బీటీ-3 మాయాజాలం


Fri,April 19, 2019 01:46 AM

ఆదిలాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : వానాకాలం సీజన్ సమీపిస్తుండడంతో నకిలీ బీటీ పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టేందుకు సిద్ధమవుతున్నారు కొందరు మోసగాళ్లు. జిల్లావ్యాప్తంగా రైతులు వివిధ కంపెనీలకు చెందిన బీటీ-2 రకం పత్తి విత్తనాలను విక్రయిస్తుండగా కొందరు దళారులను రైతులను మభ్యపెడుతూ బీటీ-3 పేరిట నకిలీ విత్తనాలను విక్రయించేందుకు ప్రణాళికలు తయారు చేశారు. బీటీ-3 పత్తి విత్తనాలు దిగుబడి ఎక్కువ ఉండడంతో పాటు గోకోసిడీయో గడ్డిమందును సైతం తట్టుకుంటుందని ప్రచారం చేస్తూ తక్కువ ధరకు అమ్మకాలు జరుపేందుకు పన్నాగాలు చేస్తున్నారు.

జిల్లాలో ఎక్కువ మంది రైతులు పత్తి పంటను సాగుచేస్తారు. ఏటా వానాకాలంలో ఈ పంటను 1.40 హెక్టార్ల వరకు సాగువుతుంది. జూన్‌లో వేసిన పంట దిగుబడులు అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయి. నీటి సౌకర్యం ఉన్న రైతులు పిబ్రవరి వరకు పంటను పొడిగిస్తారు. రైతులు వివిధ కంపెనీలకు చెందిన బీటీ-2 పత్తి విత్తనాలను వినియోగిస్తారు. రైతుల అవకాశాలను ఆసరాగా చేసుకున్న కొందరు దళారులు వారికి నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. బీటీ-3 పత్తి విత్తనాలు విక్రయాలపై నిషేధం ఉన్నా కొందరు దళారులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ విత్తనాల పేరిట నకిలీ విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారు. బీటీ-3 విత్తనాల వినియోగంతో ప్రమాదకరమైన గడ్డిమందులు పత్తి పంటపై వేసినా ఎలాంటి ప్రమాదం ఉండదనే నమ్మకంతో రైతులు ఈ విత్తనాలను వైపు మొగ్గుచూపుతున్నారు. పంటలో కలుపు ఖర్చుల తగ్గడంతో పాటు తక్కువ ధరకు ఈ మందు లభ్యమవుతుండటంతో కొందరు దళారులు రైతులను మభ్యపెట్టి బీటీ-3 విత్తనాలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ర్టల నుంచి పత్తి విత్తనాలను తీసుకువచ్చి కలర్ గౌచో ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. ఈ విత్తనాలు బీటీ విత్తనాల మాదిరిగా కనపడడమే కాకుండా 45 రోజుల పాటు పత్తి మొక్కలు ఏపుగా పెరిగేలా ట్రీట్‌మెంట్‌లో భాగంగా మందులు వినియోగిస్తున్నారు.

ఇటీవల ఇచ్చోడకు చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో తరలిస్తున్న 5 వేల పత్తి ప్యాకెట్‌ల కవర్‌లు, సీడ్ ట్రీట్‌మెంట్ కెమికల్ క్యాన్‌ను నేరడిగొండ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చోడ కేంద్రంగా నకిలీ బీటీ విత్తనాలను తయారు చేస్తున్నట్లు తెలుస్తున్నది. దళారులు ఈ విత్తనాలను గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తారు. గ్రామాల్లో కొందరు స్థానికుల సహకారం తీసుకుని వారికి కమీషన్‌లు ముట్టచెప్పి రైతులకు నకిలీ విత్తనాలను అంటగతారు. జిల్లాలో రైతులు వినియోగించే బీటీ-2 రకం పత్తి విత్తనాల ప్యాకెట్ ధర రూ.730 ఉండగా దళారులు నకిలీ విత్తనాలను రూ.600 ప్యాకెట్ చొప్పున విక్రయిస్తారు. దళారుల మాటలు నమ్మిన రైతులు నకిలీ విత్తనాలను వినియోగించి నష్టపోవాల్సి వస్తుంది. వ్యవసాయశాఖ అధికారులు గత ఏడాది నకిలీ బీటీ విత్తనాల విక్రయాలు, ప్రమాదకరమైన గడ్డి మందు విక్రయాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక బృందాలచే జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించి పలు చోట్ల నిల్వ ఉంచిన గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు, పర్యావరణానికి హాని చేసే గడ్డి మందు విక్రయాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు అంటున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...