విపక్ష పార్టీల్లో స్థానిక ఎన్నికల గుబులు


Wed,April 17, 2019 01:45 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 567ఎంపీటీసీ, 66జడ్పీటీసీ స్థానాలు, 66 ఎంపీపీ పదవులు, నాలుగు జిల్లా పరిషత్ చైర్మన్ పదవులున్నాయి. గతంలో 636ఎంపీటీసీ, 52జడ్పీటీసీ స్థానాలు, 52 ఎంపీపీ పదవులు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత పూర్వ ఆదిలాబాద్ జిల్లా.. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలుగా ఆవిర్భవించాయి. దీంతో నాలుగు రెవెన్యూ జిల్లాల ప్రకారం నాలుగు జిల్లా పరిషత్తులు ఉండేలా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు 52 మండలాలు ఉండగా.. కొత్తగా 18 మండలాలు ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు అర్బన్ మండలాలు ఉండగా.. 66గ్రామీణ మండలాలు ఉన్నాయి. పాత వాటికి మండల పరిషత్ పాలక వర్గాలు ఉండగా.. కొత్తగా ఏర్పడిన 14గ్రామీణ మండలాలకు కూడా రెవెన్యూ మండలాల ప్రకారం ఇటీవల మండల పరిషత్‌లు ఉండేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అధికార పార్టీలోనే పోటాపోటీ
ముఖ్యంగా అధికార పార్టీలోనే పోటాపోటీ నెలకొంది. ఇటీవల అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగడం.. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండడం.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో పూర్తి సానుకూలత ఉండడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అధికార పార్టీ నుంచి టికెట్ దక్కించుకుంటే.. తమ గెలుపు సగం ఖాయమైనట్లేనని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జిగా అల్లోల ఇంద్రకర్‌రెడ్డికి నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలు, జోగు రామన్నకు ఆదిలాబాద్ జిల్లా అప్పగించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీంతో ఆశావహులు అధికార పార్టీలో ఎక్కువగా ఉన్నారు. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని భావించి.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.

విపక్ష పార్టీల్లో నిరాసక్తత
మరోవైపు కాంగ్రెస్, బీజేపీలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవం చెందడం.. ప్రజల్లో ఆశించిన మేర అనుకూల స్పందన లేకపోవడంతో వెనకడుగు వేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆర్థికంగా భారం కావడంతో నిరాసక్తత కనిపిస్తోంది. నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ నుంచి ఆర్థికంగా ఏమైనా వస్తే.. ఇస్తే.. మాత్రమే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు పోటీ తీవ్రం
జిల్లా పరిషత్‌లకు జూలై 5, మండల పరిషత్‌లకు జూలై 4లోగా కొత్త పాలక వర్గాలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గడువులోపే ఎన్నికలు పూర్తి చేసి.. కొత్త పాలక వర్గాలు కొలువు దీరేలా అటు ఈసీ, ఇటు ప్రభుత్వం దృష్టి సారించింది. చిన్న జిల్లాలు కావడం.. కొత్త మండలాలు ఏర్పాటు కావడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు పోటీ తీవ్రంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 17, నిర్మల్ జిల్లాలో 18, మంచిర్యాల జిల్లాలో 16, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నిక కావాలంటే.. 8 నుంచి 9మంది జడ్పీటీసీ సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుంది. గతంలో జడ్పీ చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే సగం మంది సభ్యులు.. 26-27మంది జడ్పీటీసీ సభ్యుల మద్దతు అవసరం ఉండేది. తాజాగా ఇందులో మూడొంతుల మంది సభ్యుల మద్దతుంటే సరిపోవడంతో.. అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది.

అదీగాక కొత్త మండలాలు ఏర్పాటు చేయగా.. మండలాల విస్తీర్ణం కూడా తగ్గింది. దీంతో గ్రామాల సంఖ్య తగ్గడంతో.. జడ్పీటీసీ సభ్యుడిగా గెలవడం కూడా సులభంగా మారింది. ఎంపీపీ పదవులకు సంబంధించి.. గతంలో ఎక్కువ మంది ఎంపీటీసీ సభ్యుల మద్దతు కూడగట్టాల్సి వచ్చేది. 3500-4000జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేయగా.. ఉమ్మడి జిల్లాలో వీటి సంఖ్య తగ్గింది. అయితే కొత్త మండలాలు ఏర్పాటు కావడంతో.. చాలా మండలాల్లో గ్రామ పంచాయతీలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. దీంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. మావల మండలంలో 3 ఎంపీటీసీ స్థానాలు, పెంబి, భీమారం, పెంచికల్‌పేట్, భీమిని, లింగాపూర్, సిర్పూర్(యు) మండలాల్లో కేవలం నాలుగు చొప్పున ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.

దస్తురాబాద్, కన్నెపల్లి, తాంసి, వేమనపల్లి, మందమర్రి చొప్పున.. బాసర, దిలావర్‌పూర్, గాదిగూడ, సిరికొండ మండలాల్లో 6చొప్పున ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. దీంతో మావల లాంటి మండలాల్లో ఇద్దరు ఎంపీటీసీ మద్దతు ఉంటే ఎంపీపీ పదవి దక్కించుకోవచ్చు. చాలా చోట్ల 2-3మంది ఎంపీటీసీ సభ్యుల మద్దతు ఉంటే సరిపోతోంది. మెజారిటీ మండలాల్లో 4-5మంది ఎంపీటీసీ సభ్యుల మద్దతు ఉంటే ఎంపీపీ పదవి కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. దీంతో నాలుగు జిల్లాల్లోనూ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవులకు తీవ్రంగా పోటీ నెలకొంది. తాము పోటీ చేసే ఎంపీటీసీ స్థానంలో గెలిస్తే.. ఎంపీపీ అయ్యేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు జడ్పీటీసీ సభ్యునిగా గెలిస్తే జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కించుకోవచ్చనే భావనతో పెద్ద సంఖ్యలో ఆశావహులు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆసక్తి చూపుతున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...