టార్గెట్ జడ్పీ


Wed,April 17, 2019 11:48 PM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఎన్నిక ఏదైనా విజయాలతో దూసుకెళ్తున్న టీఆర్‌ఎస్ స్థానిక ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించేందుకు అడుగులు వేస్తోంది. క్లీన్‌స్వీప్ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 18జడ్పీటీసీ స్థానాలు, మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు అవసరమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నది. జిల్లా చరిత్రలో నిలిచే తొలి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఇప్పటికే మంత్రి, ఎమ్మెల్యేలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. ప్రజల్లో మంచి పేరు, పట్టు ఉన్న అభ్యర్థుల వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు!

2001 పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి పట్టు ఉన్న టీఆర్‌ఎస్ నాటి నుంచి ప్రతి ఎన్నికలో దూసుకెళ్తున్నది. 2001 నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ తన సత్తా చాటుకుంటోంది. 2014లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది. ఇద్దరు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు మెజార్టీ ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు గెలిచారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని కూడా దక్కించుకుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 9స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే సైతం టీఆర్‌ఎస్‌కే మద్దతు ప్రకటించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ మెజార్టీ సర్పంచ్ పదవులను దక్కించుకోగా, ఏప్రిల్ 11న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్‌ఎస్ వైపు నిలబడినట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

తాజాగా నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే హవాను కొనసాగించడంపై టీఆర్‌ఎస్ నాయకులు దృష్టి సారించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జిల్లాకు ఇన్‌చార్జి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని నియమించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఐకే రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. వరుసగా రెండో సారి సీఎం కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతుండగా.. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు ఆయనకే అప్పగించారు. జిల్లాతో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ఇన్‌చార్జి బాధ్యతలు సైతం ఆయనకే అప్పగించారు. నిర్మల్ జిల్లా పరిధిలో నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాలుండగా, పునర్విభజన తర్వాత ఏర్పడిన కొత్త జిల్లాలో తొలి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని దక్కించుకునేందుకు అవసరమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో అందరి దృష్టి ఆ సీటుపై పడింది. జిల్లాలో 19మండలాలు ఉండగా, 18 గ్రామీణ మండలాలు ఉన్నాయి. 18 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, 9మంది జడ్పీటీసీ సభ్యుల మద్దతు ఉంటే జడ్పీ పీఠం దక్కించుకోవచ్చు. దీంతో జిల్లాలో 18జడ్పీటీసీ స్థానాలను దక్కించుకుని, క్లీన్‌స్వీప్ చేయాలని లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో 4 మండలాలు, నిర్మల్ నియోజకవర్గంలో 7 మండలాలు, ముధోల్ నియోజకవర్గంలో 7 మండలాలున్నాయి. జిల్లాలో మొత్తం 156 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వీటికి మూడు విడతల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో 7 జడ్పీటీసీ స్థానాలు, 51 ఎంపీటీసీ స్థానాలు, రెండో విడతలో 6 జడ్పీటీసీ స్థానాలు, 53 ఎంపీటీసీ స్థానాలు, మూడో విడతలో 5 జడ్పీటీసీ స్థానాలు, 52 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే ఎమ్మెల్యేలు స్థానిక అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. తమ మండలంలో మంచి పేరు, పట్టు ఉన్న వారిని జడ్పీటీసీ సభ్యులుగా, తమ సొంత గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో మంచి పేరు ఉన్న వారిని ఎంపీటీసీ సభ్యులుగా బరిలోకి దించేందుకు ఎమ్మెల్యేలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంపీటీసీ సభ్యుల్లో మంచి పేరు, పరిచయాలు, అందరిని కలుపుకుని పోయే వారిని ఎంపీపీలుగా చేయాలని.. మండలంలో పూర్తి స్థాయిలో పట్టు ఉన్న వారిని జడ్పీటీసీ సభ్యులుగా బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఎంపీటీసీ స్థానాలు, జడ్పీటీసీ స్థానాల వారీగా అభ్యర్థుల వివరాల సేకరణలో స్థానిక ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావటంతో.. ఆశావహులు టికెట్ల కోసం ఎమ్మెల్యేలు, మండల స్థాయి ముఖ్య నాయకుల చుట్టూ తిరుగుతున్నారు.

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...