం. మల్కాపూర్ భూముల విషయాన్ని ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం.
- శ్రీదేవి, తహసీల్దార్ లోకేశ్వరం

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...