ఆబ్కారీకి కాసుల వర్షం


Fri,April 19, 2019 01:47 AM

నిర్మల్ అర్బన్ నమస్తే తెలంగాణ: ఆబ్కారీ శాఖకు కాసుల పంట పండింది. మద్యం విక్రయాలతో భారీగా ఆదాయం సమకూరింది. వరుస ఎన్నికలతో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. సగటున రోజుకు రూ. 84 లక్షల 29వేల ఆదాయం వైన్సులు, బార్ అండ్ రెస్టారెంట్ ద్వారా సమకూరుతున్నది. జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఐదు బార్ అండ్ రెస్టారెంట్‌లు ఉన్నాయి. ఇందులో నాలుగు బార్‌లు జిల్లా కేంద్రం లో ఉండగా ఒకటి భైంసాలో ఉంది. జిల్లాలో మొత్తం 37 వైన్స్‌లు ఉన్నాయి.

ఏడాదిలోరూ.307 కోట్ల ఆదాయం
2018 ఆర్థిక సంవత్సరం మార్చి నెల ముగింపుతో జిల్లా ఆబ్కారీ శాఖకు భారీగానే ఆదాయం సమకూరింది. ఆర్డినరీ మద్యం 34,553, మీడియం 2,38,224, ప్రీమియం 2,48,847, ఐఎంఎల్ కేసులు 5,21,624, బీర్లు 7,50,159 కేసుల విక్రయాలు జరిగాయి. దీంతో ఏడాదిలో 307కోట్ల 65లక్షల82 వేల 488 రూపాయల ఆదాయం వచ్చింది. జిల్లాలో సగటున రోజుకు రూ.84 లక్షల మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో అత్యధికంగా మామడ మండలంలోని ఓ వైన్స్‌లో 11,0 41 కేసుల ఐఎంఎల్, 12,647 కేసుల బీర్ల విక్రయాలు జరుగగా, రూ.11కోట్ల 56 లక్షల 39వేల 347 రూపాయల ఆదాయం సమకూరింది. అత్యల్పంగా భైంసాలోని శరత్ వైన్స్‌లో ఐఎంఎల్ 8218 కేసులు, బీర్లు 13,639 కేసుల మద్యం అమ్మకాలతో రూ.5కోట్ల 16 లక్షల 26వేల 344ఆదాయం సమకూరింది. అత్యధికంగా నిర్మల్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఐఎంఎల్ 3235 కేసుల మద్యం, బీర్లు 15,443 కేసుల విక్రయాలు జరుగగా ఆదాయం రూ.3కోట్ల 79 లక్షల 43 వేల 864 ఆదాయం సమకూరింది. అత్యల్పంగా భైంసాలోని ఓ రెస్టారెంట్‌లో ఐఎంఎల్ 2,595 కేసుల మద్యం, బీర్లు 10,393 కేసుల మద్యం విక్రయం కాగా వీటి ద్వారా 2కోట్ల 87 లక్షల6,432 రూపాయల ఆదా యం సమకూరింది.

వరుస ఎన్నికలతో పెరిగిన మద్యం అమ్మకాలు
జిల్లాలో వరుస ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. అసెంబ్లీ, గ్రామ పంచాయితీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకే ఆర్థిక సంవత్సరంలో రావడంతో మద్యం ఏరులైపారింది.

ఈ ఏడాదిలోనూ ఎన్నికల సందడి...
ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఆబ్కారీ శాఖకు బారీగా ఆదాయం సమకూరనుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, సహకార సంఘాల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా మందుబాబులకు పండుగే. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఈ నూతన ఆర్థిక సంవత్సరంలో సైతం ఆబ్కారీ శాఖకు బారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఏది ఏమైనా వరుస ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఆబ్కారీ శాఖకు భారీగానే ఆదాయం సమకూరుతున్నది.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...